Off The Record: తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్ కోసం గెలుపు గుర్రాల మీదే దృష్టిపెట్టాయి అన్ని రాజకీయ పార్టీలు. అధికార బీఆర్‌ఎస్ ఓ అడుగు ముందుకేసి.. ఉన్నత స్థానాల్లో, మంత్రులుగా ఉన్న వారైనా సరే.. ఇప్పుడు జనంలో పలుకుబడి ఎలా ఉంది? మళ్ళీ టిక్కెట్ ఇస్తే గెలుస్తారా? పక్క నియోజకవర్గాల మీద ప్రభావం సంగతి తర్వాత.. ముందు కనీసం సొంత సీటు గెలవగల సత్తా ఉన్న వాళ్ళు ఎవరంటూ.. లిస్ట్ చేసుకుంటోందట. హ్యాట్రిక్ కొట్టి తీరాలన్న పట్టుదలతో ఉన్న అధినాయకత్వం ఈ విషయంలో అస్సలు రాజీ పడదల్చుకోలేదన్నది పార్టీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం. ఈ క్రమంలోనే తెప్పించుకుంటున్న నివేదికల్లో ప్రస్తుతం క్యాబినెట్ మంత్రి ఒకరు ఈసారి గెలిచే ప్రసక్తే లేదని తేలిందట.
ఉత్తర తెలంగాణకు చెందిన ఆ మంత్రికి తిరిగి సీటు ఇస్తే.. అప్పనంగా అవతలి వాళ్ళకు అప్పజెప్పడం తప్ప మరోటి కాదని చెప్పాయట ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్న నివేదికలు. అందుకే ఆయన విషయంలో పార్టీ అధినాయకత్వం పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. అసెంబ్లీ టిక్కెట్‌కు బదులుగా ఇతర ఆప్షన్స్ ఇస్తున్నట్టు గులాబీ పార్టీ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఉత్తర తెలంగాణకు చెందిన ఆ మంత్రితో పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఈసారి గెలిచే ప్రసక్తే లేదని రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి.. అక్కడి నుంచి తప్పుకుంటే.. వేరే అవకాశాలు ఇస్తామని రెండు ఆప్షన్స్ ఆయన ముందు పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
అసెంబ్లీకి బదులుగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో లోక సభకు పోటీ చేయడం ఒక ఆప్షన్ కాగా.. ఒకవేళ దాని మీద ఆసక్తి లేకుంటే.. రాజ్యసభకైనా పంపిస్తామని చెప్పారట ఆ మంత్రికి. వీటిలో ఏదో ఒకటి ఎంచుకోవాలే తప్ప అసెంబ్లీ టిక్కెట్ గురించి మాత్రం ఆశలు పెట్టుకోవద్దని కరాఖండీగా తేల్చేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు పార్టీ నాయకులు. ఉరుములేని పిడుగులా వచ్చిపడ్డ ఈ ప్రతిపాదనపై ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నారట ఆ మంత్రివర్యులు. నాకే ఎందుకిలా అంటూ.. అత్యంత సన్నిహితుల దగ్గర దాదాపు ఏడ్చేసినంత పని చేస్తున్నారట. కానీ.. ఎవరెంత మొరపెట్టుకున్నా.. రాజకీయ పరిస్థితులు మారుతున్నందున ఈసారి ఏ మాత్రం ఛాన్స్ తీసుకోకూడదన్న ఆలోచనలో ఉందట బీఆర్‌ఎస్ అధినాయకత్వం. గెలుపు గుర్రాల వేటలో ఇలాంటివి ఇంకెన్ని షాకులు తగులుతాయో చూడాలి.