బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల విషయంలో కొందరు నాయకులు నారాజ్‌గా ఉన్నారా? దగ్గరిదాకా వచ్చిన అవకాశం చేజారిపోయినట్టు ఫీలవుతున్నారా? చూసినన్నాళ్లు చూశాం… ఏదో… ఇప్పుడే కదలిక వస్తోందనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ అవరోధాలేంటని ఫీలవుతున్నారా? పార్టీ పాతికేళ్ళ పండగతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాల్సిన నాయకులు ఎందుకు ఫీలవుతున్నారు? వాళ్ళకు వచ్చిన కష్టం ఏంటి? ఈ ఏడాది పాతికేళ్ళు పూర్తి చేసుకుంటున్న బీఆర్‌ఎస్…. రజతోత్సవ వేడుకల్ని గ్రాండ్‌గా జరుపుకునేందుకు ప్లాన్ చేస్తోంది. కానీ… పార్టీ నాయకులు కొందరికి ఆ వేడుకలే శాపంగా మారుతున్నాయన్న టాక్ నడుస్తోంది. అదేంటీ… పార్టీ వేడుకలంటే గులాబీ నాయకులందరికీ ఇంటి పండగ లాంటివి కదా..? అవెలా శాపం అవుతాయని అంటే… అక్కడే ఉంది అసలు మేటర్ అంటున్నారు పరిశీలకులు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే… మీకే అర్ధమైపోతుందని కూడా వివరణ ఇస్తున్నారట. రజతోత్సవం కారణంగా చాలామంది పార్టీ పదవులకు దూరం కావాల్సి వస్తోందని చెప్పుకుంటున్నారు. అసలు టీఆర్‌ఎస్… బీఆర్ఎస్‌గా మారాక ఇంతవరకు పూర్తిస్థాయిలో రాష్ట్ర కమిటీల్ని వేయలేదు. కేవలం జిల్లా అధ్యక్షులతోనే నెట్టుకొస్తోంది పార్టీ. అధినేత, వర్కింగ్ ప్రెసిడెంట్‌తో పాటు జిల్లాకు ఒక్కరు మాత్రమే ఉండడంతో మిగతా పార్టీ పదవుల కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. నేడో రేపో పదవులు అనుకుంటున్న టైంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ తెర మీదికి వచ్చాయి. దీంతో ఆ వేడుకల తర్వాతనే ఏ కమిటీలైనా అని అంటోందట గులాబీ అధిష్టానం. అధికారం పోయాక బీఆర్ఎస్ నుంచి చాలామంది వివిధ పార్టీల్లోకి వెళ్లారు. జంప్ అయిన వాళ్ళలో కీలక నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడసలు పాత కమిటీల్లోని వారు ఎవరు పార్టీలో ఉన్నారో, ఎవరు లేరో కూడా అర్ధంకాని పరిస్థితి. సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత కమిటీలు వేయాలని ఎప్పటినుంచో కేసీఆర్ భావిస్తున్నా.. కార్యరూపం దాల్చట్లేదు. ఏప్రిల్ 27న జరగబోయే ప్లీనరీ బహిరంగ సభలోపే ఈ కమిటీలు వేస్తారని ప్రచారం జరిగింది. అంతకు ముందు సంక్రాంతి, దసరా, దీపాళి అంటూ రకరకాల ముహూర్తాలు చర్చలోకి వచ్చాయి.. కానీ… ఏవీ జరగలేదు.
పండగలన్నీ అయిపోయాక రజతోత్సవ వేడుకల ముహూర్తం వంతు వచ్చింది. దాంతో ప్లీనరీలోపే పార్టీ కమిటీలు వేస్తారని అందరూ భావించారు. కమిటీల్లో పదవులు వస్తే… ప్లీనరీ టైంలో ఓ ఊపు ఊపేద్దాం… మనమంటో చూపిద్దాం అని అనుకున్నారట చాలామంది ఆశావహులు. కొత్తగా పదవుల ఊపుతో బహిరంగ సభకు జనాన్ని భారీగా తరలించి అధినేత మెప్పు పొందాలన్నది వాళ్ళ ప్లాన్ అట. కానీ… ఇక్కడే తేడా పడింది. తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలిచిందన్నట్టుగా… వీళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటే… అధిష్టానం మరోలా థింక్ చేసిందట. ప్లీనరీ ముందు రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలు వేస్తే… కొత్త తలనొప్పుల్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుందని అనుకుంటున్నారట పెద్దలు. పార్టీలో కీలక పదవులు వచ్చినవాళ్లు సంతోషంతో పబ్లిక్‌ని తీసుకువస్తారేమో కానీ, పదవులు రాని వాళ్ళు మాత్రం నారాజ్ తో మీటింగ్ ముఖం కూడా చూడరని, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఆ రచ్చ మనకు అవసరమా అని అనుకుంటోందట గులాబీ అధిష్టానం. అందుకే పాతికేళ్ళ వేడుకలు పూర్తయ్యేదాకా… పదవుల పందేరాన్ని ఆపవచ్చంటున్నారు. ఎలాగూ ఇన్నేళ్ళు ఆగాం కాబట్టి… ఈ నెల రోజుల్లో మునిగిపోయిందేముంది… తర్వాతనే తీరిగ్గా కొత్త కమిటీలు వేసుకోవచ్చని అనుకుంటున్నట్టు సమాచారం. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టలేదు గులాబీ పెద్దలు. అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి కొట్లాడాలంటే…. పార్టీ పదవులు చాలా కీలకంగా మారాయి. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా పదవులు ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది అధిష్టానం. కానీ… మరో నెల రోజులు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తుండటంతో… ఆశావహుల్లో నీరసం ఆవిహించినట్టు చెప్పుకుంటున్నారు. ఆర్థికంగా బలవంతుల్నే కొత్తగా కమిటీల్లోకి తీసుకునే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.అలా ఇవ్వడం ద్వారా పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బంది ఉండదన్నది తెలంగాణ భవన్ పెద్దల ఆలోచన అట. అందుకే ఆచి తూచి వ్యవహరించి పార్టీ పదవులు ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం.