ఆ నియోజకవర్గంలో కారు వోవర్ లోడ్ అయిందా? పేరుకు అంతా లీడర్సేగానీ….స్టీరింగ్ పట్టుకునే వాళ్ళు కరవయ్యారా? అసలు డ్రైవర్ సీటే ఖాళీ లేనంతగా పార్టీ ఉక్కిరి బిక్కిరి అవుతోందా? చివరికి వర్గపోరు ఆ మాజీ ఎమ్మెల్యేకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందా? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా ఈక్వేషన్స్? నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కారు ఓవర్ లోడ్ అయ్యిందట. స్టీరింగ్ మాక్కావాలంటే… మాక్కావాలంటూ పలువురు నేతలు చూపుతున్న ఉత్సాహమే ఇందుకు కారణమంటున్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు. ఇక్కడ కేడర్‌కంటే లీడర్స్ ఎక్కువైపోతున్నారన్న సెటైర్స్ సైతం పెరుగుతున్నాయి. అంతమంది ఉన్నా…. ఎవరికివారే యమునాతీరే అన్నట్టుగా అసలు పార్టీ వ్యవహారాల గురించి పట్టించుకోవడంలేదట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఓ మాజీ ఎంపీపీ, తాజా మాజీ ఎంపీపీ ఇద్దరూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు వ్యతిరేకంగా జట్టుకట్టడం చర్చనీయాంశంగా మారింది. అటు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ లోకి వచ్చిన మరో నేత మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హస్తం పార్టీ టిక్కెట్ ఆశించి…, భంగపడి… తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన ప్రసన్నరాజ్ నియోజవర్గంలో పట్టు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడంతో పొలిటికల్ హీట్ పెరిగిందని అంటున్నారు. సూర్యాపేటలో జిల్లా ముఖ్య కార్యకర్తల మీటింగ్ కు వెళ్తున్న కేటీఆర్‌కు ప్రసన్న రాజ్ నకిరేకల్ వద్ద ఘన స్వాగతం పలికేందుకు భారీగా జనసమీకరణ చేయడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. అదే టూర్ లో అదే నియోజకవర్గం చిట్యాల వద్ద నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కేటీఆర్‌కు స్వాగతం పలకడం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అయితే… నేరుగా కేటీఆర్‌ను కలిసి ఆయనతో సూర్యాపేటకు వెళ్ళడం పార్టీలో చర్చనీయాంశం అయింది. అంటే నాయకులు ఎవరికి వారు పరపతి కోసం తహతహలాడుతున్నారు తప్ప… కామన్‌గా పార్టీ కోసం పని చేయడంలేదన్న మాటలు పెరుగుతున్నాయి. చాలా కాలంగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలన్నీ సమన్వయం లేకుండానే జరుగుతున్నాయి.
అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చే విషయంలోనూ గులాబీ నేతలు తలోదారి అన్నట్లుగానే ఉంటున్నారు. దీంతో ఎవరివైపు నడవాలో, ఎటు నిలబడాలో తెలియక తలలు పట్టుకుంటోందట గ్రౌండ్ లెవల్ కేడర్. ఈ క్రమంలో…నకిరేకల్ బీఆర్ఎస్ లో అందరూ లీడర్లే.. మరి క్యాడర్ ఎక్కడ అనే చర్చ మొదలైంది. ఇలా ఐతే ప్లీనరీకి జన సమీకరణ బాధ్యత ఎవరు తీసుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నాయట. అందుకే ద్వితీయ శ్రేణి నాయకులు కూడా… మాక్కావాల్సింది వెనకుండి నడిచేవాళ్ళు కాదు, మా ముందుండి నడిపించే వాళ్ళు కావాలని ఘాటువగానే అంటున్నట్టు తెలిసింది. అసలు క్యాడర్ లో కన్ఫ్యూజన్ కు, లీడర్ల మధ్య కాంట్రవర్సీకీ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లా కీలక నేతే కారణం అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న ఈక్వేషన్‌ను కొందరు కీలక నేతలు పాటించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది ఆయన ఆవేదనగా తెలుస్తోంది. చిరుమర్తి లింగయ్య మార్చిలో నేరుగా అధినేత కేసీఆర్ ను కలిసి.. నియోజకర్గంలో తనకు వ్యతిరేకంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చెప్పుకున్నారట. అయినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పేమీ లేదంటున్నారు స్థానిక నాయకులు. కలిసి నడవాల్సిన సమయంలో కత్తులు దూసుకోవడం సరికాదని అంటోంది కేడర్. సొంత పార్టీ నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న గ్యాప్… ఎప్పుడు ఎలా బ్లాస్ట్ అవుతుందో.. అది ఎక్కడికి దారితీస్తుందోనన్న కలవరం కార్యకర్తల్లో పెరుగుతోందని అంటున్నారు. నకిరేకల్ కారు స్టీరింగ్ కోసం నేతల ప్రయత్నాలు, ప్లీనరీ జనసమీకరణ వ్యూహాలు ఎలా ఫలిస్తాయో….వివాదాల్ని అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి.