Off The Record: 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీలోని మహా వృక్షాలే కొట్టుకుపోయాయి. పెద్ద పెద్ద లీడర్లనుకున్న వారు సైతం ఆ గాలిని తట్టుకోలేకపోయారు. అంతటి బలమైన వేవ్‌లోనూ… ముగ్గురు ఎంపీలు గెలిచారు. శ్రీకాకుళం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బెజవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్. అయితే… తర్వాత వారిలో రామ్మోహన్ నాయుడు మినహా.. మిగిలిన ఇద్దరూ అడపా దడపా… వివాదాల్లోకి వెళ్లి వస్తూనే ఉన్నారు. కేశినేని నాని వ్యవహార శైలి కారణంగా నియోజకవర్గంలోనే ఆయనకు బలమైన వ్యతిరేక వర్గం ఏర్పడింది. ప్రస్తుతానికి సైలెంట్‌గా ఉన్నా.. అది తుఫాన్ ముందు ప్రశాంతతలాగే ఉంది. మళ్లీ ఏదొక వివాదం తెరపైకి రావడం ఖాయంగా కన్పిస్తోంది. ఇవాళ కాకున్నా… రేపైనా కేశినేని నాని ఎపిసోడ్‌ను పార్టీ అధినాయకత్వం సెట్ చేయడం ఖాయమట. కానీ గల్లా జయదేవ్ వ్యవహారమే ఏం అర్థం కాకుండా ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.
జయదేవ్ దాదాపు ఏడాదిన్నర నుంచి గుంటూరు ఛాయలకే రాలేదు. దీంతో స్థానిక టీడీపీ నాయకుల్లో గందరగోళం పెరుగుతోంది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా తిరిగి గుంటూరు నుంచి పోటీ చేస్తారా..? లేదా..? అనే చర్చ మొదలైంది. రెండోసారి ఎన్నికైన కొత్తల్లో అమరావతి రైతుల ఉద్యమంలో గట్టిగానే పాల్గొన్నారు ఎంపీ. అసెంబ్లీ ముట్టడి వంటి కార్యక్రమాల్లో కూడా దూకుడుగానే పాల్గొన్నారు. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి పార్టీ కార్యకలాపాల్లో, రాజకీయాల్లో జోరు తగ్గించారు. చిత్తూరు జిల్లాలోని గల్లా కుటుంబానికి చెందిన కంపెనీని రాష్ట్ర సర్కార్ ఇబ్బంది పెట్టిందని, ఆ తర్వాత నుంచి జయదేవ్ పొలిటికల్ యాక్టివిటీస్.. తగ్గించారని చెప్పుకుంటున్నారు. అందుకే గుంటూరు ఛాయలకు కూడా రాకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారట. పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం సభకు వెళ్తున్నారు. మొన్నటి వరకు గల్లా దూరంగా ఉన్నారంటే… ఏవో .. వ్యాపార కోణాలు, కారణాలు అనుకోవచ్చు. కానీ…ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం తర్వాత కూడా ఆయన టచ్‌మీ నాట్ అన్నట్టుగా ఉండడం దేనికని అంటున్నాయట గుంటూరు జిల్లా టీడీపీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో గుంటూరు ఎంపీ సీటు టీడీపీలో హాట్ కేకులా ఉందని అంటున్నారు. ఇక్కడి నుంచి పార్టీ తరపున ఎవరు పోటీ చేసినా గెలుస్తారనే నమ్మకం ఉందట. అయినా… గల్లా దూరంగా ఉంటున్నారంటే.. ఇక మాజీ ఎంపీ అనిపించుకోవడానికి ఆయన మానసికంగా సిద్ధమైపోయారని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు.
అయితే గల్లా సన్నిహితులతో పాటు ఆయన సొంత జిల్లా చిత్తూరులో మాత్రం వేరే రకమైన చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో జయదేవ్ కచ్చితంగా పోటీ చేస్తారని.. అది కూడా గుంటూరు జిల్లా నుంచే ఉంటుందని చెబుతున్నారట. తాత్కాలికంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని.. తమ వ్యాపారాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. చర్యలతో గల్లా ఫ్యామిలీ మొత్తం డిస్ట్రబ్ అయిన మాట వాస్తవమేనని.. ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా ఉందామనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని అంటున్నారు. అయితే ఆ తర్వాత రాజకీయాల్లో పరిస్థితులు మారడం.. పార్టీ హైకమాండ్ కూడా జయదేవ్‌కు అండగా ఉంటామనే భరోసా ఇచ్చిందట. ప్రస్తుతం ఎంపీ స్థానాల కోసం బలమైన అభ్యర్థులను టీడీపీ వెతుకుతోంది. ఈ క్రమంలో బలమైన ఎంపీ అభ్యర్థిగా ఉన్న గల్లా జయదేవ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ వదులుకోదని అంటున్నారు. టీడీపీ నాయకత్వపు ఒత్తిడితో గల్లా కుటుంబం కూడా కొంత దారికి వచ్చిందనే చర్చ చిత్తూరు జిల్లాలో జరుగుతోంది. ఈ క్రమంలో ఎంపీ తిరిగి పోటీ చేయడం ఖాయమనే అంటున్నాయి చిత్తూరు జిల్లా టీడీపీ వర్గాలు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. గల్లా ఇప్పటి నుంచి యాక్టీవ్ కాకుండా.. చివరి నిమిషంలో వచ్చి.. తనకు ఓటేయండని ప్రజలను కోరినా.. తన కోసం పని చేయండని కార్యకర్తలను రిక్వెస్ట్ చేసినా అందుకు ఎంత వరకు సహకారం లభిస్తుందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో కొనసాగాలని భావిస్తే.. వెంటనే పొలిటికల్‌గా యాక్టీవ్ కావడం బెటరని అంటున్నారు గుంటూరు జిల్లా నేతలు. లేకుంటే అధినాయకత్వం కూడా కొత్త ఆప్షన్ వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చినా వస్తాంటున్నారట.