అక్కడ ఇసుక మాఫియా… రెండు నదుల్ని అడ్డంగా దోచేస్తోందా? అడ్డొచ్చేవాళ్ళు ఎవరైనా సరే… ఇక అంతే సంగతులని వార్నింగ్ ఇస్తోందా? ఇసుక మాఫియాకు లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉందన్న ఆరోపణల్లో నిజమెంత? ఇతరులు ఇసుక రీచ్‌ల్లో అడుగుపెడితే… దబిడి దిబిడేనని అంటున్నది ఎక్కడ? ఎందుకంత బరితెగింపు? ఇష్టం వచ్చినట్టు తోడుకో…. నచ్చిన రేటుకు అమ్ముసుకో…. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియెజకవర్గంలో వినిపిస్తున్న స్లోగన్ ఇదేనట. దొరినంత దోచేయ్ అన్నట్టుగా సాగుతోందట ఇసుక దందా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆమదాలవలసలో అక్రమ ఇసుక రవాణా అడ్డుసుడిగా జరిగిపోతోందన్నది లోకల్ టాక్. రాత్రి, పగలు తేడా లేకుండా లారీల్లో విశాఖరు తరలించేసి సొమ్ముచేసుకుంటోందట ఓ ముఠా. ఇందులో ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరగణానిదే ప్రధాన పాత్ర అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో. ఈ విషయంలో మాట వినని సొంత పార్టీ వాళ్ళని కూడా ఉపేక్షించడం లేదని అంటున్నారు. టీడీపీ మూలాలున్న సనపల సురేష్ అనే వ్యక్తి ఇసుక ఆగడాలను గురించి ప్రశ్నించడంతో అతనిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్టు చెప్పుకుంటున్నారు. సురేష్‌ను చితగ్గొట్టిన ఇసుకమాఫియా మరింతగా పేట్రేగిపోతోందట. వంశధార, నాగావళి నదులు రెండూ… నియోజకవర్గం మధ్య నుంచి ప్రవహిస్తుండటం ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులకు వరంలా మారిందని అంటున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ర్యాంపుల కంటే…. ఎలాంటి పర్మిషన్స్ లేనివే ఇక్కడ ఎక్కువగా రన్ అవుతున్నాయట. ఉచిత ఇసుక విధానం అమలులోకి వచ్చాక ఫేక్ బిల్లులతో పెద్ద ఎత్తున విశాఖపట్నంకు తరలిస్తున్నారట.
తమ నాయకుడి అండ చూసుకుని ఆ బ్యాచ్ మొత్తం… ఎవడైతే మాకేంటి… అన్నట్టుగా వ్యవహరిస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి ఆమదాలవలసలో. ప్రశ్నించిన వాళ్ళని చితకబాదడంతోపాటు… వాళ్ళ మీద పాత కేసులు ఏమన్నా ఉన్నాయేమో… చూడమంటున్నారట. తాజాగా ఆమదాలవలస వైసిపి ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ను పొందూరు మండలం బోడ్డేపల్లిలో టిడిపి నేతలు అడ్డుకున్నారు. అక్రమ ర్యాంపుల్ని పరిశీలిస్తామని వెళ్ళిన వైసిపి బృందాన్ని దారిలోనే బైక్ లు అడ్డుపెట్టి అడ్డుకున్న ఇసుక అక్రమ రవాణాదారులు… నడిచి కూడా వెళ్ళనీయకుండా గెడ్డపలుగులు , పారలు తీసుకుని రోడ్డుపైనే నిలిపేశారట. మేం ఇసుక తీసుకుంటాం , అమ్ముకుంటాం… మధ్యలో మీరెవరంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్టు చెబుతున్నారు వైసీపీ లీడర్స్. అక్రమ ఇసుక ర్యాంపుల వైపు ప్రతి పక్షనేతలు కూడా కన్నెత్తి చూడకుండా భయపెడుతున్నారన్నది లోకల్ టాక్. ఎమ్మెల్యేకు కూడా ముట్టాల్సినవి ముడుతుండటం వల్లే… అక్రమ ర్యాంపుల దగ్గర అలా బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. అదే సమయంలో కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకోసం పని చేసిన లీడర్స్ తలా ఇంత అని సొమ్ముచేసుకుంటే తప్పేంటని స్వయంగా ఎమ్మెల్యేనే సన్నిహితుల దగ్గర అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ధోరణి… స్థానిక టీడీపీ నేతల్లో కనిపిస్తోందని అంటున్నారు. ఆమదాలవల సెగ్మెంట్ నుంచి విశాఖ పట్నంకు ప్రతి రోజూ వంద లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే… ఎమ్మెల్యే కూన రవికుమార్ మాత్రం ఇసుక మాఫియాతో తనకే సంబంధాలు లేవని అంటున్నారట. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోయేంత నెట్‌వర్క్ ఉన్న ఎమ్మెల్యేకి… ఏడెనిమిది నెలలుగా జరుగుతున్న అక్రమ ఇసుక వ్యాపారం తెలియకుండా ఉంటుందా అన్నది లోకల్ డౌట్. ఎమ్మెల్యేకి సంబంధం ఉన్నా…లేకున్నా… ఇప్పటికైనా ఇసుక మాపియాకు చెక్ పడుతుందో లేదో చూడాలంటున్నారు స్థానికులు.