ఆషాఢం ఆశాజ్యోతిలా కనిపించిన బీఆర్‌ఎస్ పెద్దలకు శ్రావణ గండం పొంచి ఉందా? ఎప్పుడు ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఊపిరి బిగబట్టి చూస్తున్నారా? రకరకాల రీజన్స్ చూపిస్తూ… పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు టెక్నికల్‌గా భయపడేలా చేయాలనుకుంటున్నారా? ఎమ్మెల్యేల ఫిరాయింపుల చుట్టూ మొదలైన కొత్త చర్చ ఏంటి? బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చాక వలసలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నేతలు కొందరు కూడా ఒక్కొక్కరే కొంత కాలంగా పార్టీని వదిలేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే సీట్లు గెల్చుకుంది గులాబీ పార్టీ. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయింది. ఇక ఇప్పటికే పది మంది శాసనసభ్యులు కారు దిగేసి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. అలాగే…8 మంది ఎమ్మెల్సీలు సైతం అధికార పార్టీ గూటికి చేరారు. ఇంకొంత మంది క్యూలో ఉన్నారని, వాళ్ళంతా పార్టీ మారిపోతారని, అసలు ఇటు అసెంబ్లీ, అటు మండలిలో బీఆర్‌ఎస్ సభా పక్షాన్ని సీఎల్పీలో కలిపేసుకుంటారని కూడా ప్రచారం జరిగింది. ఇంకేముంది…. అంతా అయిపోయింది, రేపో మాపో విలీనమే మిగిలిందన్నంతగా మారిపోయింది పరిస్థితి. కానీ… ఆ స్పీడ్‌కు సడన్ బ్రేకులు పడ్డాయి. వాళ్ళు ఆగారా? వీళ్ళు ఆపారా అని చర్చ జరుగుతున్నంతలోనే ఆషాఢం అడ్డొచ్చింది. మంచి రోజులు కావంటూ గోడ దూకుదామనుకున్న ఎమ్మెల్యేలు కాస్త వెనక్కి సర్దుకున్నారట. ఇప్పుడు ఆషాఢం ముగిసింది. శ్రావణం కూడా సగానికి వస్తోంది. మరెందుకాలస్యం అన్న చర్చ మొదలైంది రాజకీయ వర్గాల్లో. అలాగే ఇన్ని రోజులు సీఎం అమెరికా టూర్‌లో ఉన్నారని అనుకున్నా… ఇప్పుడాయన కూడా వచ్చేశారు. ముందు అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యేలు జంప్ అవుతారా? లేక మారుతున్న పరిస్థితులను గమనిస్తూ ఆచితూచి నిర్ణం తీసుకుంటారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదికే పనిలో ఉన్నారు పొలిటికల్ పండిట్స్. ఇదే సమయంలో దొరికిన గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ… ఎమ్మెల్యేల ఫిరాయింపుపై న్యాయ పోరాటం మొదలుపెట్టింది బీఆర్‌ఎస్. పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేయాలంటూ హై కోర్ట్‌లో పిటిషన్ వేసింది గులాబీ నాయకత్వం.
అందుకు సంబంధించిన తీర్పు రిజర్వ్‌లో ఉంది. ఏ రోజైనా ఆ తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఇప్పుడు ఇదే కొందరు ఎమ్మెల్యేల్లో పునరాలోచనకు కారణం అవుతోందన్న వాదన సైతం వినిపిస్తోంది. ఎందుకొచ్చిన రిస్క్…. హై కోర్ట్ తీర్పు వచ్చేదాకా ఆగుదామని అనుకుంటున్నారట కొందరు ఎమ్మెల్యేలు. తీర్పును బట్టి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో… హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సుప్రీం కోర్ట్‌కు కూడా వెళ్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది బీఆర్‌ఎస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తప్పకుండా అనర్హత వేటు పడుతుందని ముందుగానే చెబుతూ… పార్టీ మారాలనుకునే వారిలో ఒక లాంటి భయం పుట్టించే ప్రయత్నం చేస్తోందట గులాబీ అధినాయకత్వం. అయితే సీఎం టూర్ నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు కాబట్టి… ఇక ఆలస్యం చేయకుండా లాగేసే ప్రయత్నం జరుగుతుందన్న భయం కూడా ఉందట ఆ శిబిరంలో. గులాబీ పార్టీ నుంచి మొత్తం 26 మంది పార్టీ మారితే ఎల్పీ విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పది మంది మారిపోయారు. అందుకే తమ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను సీరియస్ గా తీసుకుంది కారు పార్టీ. ఇప్పటికే పార్టీమారిన వారిపై అనర్హత వేటుకు సంబంధించిన తీర్పు తమకు అనుకూలంగా వస్తే..కొత్తగా పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు సైతం సైలెంట్ అవుతారన్నది బీఆర్‌ఎస్ అధిష్టానం ఆశ. అందుకే ఇప్పుడు పార్టీ మీద శ్రావణ మాసం ఎఫెక్ట్ పడకుండా జాగ్రత్తపడుతోందట. మరిప్పుడు కాంగ్రెస్ పెద్దలు వలసలకు ఓకే చెప్పేసి కోర్ట్ తీర్పుతో సంబంధం లేకుండా వచ్చిన వాళ్ళను వచ్చినట్టు లాగేసుకుంటారా? లేక వాళ్ళ ఇష్ట ప్రకారమే వెయిట్ అంట్ సీ అంటారా అన్నది సస్పెన్స్ అయింది. ఏం చేయబోతున్నారోనంటూ పీసీసీ పెద్దల వైపు ఉత్కంఠగా చూస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.