ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వానికి తిప్పలు తప్పడం లేదా? ఛైర్మన్ మోషేన్‌రాజు అధికార పక్షానికి కొరకరాని కొయ్యలా మారిపోయారా? ఆయన విషయమై ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? మా రాజీనామాల్ని ఆమోదించండి మహోప్రభో…. అంటూ నలుగురు ఎమ్మెల్సీలు ఎందుకు మొరపెట్టుకోవాల్సి వస్తోంది? అసలు కౌన్సిల్‌లో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి? శాసన మండలి…. పెద్దల సభ…. రకరకాల రాజకీయ ప్రాధాన్యతలు, పరిణామాల దృష్ట్యా…. అసెంబ్లీ వ్యవహారాల సంగతి ఎలా ఉన్నా…. ఈ పెద్దల సభలో మాత్రం అన్ని విషయాల మీద అర్ధవంతమైన, సమగ్ర చర్చ జరుగుతుందని ఆశిస్తారు అంతా. అలాగే ఏ బిల్లు అయినా…. మండలి స్టాంప్ పడ్డాకే అమల్లోకి వస్తుంది. లేదంటే…. అసెంబ్లీ ఓకే చేశాక కూడా ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఛైర్మన్ వ్యవహారశైలి గురించి గట్టి చర్చే జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ప్రత్యేకించి మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు నిర్ణయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారట పరిశీలకులు. ఒక రకంగా ఆయన తమకు కొరకరాని కొయ్యగా ఉన్నారన్న అభిప్రాయం ఉందట టీడీపీ వర్గాల్లో. ప్రతి విషయంలోనూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారని, ఈ వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందని అధికార పక్ష నేతలు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీల రాజీనామాల్ని ఆమోదించకపోవడంపై కక్కలేక-మింగలేక అన్నట్టుగా ఉందట పరిస్థితి. వైసీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. వారిలో పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కల్యాణ చక్రవర్తి, జయ మంగళ వెంకట రమణ అయితే… నిరుడు ఆగస్ట్‌లోనే రిజైన్ చేశారు. ఏడు నెలలు దాటిపోయినా…. ఇంతవరకు వాళ్ళ రాజీనామాలకు ఛైర్మన్ ఆమోదముద్ర పడలేదు. ఇంకా చెప్పాలంటే… అసలు దిక్కూ మొక్కూలేకుండా పోయాయి. మండలి వ్యవహారాల్లో ఆ ఊసే రావడం లేదు.
ఇక తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ కూడా రిజైన్ చేసేశారు. వీరిలో మర్రి తప్ప మిగిలిన నలుగురు… మా రాజీనామాల్ని ఆమోదించండి మహాప్రభో… అంటూ తాజా సమావేశాల్లో మండలి చైర్మన్‌ను రిక్వెస్ట్ చేసుకున్నారు. అయినా సరే… ఆయన వైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదు. దాంతో… అవుననిగాని, కాదని గాని, అసలు ఎందుకు ఆపారో చెప్పడం గాని ఏ రియాక్షన్ లేకుంటే… ఎలాగంటూ సణుక్కోవడం ఎమ్మెల్సీల వంతయిందట. అలా ఎందుకంటే… మోషేన్‌రాజు ఒక వ్యూహం ప్రకారం నడుచుకుంటున్నట్టు కనిపిస్తోందని అంటున్నాయి అధికార పక్ష వర్గాలు. చేసిన రాజీనామాను చేసినట్టుగా ఆమోదిస్తే…. మండలిలో వైసీపీ బలం తగ్గి టీడీపీ బలం పెరుగుతుంది. ఎంత మండలి ఛైర్మన్ అయినా…. నిష్పక్షపాతంగా ఉండే పోస్ట్ అయినా….. బేసిగ్గా ఆయన వైసీపీ సభ్యుడే కదా…. అందుకే అటువైపు కాస్త మొగ్గు చూపిస్తున్నట్టు కనిపిస్తోందని మాట్లాడుకుంటున్నారట తెలుగుదేశం నాయకులు. ఆయనకా ఉద్దేశ్యం ఉందో లేదో తెలియదుగానీ చర్యలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయన్నది అధికారపక్షం మాట. కేవలం ఎమ్మెల్సీల రాజీనామాలే కాదు. వివిధ బిల్లుల విషయంలో కూడా ఛైర్మన్ ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం ఉందట కూటమి వర్గాల్లో. తాజాగా ఎస్సీ వర్గీకరణ బిల్లు విషయంలో కూడా ఇదే జరిగిందని అంటున్నారు. ఉభయ సభల్లో వర్గీకరణకు సంబంధించిన తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి. ఈ దిశగా శాసన సభలో చర్చ జరిగింది. కానీ… మండలికి వచ్చేసరికి బ్రేక్ పడింది. ఇక్కడ అధికార పక్షానికి సరైన మెజారిటీ లేకపోవడంతో తీర్మానం ఆమోదానికి మెలిక పెట్టారు ఛైర్మన్ మోషేన్‌రాజు. ఎస్సీ వర్గీకరణ నివేదికను తాను పూర్తిగా చదివాకే తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరిస్తానని అన్నారు. దాంతో కేవలం ప్రకటన చేయడానికే పరిమితమై ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెదుక్కోవాల్సి వచ్చింది. ఆ ఎపిసోడ్ తర్వాత చైర్మన్ వ్యవహారశైలి మీద చర్చ ఎక్కువగా జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఆయన చర్యలతో ప్రభుత్వం గట్టిగానే ఇరుకున పడుతోందన్న వాదన బలపడుతోంది. ఇదే సందర్భంలో అంతకు ముందు ఛైర్మన్‌గా ఉన్న షరీఫ్‌ను కూడా గుర్తు చేసుకుంటున్నారు కొందరు. అప్పట్లో… వైసీపీకి అధికారం ఉండగా… మండలిలో టీడీపీ బలంగా ఉంది. మూడు రాజధానులకు అనుకూలంగా నాటి జగన్ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసింది. కానీ… మండలికి వచ్చేసరికి బ్రేక్ పడింది. టీడీపీ సభ్యుడైన నాటి మండలి ఛైర్మన్ షరీఫ్ మూడు రాజధానుల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. ఆ కథ అక్కడితో ముగిసిపోయింది. ఇప్పుడు ఇదే విషయం పై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది… అప్పుడు షరీఫ్‌లాగే ఇప్పుడు మోషేన్ రాజు కూడా అధికార పక్షంతో ఆడేసుకుంటున్నారా అని మాట్లాడుకుంటున్నారు పరిశీలకులు. తానేదో… ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నానన్నట్టుగా కూకుండా….రూల్ పొజిషన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. మొత్తంగా అప్పుడైనా, ఇప్పుడైనా పెద్దల సభలో మాత్రం ప్రభుత్వాలకు తిప్పలు తప్పడం లేదని మాట్లాడుకుంటున్నారు.