ఒక భారీ బహిరంగ సభ నిర్వహించడమంటే బీఆర్‌ఎస్‌కు మంచి నీళ్ళ ప్రాయం. ఒకప్పుడు అలా పిలుపునిస్తే… ఇలా సక్సెస్ అయిపోయేవి సభలు. కానీ… ఇప్పుడు.. రజతోత్సవ సభ కోసం స్థల ఎంపికలోనే ఆపసోపాలు పడుతోందట. చివరికి సెంటిమెంట్‌గా ఉన్న వరంగల్ విషయంలోనే పునరాలోచనలో పడిందా? సభ ఎక్కడ పెట్టాలో తేల్చుకోలేకపోతోందా? ఎందుకు పునరాలోచనలో పడింది గులాబీ పార్టీ? సభా ప్రాంగణం విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్‌ఎస్ ఆవిర్భవించి వచ్చేనెల 27కు పాతికేళ్ళు పూర్తవుతుంది. సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అనుకుంటోంది పార్టీ అధిష్టానం. అందుకోసం వరంగల్‌లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. అనుమతి కోసం దరఖాస్తు కూడా చేశాక సభ నిర్వహణపై గందరగోళం మొదలైందట పార్టీలో. ఉద్యమకాలంలో, పార్టీ పెట్టిన దగ్గర నుంచి అధికారంలో ఉన్న వరకు ఎన్నో బహిరంగ సభ నిర్వహించింది బీఆర్ఎస్. లక్షల మందితో నిర్వహించిన చరిత్ర ఉంది పార్టీకి. వారం రోజుల ముందు పిలుపు ఇచ్చినా లక్షలాదిమంది తమ సభలకు తరలివస్తారని చెప్పుకుంటూ ఉంటుంది పార్టీ అధిష్టానం. కానీ… ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక నిర్వహించాలనుకుంటున్న సభ విషయంలో మాత్రం ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇదే వరంగల్‌లో ఉద్యమ కాలం నుంచి అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సభలు నిర్వహించారు. అదే తరహాలో ఇప్పుడు కూడా పెట్టాలని అనుకుంటున్నా…ఎందుకో… ఎక్కడో తేడా కొడుతోందని, అందుకే వేదికని మార్చే ఆలోచన కూడా ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీలో. వరంగల్ కంటే… హైదరాబాద్ శివారు ప్రాంతం అయితే బాగుంటుందని భావిస్తున్నట్టు సమాచారం. అందుకు చాలా కారణాలే ఉన్నాయట. వరంగల్‌లో సభ నిర్వహించే ప్రాంతం అందరికీ అనుకూలంగా లేకపోవడం, సమయం కూడా ఏప్రిల్ చివర, ఎండలు విపరీతంగా ఉండడం ఇబ్బంది కావచ్చన్న ఆలోచన వచ్చిందట. అందుకే అక్కడ నిర్వహించడం కష్టమవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఐదు లక్షల మంది వస్తారని చెప్పుకుంటున్నా…. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండే ఆ సమయంలో అంతమందిని అక్కడికి తరలించడం ఇబ్బంది అవుతుందని అనుకుంటున్నట్టు తెలిసింది.
అందుకే సభా ప్రాంగణాన్ని మార్చాలన్న ఆలోచన వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే పార్టీకి పట్టున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బహిరంగ సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ లో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జిహెచ్ఎంసి తో పాటు శివారు ప్రాంతాల్లో పార్టీకి కేడర్ కూడా ఎక్కువగా ఉంది. దీంతో జనాలను తరలించడం సులువు అవుతుందని భావిస్తున్నారట. ప్రతి నియోజకవర్గ నుంచి 20 వేల మందిని తరలించేలా ఎమ్మెల్యేలకు టార్గెట్ ఇచ్చినా తాము అనుకున్న 5 లక్షలకు రీచ్ అయిపోతామని అనుకుంటున్నారట. అందుకే వరంగల్ కంటే మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్‌కేసర్‌లో సభ నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు చాలా సెంటిమెంట్. ఉద్యమకాలం నుంచి ఇప్పటివరకు ఎన్నో సభలు నిర్వహించి సక్సెస్ చేసి క్యాడర్ లో జోష్ నింపారు. అయితే ఇదే వరంగల్లో గత ఏడాది ప్లీనరీ నిర్వహిస్తామని , భారీ బహిరంగ సభ జరుపుతామని లీకులు ఇచ్చినా అది జరగలేదు. ఇప్పుడు కూడా రజతోత్సవ వేళ వరంగల్లో సభ నిర్వహించాలా వద్దా అన్న కన్ఫ్యూజన్లో ఉంది పార్టీ. ఈ మధ్యకాలంలో కామారెడ్డిలో బీసీ గర్జన నిర్వహిస్తామని, అంతకుముందు గజ్వేల్ లో బహిరంగ సభ, ఘన్పూర్ లో సభ అనుకున్నప్పటికీ ఏది జరగలేదు. అందుకే రజతోత్సవ వేళ నిర్వహించే ఈ సభను మాత్రం కచ్చితంగా ఘనంగా నిర్వహించాలన్న పట్టుదలతో అనుకూలంగా ఉండే నాలుగైదు ప్రాంతాల కోసం వెదుకుతున్నట్టు తెలుస్తోంది.