Off The Record: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరం.. అంతకు ముందు రకరకాలుగా ఫేమస్ అయినా.. పొలిటికల్‌గా మాత్రం 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీతో హాట్ సీట్ అయింది. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించబోయేది ఎవరన్న చర్చ కంటే ఎక్కువగా… భీమవరంలో గెలిచేది ఎవరన్న చర్చే జరిగింది. కానీ… ఊహించని విధంగా ఓటమి చవి చూశాక కూడా… భీమవరంను వదిలిపెట్టలేదు పవన్. మరోసారి ఇక్కడి నుంచే బరిలో దిగాలనుకున్నా… పార్టీ అవసరాలకు తగ్గట్టుగా వ్యూహం మార్చి పిఠాపురం షిఫ్ట్ అయ్యారాయన. అయినా పొత్తులో భాగంగా సీటు మాత్రం తమకే ఉండేలా జాగ్రత్త పడ్డారు పవన్. ఆ పార్టీ తరపున పోటీ చేశారు మాజీ ఎంఎల్ఏ పులపర్తి రామాంజనేయులు. కేవలం గెలుపే కాకుండా… ఊహించని మెజార్టీతో భీమవరంను సొంతం చేసుకుంది జనసేన. అయినా సరే… అది గతంలోని పవన్ ఓటమిని మరిపించేలా లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకే పిఠాపురంతోపాటు భీమవరంపై స్వయంగా డిప్యూటీ సీఎం ఫోకస్ పెట్టేలా ప్లాన్స్ సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Read Also: DU: లా విద్యార్థులకు మనుస్మృతి బోధించాలని ఫ్యాకల్టీ ప్రతిపాదన..తిరస్కరించిన వీసీ
ఎన్నికలకు ముందు ఇక్కడ పర్యటించిన పవన్.. తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా సరే.. భీమవరాన్ని మాత్రం వదిలేది లేదని చెప్పారు. 2019 ఎన్నికల ముందు పలుమార్లు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ సమస్యల పరిష్కారం దిశగా అప్పట్లోనే హామీలు ఇచ్చారు. డంపింగ్ యార్డ్, పంట కాలువల కలుషితం, రహదారుల విస్తరణ వంటి అంశాలపై కచ్చితంగా దృష్టి పెడతామని అన్నారాయమ. దీంతోపాటు ఇప్పుడు ఐదేళ్లుగా భీమవరంలో జరిగిన అవినీతి పై జనసేన నాయకులు ఆరా తీస్తూ అక్రమాల చిట్టా సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పట్టు మరింత పెంచేందుకు భీమవరం కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జనసేన గెలిచిన అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్‌కళ్యాణ్ ఫోకస్ పెంచబోతున్నారని సమాచారం. దీంతో పాటు గతంలో భీమవరం వైసిపి నేతలు ఉప ముఖ్యమంత్రి మీద అనేక ఆరోపణలు చేసినందున వాటికి తగ్గ సమాధానంగానే ఆయన రియాక్షన్ ఉంటుందని భావిస్తున్నారు పార్టీ నాయకులు.
Read Also: Jaipur airport: సెక్యూరిటీపై స్పైస్‌జెట్ మహిళా ఉద్యోగి దాడి.. అసలేం జరిగిందంటే..!
పిఠాపురం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో… భీమవరంపై కూడా అదే స్థాయి ఫోకస్ ఉంటుందని, అలాంటి పర్యటనలు ఉంటాయని భావిస్తోంది లోకల్ జనసేన కేడర్. ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ సాధించిన పట్టు నిలబెట్టుకోవాలంటే… రెండు నియోజకవర్గాల నుంచి కార్యక్రమాలు చేపట్టడమే కరెక్ట్ అని జనసేన అగ్ర నాయకత్వం అనుకుంటున్నట్టు తెలిసింది. మరీ ముఖ్యంగా… భీమవరం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను పరిష్కరించగలిగితే జనసేన పట్టు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకరకంగా జనసేన బలోపేతం కావడానికి, జనసైనికుల్లో కసి పెరగడానికి భీమవరంలో నాటి ఓటమే కారణమన్న అభిప్రాయం కూడా ఉందట పార్టీ వర్గాల్లో. అందుకే ఆగస్ట్ నుంచి నెలకోసారి పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నాయి జనసేన వర్గాలు. పోగొట్టుకున్న చోటే తిరిగి వెతుక్కోవాలి అన్నట్టుగా భీమవరంలో పవన్ అమలు చేయబోయే యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుందో, ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి.