2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ-జనసేన కాంబినేషన్ సక్సెస్ అయింది. ఆ తర్వాత 2019లో ఈ మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి. టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం కాగా.. బీజేపీకి కేవలం ఒక్క శాతం ఓట్లే పడ్డాయి. ఇక పవన్ కళ్యాణ్ ప్రభావితం చేయలేకపోయారు. స్వయంగా తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన తిరిగి ఏకమయ్యాయి. టీడీపీ కూడా బీజేపీతో గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో మళ్లీ ఆ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా..?అనే చర్చ జోరుగా జరుగుతోంది. దీనికి తగ్గట్టే గతంలో ఓసారి.. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ బీజేపీ-టీడీపీ కలయిక మీద కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికలకు కలిసే వెళ్తామన్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
ఇప్పటికిప్పుడే కాకున్నా.. సమీప భవిష్యత్తులోనైనా టీడీపీ-బీజేపీ కలవనున్నాయా..? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది. బహిరంగంగా చెప్పకున్నా.. కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు నిర్ణయం తీసేసుకున్నారనే విషయంలో పవన్‌కు క్లారిటీ ఉండబట్టే ఆయన ఈ మాటలన్నట్టు ఊహిస్తున్నారు. టీడీపీ-బీజేపీ మధ్య గ్యాప్ తగ్గించేందుకు పవన్ మధ్యవర్తిత్వం వహించారు. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తాను పని చేస్తున్నానని.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూసుకునే క్రమంలోనే బీజేపీ పెద్దలను కలుస్తున్నానని గతంలో స్పష్టం చేశారు పవన్. పవన్ రాయబారాలు నడిపిన తర్వాతనే.. చంద్రబాబు-అమిత్షా-జేపీ నడ్డా సమావేశం జరిగిందన్న ప్రచారం కూడా ఉంది. ఆ సమావేశం తర్వాతనే అమిత్ షా-నడ్డాలు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు కొందరు నేతలు. అలాగే బీజేపీ ఏపీ నేతల్లో కూడా స్పష్టమైన మార్పు కన్పిస్తోంది. ప్రత్యేకించి ఏపీలో నాయకత్వ మార్పు జరిగిన తర్వాత పొత్తుల గురించి కానీ.. చంద్రబాబు మీద విమర్శలు కానీ చాలా వరకు తగ్గిపోయాయి. గతంలో ఏపీ బీజేపీ చీఫ్ గా వ్యవహరించిన సోము వీర్రాజు సహా.. ఇంకొందరు నేతలు.. వైసీపీని.. జగన్ను విమర్శించడంతోపాటు.. వారితో సమానంగానో.. కొన్ని సందర్భాల్లో వారికంటే ఎక్కువగానో చంద్రబాబును విమర్శించేవారు. ఇప్పుడా పరిస్థితి కన్పించడం లేదు. ప్రస్తుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి టార్గెట్ జగన్.. టార్గెట్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగానే విమర్శలు చేస్తున్నారు తప్ప.. చంద్రబాబును.. టీడీపీని ఎక్కడా విమర్శించడం లేదు. సమాన దూరం పాటిస్తామనే రోటీన్ డైలాగులు కూడా చెప్పడంలేదు. మరోవైపు టీడీపీతో పొత్తు గురించి ప్రస్తావిస్తున్నా.. ఓ మాదిరిగా రెస్పాండ్ అవుతున్నారే తప్ప.. గతంలో మాదిరి బీజేపీ నుంచి సీరియస్ డైలాగులు ఉండడం లేదు.
ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్‌కు తెలుసు కాబట్టే.. ఈసారి 2014 ఎన్నికల కాంబోనే మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే రీతిలో కామెంట్లు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో వైసీపీని ఢీ కొట్టాలంటే.. ఇప్పుడే కాకుండా.. కొన్నాళ్లు ఆగిన తర్వాతే పొత్తులపై క్లారిటీ ఇస్తే లాభం ఉంటుందనే ఉద్దేశ్యంతో మూడు పార్టీలు ఉన్నాయనేది మరో టాక్. బీజేపీ-జనసేన ఎలాగూ పొత్తులోనే ఉన్నారు కాబట్టి.. ఇబ్బంది లేదు. ఇక టీడీపీ బీజేపీతో పొత్తులోకి వస్తుందనే అంశాన్ని ప్రకటించడానికి ఇంకొంత సమయం తీసుకోవాలని భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఈలోగా జరిగే పరిణామాలతో ప్రజలు, మూడు పార్టీల కేడర్ మానసికంగా సిద్ధమవుతారన్న ఉద్దేశ్యం కూడా కన్పిస్తోంది. మిగిలిన వారికంటే పవన్‌కు ఈ క్లారిటీ ఎక్కువగా ఉండడం వల్ల 2014 కాంబినేషన్ అంటూ పవన్ కామెంట్లు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది.