ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ.. గులాబీ పార్టీకి తలనొప్పిగా మారారా..? కేసుల్లో పీకల్లోతున ఇరుక్కుపోయి నియోజకవర్గాలను గాలికి వదిలేశారా? మాకు దిక్కెవరు మహాప్రభో… అంటూ కేడర్ మొత్తుకుంటోందా? ఆ ఇద్దరి అరెస్ట్ తప్పదన్న ప్రచారం నిజమేనా? ఎవరా ఇద్దరు మాజీలు? ఏంటా కేసుల కహానీ? నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తోంది. పదేళ్లు ఎమ్మెల్యేలుగా హవా నడిపిన నేతలిద్దరూ ప్రస్తుతం కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట. షకీల్..2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత దుబాయ్‌కే పరిమితమై…. నియోజకవర్గానికి ముఖం చాటేశారు. దీంతో బోధన్ బీఆర్‌ఎస్ క్యాడర్ ఆగమాగం అవుతున్నట్టు తెలుస్తోంది. షకీల్ ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు.. ప్రభుత్వ ధాన్యాన్ని పక్క దారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని అమ్ముకుని కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కేసు నమోదైంది. ఆ కేసులో షకీల్ ఆస్తులను అటాచ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్న ప్రచారం నడుస్తోంది. సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించారంటూ 2024 ఫిబ్రవరిలో మాజీ ఎమ్మెల్యే మీద క్రిమినల్ కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు జరక్కముందే దుబాయికి జారుకున్నారాయన. సుమారు 60 కోట్లు విలువ చేసే ధాన్యానికి బియ్యాన్ని తిరిగి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం షకీల్‌కు 10 కోట్ల జరిమానా వేసింది. ఇప్పటి వరకు అటు బియ్యమూ లేవు, ఇటు జరిమానా కట్టలేదు. మాజీ ఎమ్మెల్యే మీద కేసు అలా ఉంటే….ఆయన కొడుకు రాహిల్ మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హిట్ అండ్ రన్ కేసు నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో షకీల్ అరెస్ట్ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భూ వివాదంలో ఇరుక్కున్నారు. భూ కబ్జా ఆరోపణలతో ఇటీవలే హైదరాబాద్ శివారు మోకిల పోలీసులు జీవన్ రెడ్డిని విచారించారు.
శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో ఆయన భూకబ్జాలు చేశారంటూ సామ దామోదర్ రెడ్డి 2024లో మోకీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో జీవన్ రెడ్డితో పాటు ఆయన భార్య రజితారెడ్డి, తల్లి రాజు బాయిపై కేసు నమోదైంది. వాళ్ళిద్దరికీ హైకోర్ట్‌లో బెయిల్ మంజూరైనా… జీవన్ రెడ్డికి బెయిల్ రాకపోవడంతో తనను అరెస్ట్ చేయవద్దంటూ సుప్రీం కోర్టుకు వెళ్లారాయన. జీవన్ రెడ్డిని విచారించాలని, వెంటనే అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది సుప్రీం కోర్ట్. ఈ మేరకు ఇటీవలే మోకిల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు జీవన్‌రెడ్డి. ఇలా… ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలను పోలీస్ కేసులు వెంటాడుతున్నాయి. భూ వివాదంలో జీవన్ రెడ్డి విచారణ ఎదుర్కొంటుంటే.. ప్రభుత్వ ధాన్యాన్ని మాయం చేసిన కేసులో షకీల్ దేశం కానీ దేశంలో తలదాచుకుంటున్నాడు. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కేసుల్లో చిక్కుకోగా.. రెండు నియోజకవర్గాల్లో క్యాడర్ ఆగమాగం అవుతోందట. పైగా వీళ్ళిద్దరి తీరు పార్టీకి తలనొప్పిగా మారిందన్నది ఇంటర్నల్ టాక్. ఇద్దరి విషయంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని అనుకుంటున్న టైంలో…ఇద్దరి చుట్టూ కేసుల ఉచ్చులు, నియోజకవర్గాల్లో దిక్కు మొక్కులేని కారణంగా…. పార్టీ మీద ప్రభావం పడుతుందని కేడర్‌లో ఆందోళన వ్యక్తం అవుతోందట. వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని రెండు చోట్ల పరిస్థితిని చక్కదిద్దకుంటే గట్టి దెబ్బే తగులుతుందని అంటున్నారు కార్యకర్తలు.