Off The Record: కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ రాజకీయం యమ రంజుగా మారుతోంది. ఇంకా చెప్పుకోవాలంటే.. పార్టీలోనే కాపు వర్సెస్ కమ్మ అన్నట్టుగా ఉందట వ్యవహారం. సిట్టింగ్ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ రెండోసారి గెలిచారు. ఆయన రాక ముందు కమ్మసామాజికవర్గానికి చెందిన బొడ్డు భాస్కర రామారావు ఇక్కడ టీడీపీ తరపున రాజకీయం చేసేవారు. కానీ, 2014 ఎన్నికలకు ముందు బొడ్డు ఫ్యామిలీ సైకిల్ తొక్కడం కష్టంగా ఉందనుకుని హ్యాండిల్ వదిలేసి ఫ్యాన్ కింద రిలాక్స్ అయింది. అక్కడ సెట్ అవలేక కొన్నాళ్ళకు తిరిగి పార్టీలోకి వచ్చినా మునుపటంత యాక్టివ్ కాలేకపోయారు బొడ్డు. ఇక భాస్కర రామారావు మరణం తర్వాత ఆయన కుమారుడు వెంకటరమణ చౌదరి పెద్దాపురం పార్టీలో లీడ్ తీసుకోవడానికి ప్రయత్నించినా.. పెద్దలు మాత్రం ఎంకరేజ్ చేయలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా రాజప్ప పోటీ చేస్తారని స్థానిక బహిరంగ సభలో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వెంకటరమణకి రాజానగరం బాధ్యతలు అప్పగించడంతో వివాదం సద్దుమణిగింది.. అయితే ఈ మధ్యకాలంలో కాంట్రవర్సీ కొత్త టర్న్ తీసుకుంది.
పెద్దాపురం టిడిపి టికెట్ తనకు కావాలంటూ హడావిడి చేస్తున్నారు గుణ్ణం చంద్రమౌళి. రాజప్ప ఫోటోగానీ, ఆయన ప్రస్తావనగానీ లేకుండా సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తాను రేస్‌లో ఉన్నానన్న సంకేతాలు పంపుతున్నారు. పార్టీ అధ్యక్షుడు నేరుగా చెప్పినా పట్టించుకోకుండా చినరాజప్పకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ కూడా చేస్తున్నారట.. రాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం.. అది ఎస్సీ రిజర్వుడు కాబట్టి గతంలో ఎమ్మెల్సీగా ఉండేవారాయన. ఆ తర్వాత పెద్దాపురం బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధినాయకత్వం. ఇప్పుడు చంద్రమౌళి వర్గం ఇదే పాయింట్ మీద లోకల్, నాన్‌లోకల్ ఫీలింగ్ తీసుకు వస్తోందట. అయినా.. రాజప్పకు ఆరోగ్యం బాగోలేదు కదా.. ఇక ఏం పోటీ చేస్తార్లే అంటూ.. సెటైర్లు వేస్తోంది గుణ్ణం వర్గం. టిడిపి మొదట్నుంచి పెద్దాపురం సీటును కమ్మ సామాజిక వర్గానికే ఇస్తోంది. ఆ ఈక్వేషన్స్ తోనే అంతకు ముందు బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రస్తుతం చంద్రమౌళి సీటు ఆశిస్తున్నారు. ఇప్పటికే రాజమండ్రి రూరల్‌లో కమ్మ సామాజికవర్గం నేత బుచ్చయ్యని పక్కన పెడతారన్న ప్రచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే ఈ సీటయినా తమ కింద ఉండాలన్నది ఉమ్మడి జిల్లాలో కమ్మ నేతల అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఊపుతోనే చంద్రమౌళి రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో చినరాజప్ప కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారట. పెద్దాపురం పూర్తిగా కాపుల నియోజకవర్గం అని, ఇక్కడున్న మెజార్టీ కమ్మ ఓటర్లు తనకు అండగా ఉన్నారంటూ ధీమాగా ఉన్నారట. పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు మీరు వదిలి వెళ్లిపోయినా.. నేను అంటిపెట్టుకొని ఉన్నానని, తగుదునమ్మా అంటూ ఇప్పుడొచ్చి సీటు అడిగితే ఎలాగంటూ అటాక్ చేస్తున్నట్టు తెలిసింది. తాను ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని, అవకాశవాద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని గట్టిగానే అంటుకుంటున్నారట రాజప్ప. పార్టీలోనే కొందరు తమ అవకాశాల కోసం తనకు ఆరోగ్యం బాగాలేదని, పక్కకు తప్పుకుంటున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట నిమ్మకాయల. అయినా ఈ కబుర్లు చెప్పే సోకాల్డ్ పొలిటీషియన్స్ చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారని, హ్యాపీగా తమ బిజినెస్ తాము చేసుకుంటూ కనీసం రాజమండ్రి వైపు కన్నెత్తి కూడా చూడలేదని ఫుల్ అటాక్ మోడ్‌లోకి వచ్చేస్తున్నారు మాజీ మంత్రి. పదేళ్లుగా ఇక్కడే ఉంటే నాన్ లోకల్ ఎలా అవుతానని, హైదరాబాద్ లో కూర్చుని ఎలక్షన్ టైం కి వచ్చి హడావిడి చేసే వాళ్ళే నాన్ లోకల్ అని కూడా గట్టిగానే రివర్స్ అవుతున్నారాయన. దీంతో ఇప్పుడు పెద్దాపురం టిడిపి రెండు వర్గాలుగా విడిపోయింది. ఇప్పటికైనా పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకొని ఒక స్పష్టత ఇవ్వాలని, ఈ రచ్చ ఇలాగే కొనసాగితే మొదటికే మోసం వస్తుందని టెన్షన్ పడుతోంది కేడర్. మరి పెద్దాపు ప్లేయర్స్ ఆడుతున్న కమ్మ వర్సెస్ కాపు గేమ్‌ని పార్టీ అధిష్టానం ఎలా ఫినిష్ చేస్తుందో చూడాలి.