మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో హ్యాపీగా లేరా? పార్టీలో తన పొజిషన్ ఏంటో అర్ధంగాక క్వశ్చన్ మార్క్‌ను ఇంకా తీసేయలేకపోతున్నారా? అదే సమయంలో బాలినేని స్థానంలో కొత్త ఇన్ఛార్జ్‌ని వైసీపీ ఎందుకు ప్రకటించలేదు? ఈ పరిణామాలన్నిటినీ సింక్ చేస్తూ…. ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ మధ్య ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. రెండేళ్ల ముందు వరకూ వైసీపీలో తిరుగు లేని నేతగా చెలామణి అయిన బాలినేనిని మంత్రి వర్గ విస్తరణలో తప్పించడంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత అలకలు బుజ్జగింపులు, కామన్ అయిపోయాయి. ఆ క్రమంలోనే ఫ్యాన్ కింది నుంచి పక్కకు జరిగి గ్లాస్ పట్టుకున్నారు బాలినేని.దీంతో ఒక్కసారిగా జిల్లా వైసీపీ వర్గాల్లో అయోమయం నెలకొంది. అప్రమత్తమై నష్టనివారణ చర్యలను ప్రారంభించిన ఆ పార్టీ అధినేత జిల్లా అధ్యక్ష భాద్యతలు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి.. ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి పార్లమెంట్ పార్టీ పరిశీలకుడిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్‌ని మాత్రం నియమించలేదు. పార్టీకి అదేమంత పెద్ద విషయం కాకున్నా… జగవ్ వేచి చూసే ధోరణితో ఉన్నారన్నది లేటెస్ట్ టాపిక్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది ముఖ్య నాయకులు సైతం వైసీపీని వీడి వెళ్ళారు. అలాంటి చోట్ల వెంటనే కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు జగన్. ఏలూరు, జగ్గయ్యపేట, పెనమలూరు లాంటి నియోజకవర్గాల్లో ఇదే జరిగింది. కానీ… ఒంగోలు విషయంలో మాత్రం జగన్ ఇంకా వేచిచూసే ధోరణితో ఉండటం, బాలినేని స్థానంలో మరొక ఇన్ఛార్జ్‌ని ప్రకటించకపోవడం అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అంటున్నాయి రాజకీయ వర్గాలు.
అన్ని చోట్ల చకచకా భర్తీ చేసి ఒంగోలును ఖాళీగా పెట్టడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ఈ బాధ్యతల్ని ముందు జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ కరణం బలరాంకు అప్పగించాలని అనుకున్నారట. ఆ విషయమై బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్‌తో జగన్ నేరుగా మాట్లాడినా వాళ్ళిద్దరూ సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. బాలినేని అసలు పార్టీ వీడతారని తాను అనుకోలేదని ఆ మీటింగ్‌లో జగన్ అన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వచ్చిన పార్టీ ముఖ్య నేతలు బాలినేనిపై ఒక్క విమర్శ కూడా చేయలేదు. అదే సమయంలో అటు బాలినేని జనసేనలో చేరినా… ఆ పార్టీ లోని ఓ బ్యాచ్ ఆయనకు దూరంగా ఉంటూ వస్తోందట. మాజీ మంత్రి కూడా ఇంతవరకు జనసేన పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు.. మరోవైపు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్, ఇటీవలే జనసేనలో చేరిన కంది రవిశంకర్ వంటి నేతలతో జట్టు కట్టి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. పార్టీ మారినా బాలినేని సైలెంట్‌గా ఉండటం, జనసేనలో ఆయన పొజిషన్ ఏంటో అర్ధంగాకుండా ఉండటం, ఒంగోలుకు వైసీపీ ఇన్ఛార్జ్‌ని ప్రకటించకపోవడం లాంటి పరిణాలను సింక్ చేస్తూ… కొత్త కొత్త చర్చలు జరుగుతున్నాయి ఒంగోలు పొలిటికల్ సర్కిల్స్‌లో. మాజీ మంత్రి జనసేనలో కంఫర్ట్‌గా లేరన్న అంశం చుట్టూనే నడుస్తోందట చర్చ. మరి బాలినేని అసలు స్ట్రాటజీ ఏంటి? జగన్ ప్లాన్ ఏంటో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పండిట్స్.