Off The Record: ఏపీ సీఎం జగన్ దూకుడు ప్రతిపక్షాలకు అంతు చిక్కకుండా ఉందట. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా హామీల అమలును తొలి రోజు నుంచే మొదలు పెట్టేశారాయన. మెజార్టీ హామీలను నెరవేర్చడంతో పాటు ఇంకా మిగిలిన వాటిపై ఇప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టిందట ఏపీ సర్కార్. చివరి దాకా తాత్సారం చేయకుండా… కొత్త పథకాల అమలు, ఇతరత్రా పెండింగ్ పనులన్నిటినీ వెంటనే పూర్తి చేయాలని అధికాక యంత్రాంగానికి క్లియర్‌కట్‌గా చెప్పినట్టు తెలిసింది. గతంలో జరిగిన పరిణామాలు ఎలా ఉన్నా.. ఇప్పుడు మాత్రం జగన్ స్పీడ్ చూసి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఉద్యోగుల సమస్యలను ఎవ్వరూ ఊహించని వేగంతో పరిష్కరించే ప్రయత్నం చేస్తూనే.. కేంద్రం నుంచి భారీ స్థాయిలో నిధులను రాబట్టడంలో సక్సెస్ అయ్యారు సీఎం. అదే ఊపుతో దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న ప్రతిపక్షాలు ఏదో జరిగిపోతోందని ఊహించుకుంటూ… మందస్తు మాటలు మాట్లాడుతున్నాయి. కానీ.. వాస్తవం వేరే ఉందట.
ప్రతిపక్షాల ఊహాగానాలకు చెక్ పెడుతూ… ముందస్తు ముచ్చటే లేదని కేబినెట్ మీటింగ్‌లో మంత్రులకు క్లియర్‌గా చెప్పేశారు సీఎం. ఎన్నికలకు ఇంకా తొమ్మిది నెలల గడువు ఉందని గుర్తు చేస్తూ.. ఈ తొమ్మిది నెలలు గట్టిగా కష్టపడాలని దిశా నిర్దేశం చేశారు. దీంతో ముందస్తు ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినా.. మరో కొత్త చర్చ మొదలైంది. ముందస్తు లేకుంటే.. ఎందుకీ హంగామా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జగన్‌ను.. ఆయన వ్యూహాలను దగ్గరగా పరిశీలిస్తే అన్నింటికీ సమాధానం వస్తుందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. ఎన్నికల్లో హామీలు ఇవ్వడం, మెల్లిగా ఆర్చుకుని.. తీర్చుకుని వాటిలో కొన్నిటిని అమలు చేయడం, తిరిగి ఎలక్షన్స్ టైం రాగానే ఆ స్కీములనో.. ఈ ప్రాజెక్టులనో లాంఛనంగా ప్రారంభించి.. మేమూ చేశామని చెప్పుకోవడం జగన్ నైజం కాదని గుర్తు చేస్తున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా ఇచ్చిన హామీలను నెరవేరిస్తేనే.. ప్రజల్లో పార్టీకి.. వ్యక్తిగతంగా తనకు క్రెడిబులిటీ పెరుగుతుందని ఆయన నమ్ముతారని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న హడావిడి అంతా అందులో భాగమేనంటున్నారు.
ఎన్నికలు ఇంకో ఆరు నెలలు ఉన్నాయనగా ఎన్ని పనులు చేసినా.. ఎన్ని కోట్ల నిధులు గుమ్మరించినా జనంలో నమ్మకాన్ని పెంచలేమని గట్టిగా విశ్వసిస్తున్నారట సీఎం. అందుకే చేయాలనుకున్న పనులన్నిటినీ రాబోయే నాలుగైదు నెలల్లోనే చేసేయాలన్నది జగన్ వ్యూహంగా చెబుతున్నారు. అవకాశం ఉన్న వాటిని ముందుగా పూర్తి చేసుకోవడం, కొంచెం స్టడీ చేసి చేయాల్సిన పనుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరో ఆరు నెలల్లో పూర్తి చేసి తీరాల్సిందేనని జగన్ తనకు తానుగానిబంధన పెట్టుకున్నారట. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాతనైనా జగన్ వ్యూహాలు అర్థమై ఉండాలని, ఇంకా అర్థం కాకుంటే వారిని చూసి జాలిపడడం తప్ప ఏం చేయలేమనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే గడప గడపకు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, అప్పుడు కూడా అదుగో ముందస్తు.. ఇదుగో ముందస్తు అంటూ ప్రతిపక్ష పార్టీలు చేసిన ప్రచారం ఉత్తుత్తిదేనని తేలిపోయింది కదా అని అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు.
జగన్ వ్యూహాలను అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు ముందస్తు మాయలో పడుతున్నాయనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఈ విధంగా ప్రతిపక్షాలు అయోమయంలో ఉన్నంత కాలం తమకేం కాదనే ధీమాతో ఉన్నాయి వైసీపీ వర్గాలు. ఈసారి ఎన్నికల్లో కూడా ఎవ్వరూ ఊహించని వ్యూహాలతో జనంలోకి వెళ్ళడం ఖాయమన్న ధీమాతో ఉన్నాయి వైసీపీ వర్గాలు.