Off the Record: తెలంగాణలో రాజకీయ పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు, అధికార మార్పిడి తర్వాత జంపింగ్ జపాంగ్‌ల జోరు పెరుగుతోంది. తెప్పలుగ చెరువు నిండిన కప్పలు పదివేలు అన్న పద్యాన్ని నరనరానా జీర్ణించుకున్న నాయకులు పవరున్న పార్టీవైపు పరుగులు పెడుతున్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు పెరుగుతున్నాయి. చేరికల చర్చ జరుగుతున్న సమయంలోనే.. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పొలిటికల్ హాట్‌గా మారింది. ఆ నలుగురూ ప్రస్తుతానికి పార్టీ మారకున్నా.. ఆ ఎపిసోడ్‌పై మాత్రం నానా రచ్చ జరిగింది. చివరికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నియోజకవర్గాల కోసం, మర్యాదపూర్వకంగానే సీఎంని కలవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. పైకి ఎంత చెప్పినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోవడంతో.. అలర్టయిన బీఆర్‌ఎస్ అధిష్టానం తమ నేతలు ఎవరు అధికార పార్టీ నాయకుల్ని కలిసినా.. పార్టీకి ముందస్తు సమాచారం ఇవ్వాలని ఆదేశించిందట.
అలా ఆదేశాలిచ్చిన కొద్ది రోజులకే సీఎం రేవంత్‌ను కలిశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి. ఇటు ఎమ్మెల్సీ భార్య, వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ.. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, ఇక కండువాలు మార్చడమే తరువాయి అన్నట్టుగా ఉంది వాతావరణం. సునీతకు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు వెనక ఇది కూడా ఒక కారణమై ఉండవచ్చన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. సాధారణంగా పార్టీలు మారేటప్పుడు మహేందర్‌రెడ్డిది ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంటుంది. మహేందర్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కూడా వెంట ఉంటారు. కానీ.. ఈసారి సీఎంతో భేటీకి నరేందర్‌రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో పట్నం ఫ్యామిలీలో ఏం జరుగుతోందన్న ఆసక్తి పెరిగింది రాజకీయ వర్గాలకు.
2018 ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలిచారు నరేందర్‌రెడ్డి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ చేతిలో ఓడిపోయారు నరేందర్ రెడ్డి. దీంతో రాజకీయ వర్గాల ఆసక్తి ఇంకా ఎక్కువ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పట్నం ఫ్యామిలీ అంతా కాంగ్రెస్‌లోకి మారుతుందన్న చర్చ జరిగింది. అయితే అప్పట్లో వివిధ రాజకీయ కారణాలతో చేరిక వాయిదా పడింది. కానీ…ఇప్పుడు సీజన్ మారడంతో పట్నం ఫ్యామిలీ హస్తం గూటికి చేరడం ఖాయమైపోయింది. అయితే ఇన్నాళ్ళు సోదరుడి వెంట నడిచిన నరేందర్‌రెడ్డి ఈసారి విభేదించినట్టు తెలిసింది. కుటుంబంగా ఒక్కటే అయినా… రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అందుకు తగ్గట్టే తన అడుగులుంటాయన్నది మాజీ ఎమ్మెల్యే అభిప్రాయంగా తెలిసింది. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే.. ఉమ్మడి రంగా రెడ్డి జిల్లాలో సీనియర్ నేత అయిన పట్నం మహేందర్ రెడ్డి వెంట ఆయన సోదరుడు కాంగ్రెస్‌లోకి వెళ్ళడం లేదన్నది క్లియర్. ఇన్నాళ్ళు ఒకే పార్టీలో ఉండి రాజకీయం చేసిన అన్నదమ్ములు ఇప్పుడు అధికార, ప్రతి పక్షాల్లో వేర్వేరుగా ఉండి ఎలా వ్యవహరిస్తారోనన్న ఆసక్తి పెరుగుతోంది రాజకీయ వర్గాల్లో. అన్నదమ్ముల బంధానికి అనుగుణంగా సామరస్యపూర్వకంగా ఉంటారా? లేక రాజకీయ ప్రత్యర్థులుగా పొలిటికల్ పోట్లాటలు ఉంటాయా అన్నది చూడాలి.