ఏపీ సీఎం చంద్రబాబు పదే పదే.. అదే విషయాన్ని సుప్రభాతంలా చెబుతున్నా… కొందరు టీడీపీ నాయకుల చెవికెక్కడం లేదా? ప్రత్యేకించి సొంత జిల్లాలో కొందరికి ఆయన మాటంటే లెక్కే లేకుండా పోయిందా? అదే బాధ ఇప్పుడు పార్టీ అభిమానుల మనసుల్ని సైతం మెలిపెడుతోందా? అసలే విషయంలో సీఎం మాటను పట్టించుకోలేదు జిల్లా ప్రడాప్రతినిధులు? వేల కోట్ల రూపాయల అవకతవకల మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? వైసీపీ నాయకులకు సహాయం చేస్తే పాముకు పాలు పోసినట్టే….వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయవద్దు….. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఇటీవలి కాలంలో తరచూ పార్టీ సమావేశాలు, ఎమ్మెల్యేల మీటింగ్స్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అంటున్న మాటలివి. అలా చెప్పి… ఒక రకంగా తమ మంత్రులు, ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగే ఇస్తున్నారాయన. అసలు అలాంటి వారికి సహాయం చేస్తే పార్టీకి ద్రోహం చేసినట్టేనని, కష్టపడిన కార్యకర్తలకు ఇక ఏం విలువ ఉంటుందని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొస్తున్నారు బాబు. కానీ… సీన్ కట్ చేస్తే…. ఆయన సొంత జిల్లాలోనే… అసలు ఎక్కడైతే మొట్టమొదట ఆయన ఆ ప్రకటన చేశారో…. అదే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో స్వయంగా ముఖ్యమంత్రికే షాకిచ్చే వ్యవహారాలు జరుగుతున్నాయట. ఇప్పుడు జిల్లా పార్టీ కేడర్ మొత్తం ఇదే విషయాన్ని కోడై కూస్తోంది. రాయలసీమ మొత్తం మీద నంబర్‌వన్‌గా చెప్పుకునే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ పోస్ట్…. పది నెలల నుంచి ఖాళీగా ఉంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అధికారులు పోటీలు పడుతూ… తీవ్ర స్థాయిలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరైతే…. నాకు అక్కడ పోస్టింగ్ కావాలి. మీకేం కావాలో, ఎంత కావాలో చెప్పండంటూ… ఆ పని చేసిపెట్టగలరన్న నమ్మకం ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల దగ్గర డైరెక్ట్‌గా బేరం పెడుతున్నారట. అలా ఎందుకంటే… అంత హాట్ సీట్ ఇది అని అంటున్నారు స్థానికంగా. రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నుంచి అత్యధిక ఆదాయం వచ్చే…సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల టాప్ లిస్ట్‌లో ఉంటుంది రేణిగుంట కార్యాలయం. ఈ పరిధిలో అనేక పరిశ్రమలు, విద్యాసంస్థలు ఉన్నాయి. అలాగే అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. మండలం మొత్తం.. జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుంది. అందుకే ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ పెరిగి ధరలకు రెక్కలు వచ్చాయని అంటారు. ఇక రిజిస్ట్రేషన్స్ టైంలో సహజంగానే బల్లకింద వ్యవహారాలు ఎక్కువని, అధికారులు, సిబ్బంది అంతా కలిసి ఒకటి, రెండు శాతం డిమాండ్ చేసిమరీ తీసుకుంటారన్న ఆరోపణలున్నాయి.
అదే ఈ సబ్ రిజిస్ట్రార్ పోస్ట్‌కు డిమాండ్ పెరగడానికి అసలు కారణం అన్నది లోకల్ టాక్. మరి అంత డిమాండ్ ఉన్న పోస్ట్ పది నెలల నుంచి ఖాళీగా ఎందుకుదని అడిగితే…. అసలు మతలబంతా అక్కడే ఉందని అంటున్నారు కొందరు. గతంలో ఇక్కడ పనిచేసి సస్పెండ్ అయిన ఆనంద్ రెడ్డి…. తిరిగి తానే వచ్చేందుకోసం ఇన్నాళ్ళు ఎవ్వరూ రాకుండా చక్రం తిప్పినట్టు గుసగుసలాడుకుంటున్నాయి జిల్లా రెవెన్యూ వర్గాలు. రేణిగుంట సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ లావాదేవీల ద్వారా…ప్రభుత్వానికి ఏటా కనీసం 155 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందట. అంత ప్రాముఖ్యం ఉండి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధి ఎక్కువగా ఉన్న ఈ ఆఫీస్‌లో అతి ముఖ్యమైన పోస్ట్‌ని 10 నెలల నుంచి ఖాళీగా పెట్టి సీనియర్ అసిస్టెంట్‌తో బండి లాగించేస్తున్నారంటే…. తెర వెనక ఎంత బలమైన శక్తులు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. పది నెలల నుంచి ఖాళీగా ఉన్న ఈ పోస్ట్‌లోకి రకరకాల ఆరోపణలతో సస్పెండ్ అయి వివాదాస్పదుడి ముద్ర ఉన్న ఆనంద్‌రెడ్డే తిరిగి వచ్చి జాయినవడంతో… అంతా అవాక్కయ్యారట. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్‌గానే ఏళ్ళ తరబడి పనిచేసి… అత్యంత వివాదాస్పద అధికారిగా ముద్రపడ్డ ఆనంద్‌రెడ్డి మీద రకరకాల ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో… కోట్ల రూపాయల విలువైన భూములను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి కుటుంబాలకు ధారా దత్తం చేశాడని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అలాంటి అధికారికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో… తిరిగి అదే పోస్ట్ ఎలా ఇచ్చారంటూ షాకవుతున్నారట పార్టీ నాయకులు. ఇంకొందరు టీడీపీ అభిమానులైతే… దీన్నసలు జీర్ణించుకోలేకపోతున్నారట. అలా ఎలా జరిగిందని ఇంకొందరు కాస్త లోతుల్లోకి వెళ్ళిఆరా తీస్తే… జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ పేరు బయటికి వచ్చి ఇంకా మైండ్ బ్లాంక్ అయిందని అంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులంతా కలిసి మంత్రి సహకారంతో….ఆనంద్‌రెడ్డికి మళ్ళీ పోస్టింగ్ ఇప్పించారన్న ప్రచారం కలకలం రేపుతోంది. దీన్నే సోషల్ మీడియాలో పెట్టి తమ నాయకుల్ని చెడుగుడు ఆడేసుకుంటున్నారు స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు. ఈ వ్యవహారంలో మూడు కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ…. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. వైసీపీ వాళ్ళకు సహకరించవద్దని స్వయంగా సీఎం చంద్రబాబు ఓవైపు మొత్తుకుంటుంటే…. ఇప్పుడు ఏకంగా ఆయన సొంత జిల్లాలోనే… వైసీపీ వాళ్ళతో అంటకాగి సస్పెండ్ అయిన అధికారిని తిరిగి పాత పోస్ట్‌లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టడమంటే…. అధ్యక్షుడిని మోసం చేయడం కాదా అని అడుగుతున్నారట తెలుగుదేశం కార్యకర్తలు. అంటే… వీళ్ళకసలు చంద్రబాబు మాటంటే లెక్కేలేదా? డబ్బుల కోసం ఏ గడ్డి అయినా తింటారా అంటూ… ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. కొందరైతే మాటలతో సరిపెట్టకుండా… సీఎంవోకు భారీ స్థాయిలో ఫిర్యాదులు పంపినట్టు సమాచారం. సొంత జిల్లాలోనే వైసీపీ ముద్ర ఉన్న అధికారిని అందలం ఎక్కిస్తే… ఇక చంద్రబాబు మాటకు విలువ ఏముందంటూ అసంతృప్తిగా ఉన్నారట జిల్లా టీడీపీ సీనియర్స్. ఇక పోస్టింగ్ వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన ఆనందరెడ్డిని ఆఫీస్‌కు వెళ్ళిమరీ పెద్ద సంఖ్యలో వైసీపీ నాయకులు, రియలెస్టేట్ వ్యాపారులు కేక్ కట్ చేసి మరీ అభినందనలు తెలిపారట. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంతకంటే దారుణం ఏముంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు. సీఎం సొంత జిల్లాలో పరిస్థితులు ఎలా టర్న్ అవుతాయో చూడాలి మరి.