ఏపీ కూటమిలో బీజేపీకి విలువ లేకుండా పోతోందా? వాళ్ళకు అది చాలనా? లేక అంతకు మించి అవసరం లేదనా? పదవుల పంపకాల్లో టీడీపీ, జనసేన సింహభాగం తీసుకుంటున్నా…. కాషాయ పార్టీకి కనీస మాత్రంగా కూడా కాకుండా.. ఏదో… విదిలించినట్టు వేస్తున్నారన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? పదవుల పందేరంలో మూడు పార్టీల మధ్య అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ కమిటీ పదవుల పందేరం నడుస్తోంది. సహజంగానే అందులో ఎక్కువ శాతం టీడీపీ తీసుకుంటోంది. అలాగే జనసేనకు కూడా ఓకేగా తెలుస్తోంది. కానీ… బీజేపీకి వచ్చేసరికి అసంతృప్తి సెగలు రేగుతున్నాయట. ఆ రెండు పార్టీలతో పోలిస్తే… రాష్ట్రంలో మనకు బలం తక్కువ ఉంటే ఉండవచ్చుగానీ….. మరీ ఇంత దిగదుడుపు వ్యవహారమా అని ఏపీ కాషాయ నేతలు సణుక్కుంటున్నట్టు సమాచారం. అందుకే కూటమిలో మనల్ని తక్కువ చేసి చూస్తున్నారా అని కూడా ఫీలవుతున్నారట కొందరు నాయకులు. ఏ పార్టీగాని, కూటమిగాని అధికారంలోకి వస్తే… ఆ కూటమి నాయకులు ఎక్కువగా నామినేటెడ్ పోస్ట్‌లు ఆశించడం సహజం. అందులోనూ మార్కెట్ కమిటీ పోస్ట్‌లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే… కింది స్థాయి నుంచి వీలైనంత ఎక్కువ మందికి పదవులు ఇవ్వగలిగేది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల్లోనే. అలాంటి పదవుల్లో సైతం తమను మరీ తీసివేతగా చూస్తున్నారన్నది ఏపీ కమలనాథుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటికి రెండు విడతల్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ పదవులు ఇచ్చింది ప్రభుత్వం. మొదటి లిస్ట్‌లో 47 కమిటీలకు ఛైర్మన్స్‌ని ప్రకటిస్తే… అందులో బీజేపీకి దక్కింది రెండు. ఇక తాజాగా… సెకండ్ లిస్ట్‌లో మరో 38 కమిటీలకు ప్రకటిస్తే… అందులో కమలం పార్టీకి ఒక్కటి మాత్రమే దక్కింది. అంటే… ఈ లెక్కన ఇంకో లిస్ట్ ఇస్తే… అందులో మమ్మల్మి జీరో చేస్తారా ఏంటంటూ అసహనంగా ఉన్నారట ఏపీ బీజేపీ లీడర్స్. ఏం… మనం మాత్రం భాగస్వాములం కాదా? రాష్ట్రానికి కేంద్ర సాయం అందడంలో మన పాత్ర మనం పోషించడం లేదా? వాటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా…. ఏదో విదిలిస్తున్నట్టుగా అర కొర పోస్టులు ఇవ్వడమేంటని పార్టీ నాయకులు మాడ్లాడుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఏఎంసీల్లో మరీ అంత ఘోరంగా ఇస్తున్నారంటే… మనమంటే లెక్కలేదా? లేక వీళ్ళకి ఇవే ఎక్కువని అనుకుంటున్నారా అంటూ కాస్త అసహనంగానే ప్రశ్నించుకుంటున్నారట కాషాయ నేతలు. ఏపీలో మీ సీనింతే… మీకు ఇంతకు మించి లేదని చెప్పాలనుకుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు ఇంకొందరు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడానికి కష్టపడిన, మా పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తున్న వారి పేర్లు ఇచ్చినా… రెండు విడతల్లో కలిపి ముచ్చటగా మూడే పోస్ట్‌లు ఇవ్వడమేంటన్నది ఏపీ బీజేపీ క్వశ్చన్. కనీసం కూటమి ధర్మాన్ని కూడా పూర్తిగా పాటించకుంటే ఎలాగన్నది వాళ్ళ అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. గట్టిగా మాట్లాడుకుంటే…. కూటమిలో బీజేపీ కలిశాకే గెలుపు ఊపొచ్చిందని, ఆ విషయాన్ని విస్మరించి… ఏదో… ముష్టివేసినట్టు మూడు పదవులకు పరిమితం చేయడం ఏంటన్న చర్చ జరుగుతోందట పార్టీలో. అటు పార్టీలో కూడా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతూ.. వత్తిడి ఎక్కువ అవుతోందని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఏఎంసీల్లోనే ఇలా చేస్తే… ఇక ఆలయాల పాలక మండళ్ళలో మా స్థానం ఎక్కడన్న కంగారు ఏపీ బీజేపీ నాయకుల్లో పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. పదవుల పండగ ఆ రెండు పార్టీలకేనా? మాకు లేదా అంటున్న కాషాయ నేతల గోడును కూటమి పెద్దలు పట్టించుకుంటారో లేదా చూడాలి.