ఒకప్పుడు హాట్ హాట్ పాలిటిక్స్‌కు కేరాఫ్ ఆయన. ఇప్పుడు మాత్రం అంతా రామ మయం అంటూ… భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. పండగ ఏదైనా సరే… మన బ్రాండ్ ఉండాల్సిందేనంటూ గ్రాండ్‌గా జరిపించేస్తున్నారు? రాజకీయాలు వదిలేసి రామ భజన చేస్తున్న ఆ నాయకుడెవరు? మార్పు వెనక మర్మం ఏంటి? మాజీ ఎమ్మెల్యే, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఫైర్ బ్రాండ్, మాస్ లీడర్ ట్యాగ్ లైన్స్ కూడా ఉన్నాయి ఆయనకు. పార్టీలో కీలక నేతగా ఉన్న జగ్గారెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచి ఉంటే మాత్రం కచ్చితంగా మంత్రి పదవి వచ్చేదన్నది ఆయన అనుచరుల మాట. పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే తనదైన శైలిలో రివర్స్ అటాక్ చేసే ఈ మాజీ ఎమ్మెల్యే కొన్ని రోజులుగా పొలిటికల్ మౌనవ్రతం పాటిస్తున్నారట. ఆ మౌనమే…ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మేటర్ చిన్నదైనాసరే… గాంధీభవన్‌లో ప్రెస్ మీట్‌లు పెట్టి మైకును మోత మోగించే జగ్గారెడ్డి…. ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారో ఆయన అనుచరులకు కూడా అర్ధంకావడం లేదట. అకస్మాత్తుగా… ఇలా రాజకీయాలకు దూరం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలవడానికి ఢిల్లీ వెళ్లారు జగ్గారెడ్డి. అపాయిట్ మెంట్ దొరక్కపోవడంతో హైదరాబాద్‌కి తిరిగి వచ్చేశారు. ఆ టూర్ సందర్భంగానే జగ్గారెడ్డిలో కొత్త కొత్త అవతారాలు బయటపడ్డాయట. ఇన్ని రోజులు ఆయన పొలిటికల్ లీడర్‌గానే ప్రజలకు తెలుసు. కానీ… ఒక్కసారిగా తనలోని యాక్టర్‌ని బయటికి తీసుకువచ్చారు. జగ్గారెడ్డి…ఎ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించి… ఉగాదికి హైదరాబాద్ లో సినిమా ఆఫీస్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో సినిమాలో ఆయన సొంత స్టోరీ కూడా ఉంటుందా అన్న చర్చ ఓవైపు జరుగుతోంది. అటు ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్‌కంటే… తన నియోజకవర్గమైన సంగారెడ్డిలోనే ఎక్కువగా గడుపుతున్నారు జగ్గారెడ్డి. అదీకూడా రాజకీయాలకు దూరంగా….. ఓల్డ్ బస్టాండ్ దగ్గరున్న రాం మందిర్‌లో భజనలు చేస్తూ… భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఇక ఏ పండగ వచ్చినా… సంగారెడ్డిలో హంగామా చేస్తున్నారు. మహాశివరాత్రి రోజున సంగీత విభావరి పెట్టడం, హోలీ వేడుకల్ని అదే స్థాయిలో నిర్వహించడం లాంటి వాటిని చూసి ఔరా….. ఏమి ఈ మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారట స్థానికులు. అలా… హోలీ అయ్యిందో లేదో ఇప్పుడు మైనార్టీలకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు.
అది అయిపోగానే ఉగాది వేడుకలు, ఆ తర్వాత శ్రీ రామ నవమిని రాష్ట్ర స్థాయిలోనే ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇలా… పండగ ఏదైనా కేరాఫ్ సంగారెడ్డి…జగ్గారెడ్డి అన్నట్టుగా చేయడం వెనక వ్యూహం ఉందా? లేక మనిషి పూర్తిగా మారిపోయారా అన్నది అర్ధంగాక జుట్టు పీక్కుంటున్నారట నియోజకవర్గంలో. ఇన్నాళ్లు జగ్గారెడ్డిని ఫుల్ టైం పొలిటీషియన్‌గా చూసిన జనం త్వరలో సినిమా థియేటర్లలో పార్ట్ టైం యాక్టర్‌గా చూడబోతున్నారు. జగ్గారెడ్డి కాస్తా…. జగ్గానంద స్వామిగా మారడం, అటు సిల్వర్ స్క్రీన్ మీద జగ్గూభాయ్‌లా ఎంట్రీ ఇవ్వడం… అసలీ వేరియేషన్స్ ఏంటంటూ…గందరగోళంలో పడే వాళ్ళ సంఖ్య పెరుగుతోందట. పాలిటిక్స్ అంటే ప్రాణం పెట్టే జగ్గారెడ్డిలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో అర్థం కాక అనుచరగణం సైతం తలలు పట్టుకుంటున్నట్టు సమాచారం. మార్పు మంచిదేనని కొందరు అంటున్నా…. మరి కొందరు మాత్రం ఆయన అంత తేలిగ్గా మారే రకం కాదు…వెనుక ఏదో మర్మం ఉండి ఉంటుందని అంటున్నారట. ఇలా ఎవరికి తోచినట్టు వారు విశ్లేషించుకుంటున్నా….. అట్నుంచి మాత్రం ఆన్సర్ లేదు. ఎప్పుడూ పవర్ పాలిటిక్స్‌లో మాటలతో హీట్ పుట్టించే జగ్గారెడ్డి… ఇప్పుడు రామ భజనలు చేసుకుంటూ… భక్తి పారవశ్యంలో మునిది లేలడం మాత్రం వింతగానే ఉందంటున్నారు పరిశీలకులు. దీని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏంటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.