Site icon NTV Telugu

Off The Record: పవన్‌ పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నారా..?

Pawan Kalyan

Pawan Kalyan

Off The Record: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. పవన్‌కి వరుస లేఖలతో పొలిటికల్ స్క్రీన్ పై హీట్‌ పెంచారు ముద్రగడ. నాలుగు రోజుల క్రితం కాకినాడలో మాట్లాడుతూ.. కులాన్ని వాడుకుని నాయకులూ ఎదుగుతున్నారు తప్ప కులం ఎదగడంలేదని కామెంట్ చేశారు జనసేనాని. ఆ వ్యాఖ్యలు ముద్రగడకు గట్టిగానే గుచ్చుకున్నాయట. కాపు ఉద్యమ కాడి నేను వదిలేస్తే… మీరు ఎత్తుకుని రిజర్వేషన్ ఫలాలు ఎందుకు అందించలేదని రివర్స్‌ కౌంటర్ ఇచ్చారు. కాపు ఓటర్లే కేంద్రంగా ఆ వేడి అలా కొనసాగుతుండగానే…. ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ మొదలైంది. ఆ క్రమంలోనే ముందుకు వచ్చిన పేరు పిఠాపురం.

ఆంధ్రప్రదేశ్‌ మొత్తం మీద కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడి నుంచే ఈసారి పవన్‌ బరిలో ఉంటారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. 2009లో పీఆర్పీ ఇక్కడ నుంచి గెలవడం, గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీచేసింది నామమాత్రపు అభ్యర్థి అయినా ఓట్లు చెప్పుకోతగ్గ రీతిలో రావండంతో ఇది సేఫ్ అని లెక్కలు వేస్తున్నాయట పార్టీ వర్గాలు. ఇప్పటికే రెండుసార్లు అంతర్గతంగా సర్వే కూడా నిర్వహించినట్లు టాక్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రలో మాట్లాడుతూ… అవసరమైతే పిఠాపురంలో పార్టీ ఆఫీసు పెడతానని, ఇక్కడే ఉంటానని ప్రకటించారు. అందుకే ఈసారి తమ నాయకుడు పిఠాపురం నుంచే బరిలో దిగుతారని అంచనాకు వస్తున్నారు కార్యకర్తలు. యాత్రలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనంత ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించారు పవన్‌. ఇవన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్‌ పిఠాపురం బరిలో ఉండే అవకాశం గట్టిగానే ఉందని అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. దీన్నే తనకు అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నారట ముద్రగడ. పవన్‌కు గట్టి కౌంటర్స్‌ వేయడం, లేఖాస్త్రాలు సంధిస్తూ కాలు దువ్వడం ద్వారా.. అధికార పార్టీని ఆకట్టుకోవాలనుకుంటున్నారట. జన సేనాని నిజంగానే పిఠాపురం బరిలో దిగితే ఆయనకు దీటైన ప్రత్యర్థిగా తానే కనిపించాలని, అప్పుడు వైసీపీ పిలిచి టిక్కెట్‌ ఇస్తుందని అనుకుంటున్నారట ముద్రగడ.

తుని రైలు దహనం కేసు కొట్టేయడంతో పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు పద్మనాభం. సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేది లేదని గతంలోనే శపథం చేసి ఉన్నందున ఈసారి పిఠాపురం వైపు చూస్తున్నారాయన. అక్కడ అధికార పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎంపీ వంగా గీత సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆమెకు ప్రత్యామ్నాయంగా… పవన్‌ మీద దీటైన అభ్యర్థిగా తానే కనిపించాలనుకుంటున్నారట ముద్రగడ. వారాహి యాత్రలో ఉన్న పవన్‌ను టార్గెట్‌ చేస్తే తన సత్తా ఏంటో కూడా వైసీపీకి తెలుస్తుందని అనుకుంటున్నారట కాపు ఉద్యమ నేత. అంటే… ఒకే దెబ్బకు రెండు పిట్టల ఫార్ములాను అమలు చేస్తూ…. ఒకవైపు పవన్‌ను టార్గెట్‌ చేయడం, అదే సమయంలో వైసీపీ నాయకత్వానికి తానే దీటైన అభ్యర్థిగా కనిపించి వాళ్ళకై వాళ్ళే పిలిచి సీటిచ్చేలా చేసుకోవాలనుకుంటున్నారట ముద్రగడ. అందుకు తగ్గట్టుగానే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ప్లే చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి పవన్ చేస్తున్న ఇన్ డైరెక్ట్ స్పీచ్‌కు డైరెక్ట్ అటాక్‌ ఇచ్చి ఉనికి కాపాడుకోవాలనుకుంటున్నారట పద్మనాభం. ఈసారి ఎన్నికల్లో మనం తలపడదాం…ఎవరి సత్తా ఏంటో తేల్చేసుకుందామని కౌంటర్ ఇచ్చేశారు. మరి ఈక్వేషన్స్ ఏ మేరకు వర్క్ అవుట్ అవుతాయో? ఎవరెవరు ఎక్కడి నుంచి బరిలో ఉంటారో చూడాలి. ఒకవేళ ఇద్దరూ పిఠాపురంలో తలపడితే మాత్రం పోరు యమ రంజుగా ఉంటుందనడంలో సందేహం లేదంటున్నారు పరిశీలకులు.

Exit mobile version