ఏపీలో లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా? ఉంటే… ఆయన సిట్ విచారణకు ఎందుకు డుమ్మా కొట్టారు? మీరు అడిగినదానికంటే ఒక రోజు ముందే వస్తా… నిజాలన్నీ చెప్పేస్తా… కాస్కోండి… అంటూ ఓ వీరలెవల్లో స్టేట్‌మెంట్ ఇచ్చేసిన సాయి ఎందుకు వెనక్కి తగ్గారు? ఆయనది వైసీపీని టెన్షన్ పెట్టాలన్న ఉద్దేశ్యమా? లేక నిజంగానే విషయం ఉందా? లేక సడన్ షాకివ్వడానికి ప్లాన్ చేస్తున్నారా? ఏపీ లిక్కర్ స్కామ్‌లో వాట్ నెక్స్ట్? ఏపీ పాలిటిక్స్‌లో లిక్కర్ ప్రకంపనలు రేగుతున్నాయి. ఒకదానికి మంచి మరొకటి అన్నట్టుగా వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందన్న కూటమి నేతల ఫిర్యాదుతో మేటర్ మొదలైంది. దీనిపై పది నెలల నుంచి సిట్ దర్యాప్తు జరుగుతూనే ఉంది. అయితే…అందులో వైసీపీ నేతల పాత్ర ఎంత వరకు ఉంది? దొరికిన ఆధారాలు ఏంటన్న విషయం ఎక్కడా లీకులు రాకుండా జాగ్రత్త పడుతోంది ప్రభుత్వం. కానీ… ఇందులో సూత్రధారులు, పాత్రధారులు మాత్రం వైసీపీ కీలక నేతలేనన్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కాకినాడ పోర్ట్ కేసు విచారణ కోసం వెళ్ళిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి… బయటికి వచ్చినప్పుడు మద్యం కేసు గురించి ప్రస్తావించారు. ఏపీ లిక్కర్ స్కామ్‌కు కర్త, కర్మ, క్రియ మొత్తం అప్పటి ప్రభుత్వ ఐటీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ ఆయన చేసిన కామెంట్‌తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది వైసీపీ. దీంతో పార్టీలో కొత్త చర్చ మొదలైంది. తాను సురక్షితంగా బయటపడాలని అనుకుంటున్నారో…. లేక పార్టీలో తనను ఇబ్బంది పెట్టిన వాళ్ళ సంగతి చూడాలని అనుకుంటున్నారోగానీ…. సాయిరెడ్డి మాత్రం ఓ రేంజ్‌లో ఇరికించేశారని వైసీపీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయట. మద్యం కేసు విచారణకు వస్తే తనకు తెలిసిన సమాచారం మొత్తం సిట్ అధికారులకు ఇస్తానంటూ
మీడియా సాక్షిగాప్రకటించడంతో… సాయిరెడ్డి ఎలాంటి సంచలనాలు బయటపెడతారోనన్న ఉత్కంఠ పెరిగింది. అటు కేసు దర్యాప్తులో భాగంగా… ఇప్పటికే కీ పర్సన్‌గా భావిస్తున్న రాజ్ కసిరెడ్డికి మూడు సార్లు నోటీసులు ఇచ్చింది సిట్. అయినా ఆయన నుంచి స్పందన లేదు. ఈనెల 19న విచారణకు రావాలన్నది తాజా నోటీస్ సారాంశం. మరోవైపు ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసిన సిట్ ఈనెల 18న విచారణకు రమ్మని ఆయన్ని కోరింది. మిధున్ రెడ్డితో పాటు మద్యం ఉత్పత్తి దారులు, వ్యాపారులను కూడా పిలిచి అందరిని కలిపి ప్రశ్నించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇలాంటి సమయంలో సాయిరెడ్డి సిట్ ముందుకు వస్తే ఎలాంటి సంచలనాలు బయటికి వస్తాయోనన్న ఉత్కంఠ రేగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఈ కేసులో వైసీపీ నాయకులకు ఉచ్చు గట్టిగానే బిగుస్తుందన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో… ఈనెల 18న విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది సిట్. అయితే… మీరు చెప్పిన టైం కంటే… ఒకరోజు ముందుగానే విచారణకు వస్తానని సిట్‌కు సమాచారం ఇచ్చారు సాయి. అందుకు అట్నుంచి కూడా… సై… మేం సిద్ధం అంటూ రిప్లయ్ వచ్చింది. దీంతో…. మొన్నటిదాకా వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించి…. లోతుపాతులన్నీ తెలిసిన సాయిరెడ్డి ఎలాంటి సంచలనాలకు బీజం వేస్తారోనని ఉత్కంఠగా ఎదురు చూశారు అంతా.
ఒక దశలో అయితే…. అసలు సాయిరెడ్డి ఇచ్చే సమాచారంతో వైసీపీ ముఖ్య నాయకుల అరెస్టులు కూడా ఉంటాయన్న ప్రచారం సైతం జోరుగా జరిగింది. కట్ చేస్తే…. సిట్‌కే షాకిచ్చారు విజయసాయి. వేరే కారణాలతో నేను విచారణకు రాలేనని సందేశం పంపడంతో…. అసలీ కేసులో ఏం జరుగుతోంది? సాయిరెడ్డి సడన్‌గా ఎందుకు ప్లేట్ ఫిరాయించారన్న చర్చ మొదలైంది. మద్యం కేసులో ఆయనను నిందితుడిగా కాకుండా సాక్షిగానే పిలవటంతో అరెస్టు భయం ఎలాగూ లేదు. అయినాసరే…. డుమ్మా కొట్టడానికి కారణాలేంటన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామంతో… వైసీపీ ముఖ్య నాయకులు హమ్మయ్య అని ప్రస్తుతానికి ఊపిరి తీసుకున్నా…. మరోసారి ఎంట్రీ ఇస్తే ఎలాంటి బాంబులు పేలుస్తారన్న భయాలు మాత్రం అలాగే ఉన్నాయట. పార్టీకి ఆయన కొరకరాని కొయ్యలా మారారని, ఎప్పుడు ఏ విషయాలు బయటపెట్టి రచ్చ చేస్తారోనని పై స్థాయిలో టెన్షన్ పడుతున్నట్టు వైసీపీ కేడరే చెప్పుకుంటోందట. నిజంగానే లిక్కర్ స్కాంలో కీలక ఆధారాలు గనుక ఇస్తే… వైసీపీలో ఎవరికి మూడుతుంది? సాయిరెడ్డి చెప్పినట్టు వ్యవహారం మొత్తం రాజ్ కసిరెడ్డి చుట్టూనే తిరుగుతుందా లేక మరెవరినైనా కార్నర్ చేస్తారా అన్న అనుమానాలను గట్టిగానే ఉన్నాయట పార్టీలో. అయితే… ప్రస్తుతం సాయిరెడ్డి సాక్షిగా ఈ కేసు విచారణకు వెళ్తున్నారా.. లేక అప్రూవర్‌గా మారారా.. అన్నది తెలియాల్సి ఉందంటున్నారు పరిశీలకులు. మొత్తానికి పరిస్థితిని చూస్తుంటే మాత్రం… వైసీపీ ముఖ్యుల చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు కనిపిస్తోందన్న అనుమానాలు పెరుగుతున్నాయట. అదే సమయంలో సాయిరెడ్డి దగ్గర నిజంగానే ఆధారాలు ఉన్నాయా? వాటిని సిట్‌కు ఇవ్వాలనుకుంటున్నారా? లేక వైసీపీకి ఝలక్ ఇద్దామనుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.