Off The Record: కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైన ఎమ్మెల్యేలు ఎంతమంది..? ఇప్పటికే చేరిపోతారంటూ జరిగిన ప్రచారం వెనుక వ్యూహం ఏంటి..! ఒక్కొక్కరిగా చేరుతారా.. చేరికలపై పీసీసీ ఎత్తుగడ ఎలా ఉండబోతుంది..?
గేట్లు తెరిచాం.. బీఆర్ఎస్ ఖాళీ కావడమే లేటు అని పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి ఆ మధ్యనే అన్నారు. గులాబీ కండువా పక్కన పడేసి ఎమ్మెల్యేలు గంపగుత్తగా కాంగ్రెస్‌లో చేరుతారంటూ గత రెండు రోజులుగా బీభత్సమైన ప్రచారం జరిగింది. తుక్కుగూడ వేదికపైనే జంబో జాయినింగ్స్ ఉంటాయంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. రాహుల్ గాంధీ సమక్షంలోనే అంతా కండువా కప్పుకుంటారు అంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ చూడబోతే, ఆ వేదికమీద చేరికలకు కాంగ్రెస్ పార్టీ అంత ప్రాధాన్యత ఇవ్వలేదని స్పష్టమైంది. నిజానికి ఇప్పటివరకు రాహుల్ గాంధీ ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల చేరికల విషయంలో పార్టీ కండువా కప్పి స్వాగతించిన సందర్భాలు చాలా తక్కువ. కాంగ్రెస్ నాయకత్వం మాత్రం కేవలం పార్టీ మేనిఫెస్టో జనాల్లోకి తీసుకెళ్లడం, ఎన్నికల ప్రచారమే మెయిన్ ఎజెండాగా తుక్కుగూడలో సభ నిర్వహించింది.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గులాబీ నేతల చేరికలపై ఫోకస్ చేసింది కాంగ్రెస్. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిన కేసీఆర్‌కి- అదేరుచి చూపించాలని కాంగ్రెస్ భావించింది. దాంట్లో భాగంగానే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు ఆ పార్టీ చెబుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే.. ఆ ప్రభుత్వం ఐదు నెలలకు మించి ఉండదంటూ కామెంట్లు చేశారు బీఆర్ఎస్ నేతలు. దీంతో బీఆర్స్ పార్టీని రాజకీయంగా దెబ్బతీయాలనే ఎత్తుగడకు కాంగ్రెస్ ప్లాన్ వేసిందని చెప్పుకుంటారు. ఇప్పటి వరకు ముగ్గురు గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. త్వరలోనే మరి కొంతమంది శాసనసభ్యులు కాంగ్రెస్ జెండా ఎత్తుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటు ఎన్నికల లోపు గాంధీభవన్ గూటికి చేరుతారంటూ విస్తృత ప్రచారం జరుగుతోంది. మరి ఆ పదిమంది ఎవరనే దానిపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్లో విపరీతమైన గుసగుసలు, ఊహాగానాలు నడుస్తున్నాయి.
ఫిరాయింపులపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతోంది బీఆర్ఎస్. ఫిరాయింపుల చట్టాన్ని మార్చుతామంటూ చెప్పిన కాంగ్రెస్.. తెలంగాణలో మాత్రం ఎందుకు ప్రోత్సహిస్తోందంటూ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఫిరాయింపులు ఉండవని స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు గులాబీ నేతలు. కానీ జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో ప్రత్యర్థుల నుంచి హెచ్చరికల నేపథ్యంలో, చేరికలను ప్రోత్సహిస్తేనే సేఫ్ అన్న భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే, సర్కారుని నిలబెట్టడానికి మా పని మేము చేస్తామంటూ రేవంత్ పదేపదే చెప్తూ వచ్చారు. ఇలా రెండు పక్షాల మధ్య ఫిరాయింపుల అంశం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఇరకాటంలో పెట్టే ఎత్తుగడను కాంగ్రెస్ సీరియస్‌గా రచిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో గులాబీ జెండా వదిలేసి, కాంగ్రెస్ కండువా కప్పుకునేది ఎవరనేదానిపై ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు.