Off The Record: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఇంకో ఆరు నెలల్లో జరగబోతున్నాయి. దీంతో ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం ఆశావహుల సంఖ్య పెరిగిపోతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో ఇప్పుడు ఇదే తరహా పోరాటం మొదలైందట. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి కొడుకు మధ్య మాటల యుద్ధం నడుస్తోందట. సిట్టింగ్‌లకే సీట్లని సీఎం కేసీఆర్ ప్రకటించినా.. కొన్ని చోట్ల గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోందట బీఆర్‌ఎస్. దీన్ని అనుకూలంగా మార్చుకునేందుకు కొందరు తమ వంతు ప్రయత్నాల్లో ఉన్నారట.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజేంద్రనగర్ నుంచి బరిలో దిగాలన్నది ఆయన ప్రయత్నం అట. రాజేంద్రనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రకాశ్ గౌడ్ ఉన్నారు. హ్యాట్రిక్ కొట్టిన ప్రకాష్ గౌడ్ రాబోయే ఎన్నికల్లో కూడా మరోసారి గెలిచి ఇది నా అడ్డా అని రూపించుకోవాలనుకుంటున్నారట. అయితే తాజాగా జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి కొత్త వివాదానికి తెర లేపారట.ఈసారి రాజేంద్రనగర్ సీటు తనదే అన్నట్లు మాట్లాడారట ఆయన. తన తల్లి మహేశ్వరం నుంచి మరోసారి పోటీ చేస్తారని… తాను మాత్రం రాజేంద్రనగర్ నుంచి బరిలో ఉంటానని కార్యకర్తలకు చెప్పేశారట. ఇదే ఇప్పుడు గ్రేటర్ బీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.
కార్తీక్ రెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రాజేంద్రనగర్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా రాజేంద్రనగర్ టికెట్ తనకే ఇస్తారని ధీమా వ్యక్తం చేశారాయన. చేతగాని మాటలు మాట్లాడడం కాదు.. దమ్ము, ధైర్యం ఉంటే టికెట్ తెచ్చుకోవాలంటూ సవాల్ విసిరారు. ఇక చేవెళ్ల లోక్‌సభ సీటును సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికే ఇస్తారని కూడా ప్రకాశ్ గౌడ్ చెప్పుకొచ్చారు. కార్తీక్ రెడ్డికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఏదీ ఇచ్చే అవకాశమే లేదన్నది ప్రకాష్ గౌడ్ మాటల సారాంశం. మొత్తంగా సొంత పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు టికెట్ వ్యవహారంలో వీధికెక్కడంతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందోన్నన సస్పెన్స్ కేడర్‌లో పెరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల కోసం అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పటికే పలు స్థానాల అభ్యర్ధులకు మౌఖికంగా క్లారిటీ ఇచ్చేసింది. రాజేంద్రనగర్‌లాంటి ఇబ్బందికరమైన సీట్లలో ఎవరికి భరోసా ఇస్తారు? ఎవరికి హ్యాండ్ ఇస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది..