ఒక నాయకుడి కక్కుర్తి నియోజకవర్గం మొత్తం మీద జనసేనను డిఫెన్స్‌లో పడేసిందా? జనం అడిగే ప్రశ్నలకు నాయకులు సమాధానం చెప్పుకోలేకపోతున్నారా? వరద బాధితుల కోసం సేకరించిన బియ్యాన్ని అమ్ముకున్న ఆ పార్టీ నేత ఎవరు? నిలదీస్తే ఇప్పుడు పార్టీకి విరాళం ఇస్తాననడాన్ని ఎలా చూడాలి? పార్టీ పరువును నిలువునా బజారుకీడ్చిన ఆ నేత విషయంలో అధిష్టానం వైఖరేంటి? నిరుడు వరదలు విజయవాడను అల్లకల్లోలం చేసేశాయి. ఆపదలో ఉన్న బాధితులకు అండగా మేం ఉంటామంటూ… పెద్ద ఎత్తున దాతలు ముందుకొచ్చారు. తోచిన సాయం చేశారు. అంతవరకు బాగానే ఉంది. అయితే… అదే సమయంలో కనీస మానవత్వం లేకుండా శవాల మీద పేలాలేరుకునే బ్యాచ్‌లు కూడా తమ పని తాము చేశాయట. బాధితులకు సాయం పేరిట వసూల్ రాజాలు కొందరు బాగానే వెనకేసున్నట్టు అప్పట్లోనే చెప్పుకున్నారు. కానీ… తాజాగా అలాంటి బాగోతం ఒకటి బయటపడి సొంత పార్టీ నాయకులే నిలదీసేసరికి తూచ్…. నాకేం సంబంధం లేదు. కావాలంటే ఇప్పుడా డబ్బును పార్టీ ఫండ్‌కు ఇచ్చేస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడట. అసలు విషయం ఏంటంటే…. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సువర్ణరాజు అప్పట్లో వరదబాధితుల కోసం బియ్యం సేకరించారు. వరద సాయం కోసం పార్టీ శ్రేణులు నాలుగు మండలాల్లో ఊరూరు తిరిగి బియ్యం సేకరించాయి. వివిధ వర్గాల నుంచి సేకరించిన బియ్యాన్ని విజయవాడ వరద బాధితులకు పంపే బాధ్యత తీసుకున్న సువర్ణరాజు….ఆ పని చేయకుండా తన కక్కుర్తి బుద్ధి ప్రదర్శించారట. దాదాపు 15 లక్షల రూపాయల విలువైన బియ్యాన్ని బాధితులకు పంపకుండా బయట మార్కెట్‌లో అమ్మేసుకున్నట్టు ఇప్పుడు గుప్పుమనడంతో…. జనసేన శ్రేణులే అవాక్కవుతున్నట్టు సమాచారం. పార్టీ నాయకులు కొందరైతే…. నేరుగా ఇన్ఛార్జ్ సువర్ణరాజునే నిలదీసినట్టు చెప్పుకుంటున్నారు. అంతా గుట్టుగా జరిగిపోయింది. నేను సూపర్ సక్సెస్… మోసంలో నా అంత మోనగాడు లేడని జనసేన ఇన్ఛార్జ్ జబ్బలు చరుచుకుంటున్న టైంలో… ఇలా సొంత పార్టీ నాయకులే నిలదీయడంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయిందట ఆయనగారికి. ఇక తప్పించుకోలేక, చేసేదేం లేక… ఆ డబ్బు మొత్తాన్ని పార్టీకి విరాళంగా ఇస్తానని స్వరం మార్చాడట. ఈ విషయాన్ని మంత్రి కందుల దుర్గేష్‌కు చెప్పానంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారట సువర్ణరాజు. అయినా జనసైనికులు తగ్గకుండా… వివాదం ముదరడంతో రెండ్రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో బియ్యం పంచాయితీ జరిగినట్టు సమాచారం. అప్పటికీ మేటర్ కొలిక్కి రాకపోవడంతో…. కొందరు నాయకులు విషయాన్ని జిల్లా ఇంఛార్జి మంత్రి మనోహర్ దృష్టికి తీసుకువెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు.
ఇప్పుడీ బియ్యం బొక్కిన వ్యవహారం గోపాలపురం నియోజకవర్గంలో కలకలం రేపుతోంది. సాయం కోసం సేకరించిన బియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడానికి కాస్తన్నా ఇంగితం ఉండాలి కదా… మరీ అంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తే ఎలాగంటూ జనసేనలోని ఓ వర్గం దుమ్మెత్తి పోస్తోందట. అయితే ఇన్ఛార్జ్ మాత్రం… ఆ డబ్బు పది లక్షల రూపాయలు తన దగ్గరే ఉందని, పార్టీకి విరాళం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే కుదరడంలేదని చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. అయితే… ఈ ఎపిసోడ్ మొత్తం వింటున్న వాళ్ళకు ఇక్కడే ఓ అతి ముఖ్యమైన డౌట్ వస్తోంది. విజయవాడ వరదలు వచ్చిపోయి చాలా రోజులైంది. అసలా ఎఫెక్టెడ్ ఏరియాల్లో కూడా ఆసంగతి మర్చిపోతున్నారు. అలాంటిది ఇప్పుడు గోపాలపురంలో ఈ స్కామ్ ఎలా బయటికొచ్చిందని అడిగితే… దాని వెనకా ఓ ఇంట్రస్టింగ్ స్టోరీ ఉందని అంటున్నారు. నామినేటెడ్ పదవుల కోసం గోపాలపురం నియోజకవర్గం జనసేన నాయకులు ఇటీవల మీటింగ్ పెట్టుకున్నారట. ఆ సందర్భంగా తమకు పదవులు దక్కవని క్లారిటీ వచ్చిన నాయకులే ఈ మేటర్‌ని లీక్ చేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏదైనారే… విషయం బయటికి రావడంతో… మొత్తం జనసేన నాయకుల మీదే మండిపడుతున్నారట నియోజకవర్గ ప్రజలు. ఆపదలో ఉన్నవారికి బుక్కెడు బువ్వ కోసం మేం బియ్యం ఇస్తే… మీరు అమ్మేసుకోవడం …. ఇప్పుడు పార్టీకి విరాళం ఇస్తామనడం ఏంటని మండిపడుతున్నారట. జనసేనలోని ఓ వర్గం కూడా ఈ వాదనను సమర్ధిస్తున్నట్టు చెబుతున్నారు. సాయం చేయడంలో మనం ఎప్పుడూ ముందుండాలని అధినాయకత్వం పదేపదే చెబుతున్నా…. ఇలాంటి శవాల మీద పేలాల బ్యాచ్‌ల వల్ల పరువు బజారున పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్నా… ఇప్పుడు రచ్చకెక్కిందిగనుక అధిష్టానం దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలంటున్నారు జనసేన కార్యకర్తలు.