Off The Record: నెల్లూరు సిటీ వైసీపీ పాలిటిక్స్ యమ హాట్ హాట్‌గా మారిపోతున్నాయి. ఫైర్ బ్రాండ్‌గా పేరుపడ్డ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదర్‌కు, సీనియర్స్‌కు మధ్య ఓ రేంజ్‌లో పొలిటికల్ వార్ నడుస్తోందట. అది ఎంతదాకా వెళ్ళిందంటే ఈసారి అనిల్ గెలవబోరని సొంత పార్టీ వారే ప్రచారం చేసేస్తున్నారట. అనిల్‌కు బాబాయ్ వరసయ్యే రూప్ కుమార్ యాదవ్, సీనియర్ నేత వై.వి.రామిరెడ్డి… నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ లాంటి నేతలు ఆయనకు దూరమయ్యారు. దీంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి.. రూప్ కుమార్ యాదవ్ ప్రత్యేకంగా జగనన్న భవన్ పేరుతో కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకున్నారు. వైసిపి చెందిన పలువురు నేతలు, కార్పొరేటర్లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. దీంతో అనిల్ కుమార్, రూప్ కుమార్ మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు జరుగుతున్నాయి.
అంతేకాదు, అనిల్‌కు ఎలక్షనీరింగ్ చేసే నాయకులు లేరని, అందుకే ఈసారి ఇబ్బందులు పడతారని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు తనకు నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ అధ్యక్ష పదవి వచ్చేందుకు అనిల్ చేసిన కృషి ఏమీ లేదని ముక్కాల ద్వారకానాథ్ వ్యాఖ్యానించడంతో అనిల్ వర్గంలో ఆగ్రహం వ్యక్తమైంది. తాను పెంచి పోషించిన నేతలే తిరగబడుతుండటంతో మాజీ మంత్రిలో అసహనం తీవ్రమైందట. నెల్లూరులో పార్టీ పరిస్థితిని గుర్తించిన అధిష్టానం. విభేదాలు తొలిగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకొని అనిల్ కుమార్ యాదవ్, రూప్ కుమార్ యాదవ్ లను కలిపి.. కలిసికట్టుగా పని చేయాలని ఆదేశించినా ఫలితం లేకపోయింది. ఇటీవల అసమ్మతి నేతల కార్యకలాపాలు తీవ్రం కావడంతో.. పార్టీ కేడర్ లో కూడా అయోమయం నెలకొంది. అనిల్ కు టికెట్ రాదని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే ప్రచారం చేస్తుండడంతో మాజీ మంత్రి అనుచరులలో కలవరం మొదలైందట.
దీనికి అడ్డుకట్ట వేయకపోతే తన రాజకీయ మనగడకే ప్రమాదం ఏర్పడుతుందని భావించిన అనిల్ కుమార్ యాదవ్.. అనుచరులకు భరోసా కల్పిస్తూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తనను వ్యతిరేకిస్తున్న నేతలపై విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తనకే టికెట్ వస్తుందని, తానే పోటీలో ఉంటానని చెప్పారు. టికెట్ రాకుండా ఆపే శక్తి కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. రూప్ కుమార్ యాదవ్ ముక్కాల ద్వారకనాథ్ లను బహుబలి..బల్లాల దేవుళ్ళుగా అభివర్ణిస్తూ.. విమర్శలు చేశారు.. ఎవరు పని చేసినా చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇలా కార్యకర్తల్లో ఊపు తీసుకువచ్చి దాన్ని ఎన్నికల దాకా కొనసాగించాలని అనిల్ భావిస్తున్నారు. ఎంత అసమ్మతి ఉన్నా… వారు ప్రత్యర్థి పార్టీకి పని చేయబోరని అందుకే… తనను వ్యతిరేకిస్తున్న నేతల స్థానంలో వేరేవారిని నియమించుకొని కార్యకలాపాలను నిర్వహించాలని భావిస్తున్నారట అనిల్. గడపగడపకు మమన ప్రభుత్వం కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడతామని.. మళ్లీ ప్రజలోనే ఉంటే… టిక్కెట్ రాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నది అనిల్ ధీమా అని చెబుతున్నారు ఆయన అనుచరులు. కానీ… అందరి సహకారం లేకుండా పని చేయడం అంత సులువు కాదని అంటున్నారు నియోజకవర్గానికి చెందిన మరికొందరు. గత ఎన్నికల్లో వైసీపీ హవాకు తోడు అంతా అంకితభావంతో పని చేసినా.. అనిల్‌కు రెండు వేల ఓట్ల మెజార్టీ మాత్రమే వచ్చిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.దాన్ని గుర్తించకుండా ఎవరు పోయినా నాకేం ఫర్వాలేదనుకుంటే… చివరికి దెబ్బతినేది ఆయనేనంటున్నారు వైసీపీ నెల్లూరు నాయకులు. బాబాయ్, అబ్బాయ్‌లలో చివరికి ఎనరు ఎవర్ని కలుపుకుని పోతారు? ఎవరిది పై చేయి అవుతుందన్నది చూడాలి.