Off The Record: అసలు వాళ్ళకు పదవులు ఉన్నట్టా? లేనట్టా? ఆఫీస్‌కు వెళ్ళాల్నా? అవసరం లేదా? ఆ విషయంలో పీసీసీ అధ్యక్షుడితో సహా తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వరికీ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు గాంధీభవన్ ముఖం చూడ్డం కూడా మానేశారట. పవర్‌లో ఉన్న పార్టీకి అంత గందరగోళం ఎందుకు? అలా కన్ఫ్యూజ్ అవుతున్న ఆ నాయకులు ఎవరు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?
వాయిదాల మీద వాయిదాలు, తీవ్ర మేధోమధనం తర్వాత ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ గౌడ్‌ని నియమించింది కాంగ్రెస్ అధిష్టానం. ఇక అక్కడితో తన పని అయిపోయిందా అన్నట్టుగా….మిగిలిన పదవుల జోలికి వెళ్ళకపోవడంపై తీవ్రమైన చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. గతంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా నియమించినప్పుడు… వర్కింగ్ ప్రెసిడెంట్స్, ప్రచార కమిటీ ఛైర్మన్ పదవుల్ని కూడా వెంటనే ఇచ్చేసింది. అప్పట్లో ఒకేసారి అన్ని పదవులను భర్తీ చేసిన అధిస్థానం ఇప్పుడు మాత్రం కేవలం పిసిసి చీఫ్‌ని నియమించి చేతులు దులుపుకోవడం ఏంటని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఎలాగూ కొత్త వారిని ప్రకటిస్తారు కాబట్టి… ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడ్డం అన్నట్టుగా కామ్ అయిపోయారట పాతవాళ్ళు. అసలు తమకా పదవులు ఉన్నట్టా, లేనట్టా అన్నది కూడా అర్ధంగాక… ఎందుకొచ్చిన తలనొప్పి అనుకుంటూ… అసలు గాంధీభవన్‌కు రావడమే మానేశారట సదరు లీడర్స్. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలన్నీ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ చేతుల మీదిగానే నడుస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్స్ గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజారుద్దీన్ లాంటివాళ్లంతా సైలెంట్ గా ఉండిపోయారు. జగ్గారెడ్డి పదవుల కంటే తన వ్యక్తిగత ఇమేజ్ తోనే రాజకీయాలు నడిపిస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా గాంధీభవన్‌కు వచ్చి వివిధ అంశాలపై మాట్లాడుతున్నారాయన.
పీసీసీ అధ్యక్షుడితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్‌ని కూడా నియమించాల్సి ఉంది. కానీ… అధిష్టానం ఎందుకు వాయిదా వేసిందో అర్ధంకావడం లేదంటున్నాయి పార్టీ వర్గాలు. అలాగే కార్య నిర్వాహక అధ్యక్షులు ముగ్గురా, నలుగురా అన్నది ఇంకా క్లారిటీ రాలేదంటున్నారు. ఆ పదవుల కోసం ఎంపీ చామల కిరణ్, వంశీచంద్ రెడ్డి, రోహిణ్ రెడ్డితోపాటు గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత కూడా పోటీ పడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సరితకి మాటిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. పీసీసీ ఒకటే భర్తీ చేసి మిగతా పదవులను ఖాళీగా ఉంచడంతో ఆశావాహుల పోటీ పెరుగుతోంది. దీనికి తోడు పూర్తిస్థాయిలో కమిటీ వేసేందుకు కూడా పీసీసీ కి అవకాశం లేకుండా పోయింది. పిసిసికి పూర్తిస్థాయి కమిటీని నియమిస్తే…పొలిటికల్ యాక్టివిటీ కూడా పెరుగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్స్‌తోపాటు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని కూడా భర్తీ చేస్తే… రాష్ట్రంలో పార్టీకి ఒక పూర్తి లుక్ వస్తుంది. కానీ.. అలా జరక్కపోవడంతో నాయకులు కొంత అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధిష్టానం పరిధిలో వేయాల్సిన కమిటీలను పూర్తిచేస్తే… పీసీసీ తన టీమ్‌ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవుల్ని కూడా సమీక్షించాలన్న ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ముందే ప్రక్షాళన చేయాలని అనుకున్నా… అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదట. ఇప్పుడిక కొత్త చీఫ్ వచ్చినందున డిసిసి అధ్యక్షుల నియామకం విషయంలో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్లకు మాత్రమే డీసీసీల్లో అవకాశం కల్పించాలని సూచించారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు తప్ప మిగతా పదవులన్నిటిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారన్నది కూడా క్లారిటీ లేదు. కానీ కీలకమైన పదవుల్ని ఖాళీగా పెట్టి… పార్టీని పరుగులుపెట్టించమంటే ఎలాగన్న చర్చ సైతం జరుగుతోందట తెంలగాణ కాంగ్రెస్ వర్గాల్లో. ఈ విషయంలో ఏఐసీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.