Off The Record: జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా బహిరంగ లేఖ రాశారు. అందులో పార్టీ విధానాలు.. కార్యకర్తలు, నేతలు వ్యవహరించాల్సిన తీరు.. ఎలా స్పందించాలన్న అంశాలను వివరించారు. తాను చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. అంత వరకు బాగానే ఉన్నా… పవన్ చేసిన సూచనలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయట. జనసేనకు ఉన్న క్రెడిబిలిటీని దృష్టిలో పెట్టుకుని చాలా మంది వివిధ అంశాలను పార్టీ నేతల దృష్టికి తెస్తున్నారని..ఆర్థిక నేరాలపై స్పందించేటప్పుడు వాటిని పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకుని.. అలాగే డాక్యుమెంట్ సహా సాక్ష్యాధారాలు ఉంటేనే మాట్లాడాలని సూచించారు. అది కూడా ముందు పార్టీ అధినాయకత్వం దృష్టికి తేవాలని స్పష్టం చేశారు. అలాగే విమర్శలు చేసే సందర్భంలో ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దని ఆదేశించారు. మరీ ముఖ్యంగా పొత్తుల విషయమై మాట్లాడేటప్పుడు.. స్పందించే సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు ఇవే అంశాలపై పార్టీ కేడర్ ఆసక్తికర చర్చ జరుగుతోందట.
సరైన పత్రాలు లేకుండా ఎవరిపైనా ఆర్థిక నేరారోపణలు చేయొద్దని ఎందుకన్నారనేది ఓ ప్రశ్న. ఇది మంచి విధానమే అయినా.. రాజకీయ పార్టీగా ఆచరణలో ఎంత వరకు ఇది సాధ్యమనే ప్రశ్న వస్తోందట పార్టీ నాయకులకు. ప్రస్తుతం ఉన్న పోటీ రాజకీయాల్లో ఈ విధంగా ఉండడం సాధ్యమయ్యే పనేనా అనే చర్చ జరుగుతోందట. జనసేనకు ఉన్న క్రేజ్ ను ఎవరైనా నేతలు.. తమ వ్యక్తిగత లబ్ది కోసం వాడుకుంటున్నారనే సమాచారంతో దానికి చెక్ చెప్పడానికే పవన్ ఈ తరహా సూచన చేశారా..? అన్న అనుమానాలు కూడా వస్తున్నాయట. ఇక ఇదే సందర్భంలో పవన్ కేసులకు భయపడుతున్నారా..?అనవసరంగా కేసులు పెట్టించుకుని ఇబ్బందులు పడటం ఎందుకనుకుంటున్నారా? లేక రాద్దాంతం ఎందుకని భావిస్తున్నారా..? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోందట. సాధ్యాసాధ్యాల మాట ఎలా ఉన్నా…ఈ స్టాండ్ మీద నిలబడిగలిగితే మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో పవన్‌కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తారనే చెప్పొచ్చంటున్నారు.
మరోవైపు పొత్తుల గురించి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని.. ఆధారం చేసుకుని మాట్లాడొద్దని.. తమతో సయోధ్యగా ఉన్న రాజకీయ పార్టీల్లోని చిన్న చితక నేతలు ఏమైనా విమర్శలు చేసినా.. దాన్ని లైట్ తీసుకోవాలని.. ఆయా పార్టీల విధానాలుగా భావించొద్దని.. స్పష్టం చేశారు జనసేనాని. ఇప్పుడిదే చర్చనీయాంశం అయింది. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు బీజేపీని ఉద్దేశించినవా..? లేక టీడీపీని ఉద్దేశించి చేశారా..? అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీల్లోని నేతలు ఎవరూ పవన్ ఉద్దేశించి ఎలాంటి నెగెటివ్ కామెంట్లు చేయడంలేదు. కానీ.. టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఖరారు అయిందని.. ఇక సీట్ల పంపకమే తరువాయన్న ప్రచారం నిజమేనన్న అభిప్రాయం పవన్ లేఖ ద్వారా స్పష్టం అవుతోందంటున్నారు. వ్యతిరేక కామెంట్స్ చేయవద్దని కేడర్‌కి సూచించింది కూడా టీడీపీ విషయంలోనే అనే అభిప్రాయం కూడా ఉందట. సీట్ల పంపకంలో భాగంగా తమకు అవకాశంరాని నేతలు అసంతృప్తిగా ఉంటారు.. వారు ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ఏదోఒక వ్యతిరేక వ్యాఖ్య చేస్తారని, అందుకే ముందు జాగ్రత్తగా పవన్ ఇలా సూచనలిచ్చారన్న మరో వాదన కూడా ఉంది.
నేతలు చేసే కామెంట్ల ప్రభావం పొత్తులపై పడకుండా.. ఓట్ షేరింగ్‌లో ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటంలో ఇది తొలి అంకంగా భావిస్తున్నారట. ఇదే సందర్భంలో టీడీపీ-జనసేన మధ్య గ్యాప్ పెంచేలా సోషల్ మీడియాలో జరిగే ప్రచారంతో జనసేన కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతే.. అది మరింత నష్టం కలిగిస్తుందని, అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే పవన్ ఈ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తున్న మాట. మొత్తంగా ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో తన పార్టీ కార్యకర్తలకు పవన్ చేసిన ఈ సూచనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. నిజంగానే వీటిని ఆచరణలో పెట్టగలిగితే మాత్రం ఇవాళ్టి రాజకీయ పరిస్థితుల్లో ట్రెండ్ సెట్టర్స్ అవుతారంటున్నారు విశ్లేషకులు.