NTV Telugu Site icon

Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కారు కాళీ అవ్వబోతుందా..?

Brs

Brs

Off The Record: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం, వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. మిగతా సీట్లు బీఆర్ఎస్ ఖాతాలో పడిపోయాయి. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా జిల్లా పరిధిలోని రెండు ఎంపీ సీట్లు బీజేపీ వశం అయ్యాయి. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఆపరేషన్‌ ఆకర్ష్‌ని స్పీడప్‌ చేయడంతో గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడేందుకు ప్లాన్‌ చేసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా నియోజకవర్గ నాయకులు, ముఖ్య నేతలతో రహస్య మంతనాలు జరిపి కాంగ్రెస్ పెద్దలకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి కారు దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు సిద్ధం అయ్యారని, ముందుగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్‌తో కార్యక్రమం మొదలవుతుందన్న ప్రచారం జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అంతా ఒకేసారి కాకుండా.. రోజుకో ఎమ్మెల్యే జంప్‌ అవుతూ… బీఆర్‌ఎస్‌ మీద మానసిక యుద్ధానికి కూడా తెరలేపాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Read Also: Off The Record: ఏపీ డిప్యూటీ సీఎం ఆ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తారా..?

అలాగే, హైదరాబాద్ శివారు నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇప్పటికే చర్చలు పూర్తి చేశారని, అందులో భాగంగానే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ ఎమ్మెల్యేలు లైన్‌లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రోజుకో ఎమ్మెల్యే చొప్పున సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరితే ఇంపాక్ట్‌ ఉంటుందని అనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. ఈ ఫిరాయింపుల పర్వం మొదలైతే… జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు హ్యాండిచ్చి హస్తం పంచన చేరిపోయారు. తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా గుడ్‌బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్న వార్తలు పార్టీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

Read Also: Telangana Crime: గుట్టురట్టు చేసిన మరణ వాంగ్మూలం.. పరువుకోసం వేధింపులు దాచి..

వాళ్ళంతా కాంగ్రెస్‌ ముఖ్యులతో టచ్‌లో ఉన్నారన్నది పొలిటికల్‌ సర్కిల్స్‌లో నడుస్తున్న టాక్‌. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలం అవ్వడంతో నగరం మీద పట్టు సాధించడంపై ఫోకస్‌ పెంచారట పార్టీ పెద్దలు. ఈ క్రమంలోనే మొదట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు.
తర్వాత హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కొందరు కార్పొరేటర్లు, లోకల్ లీడర్లు వరుసగా హస్తం గూటికి చేరారు. ఇక ఇప్పుడు గ్రేటర్ ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఫామ్ హౌజ్ లో నేతల సర్వ దర్శనానికి అవకాశం ఇచ్చారు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌. అందులో భాగంగానే అందుబాటులో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు వెళ్లి కలిశారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ లో గ్రేటర్ హైదరాబాద్ ముఖ్య నేతల సమావేశం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సగం మంది గ్రేటర్ ఎమ్మెల్యేలు గైర్హాజర్‌ అయ్యారు. ఆ మీటింగ్‌లో పాల్గొనని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లారని… బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అలాగే… సరిపడా నంబర్‌ వచ్చాక బీఆర్ఎస్ ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసి ఫిరాయింపులకు అధికార పార్టీ ఫుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రాజకీయ చదరంగంలో ఎవరి పావులు ఎటువైపు కదులుతాయోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.

Show comments