NTV Telugu Site icon

Off The Record: జోగి రమేష్‌ ఘటనలో మంత్రి పార్థసారథి చుట్టూ ఉచ్చు బిగుస్తుందా..?

Kolusu

Kolusu

Off The Record: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ విషయంలో ప్రస్తుత మంత్రి పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారా? అంటే… అవుననే అంటున్నారట ఏపీ పొలిటికల్‌ పరిశీలకులు. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం సర్దార్‌ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. అదే ప్రోగ్రామ్‌కు మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అటెండ్‌ అయ్యారు. ఇక విగ్రహావిష్కరణకు వెళ్ళే ముందు ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో ఒకే వాహనంపై మంత్రి పార్ధసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి జోగి రమేష్ కలిసి వెళ్ళారు. హాయిగా నవ్వుతూ… కలిసే అందరికీ అభివాదాలు చేస్తూ… ర్యాలీలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఒకే వేదికపై కూర్చుని ఆసాంతం కార్యక్రమంలో పాల్గొన్నారు. సీన్ కట్ చేస్తే… ఈ సీన్లే… వైరల్‌ అయి రచ్చ జరుగుతోంది.

Read Also: Rajagopal Reddy: ఎన్టీఆర్‌ గార్డెన్‌లో అసెంబ్లీ నిర్మాణం జరిగితే బాగుంటుంది.. ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

టీడీపీ కేడర్‌ అయితే మంత్రి మీద ఓ రేంజ్‌లో ఫైరైపోతోంది. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన, చంద్రబాబు, పవన్, లోకేష్‌లను ఇష్టారీతిన తిట్టిన జోగి రమేష్‌తో కలిసి మంత్రి పార్థసారధి ఎలా ఊరేగుతారంటూ నిలదీస్తున్నారు టీడీపీ లీడర్స్‌, కార్యకర్తలు. మేటర్‌ సీరియస్‌ అవడంతో… మొత్తం వివరాలు తెప్పించుకున్న టీడీపీ అధిష్టానం… సారధి, గౌతు శిరీషపై ఆగ్రహం వ్యక్తం చేసిందట. దీనిపై వివరణ ఇవ్వాలని ఇద్దర్నీ లోకేష్‌ ఆదేశించడంతో వ్యవహారం వేడెక్కింది. దీంతో పార్ధసారధి ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు సారీ చెప్పారు. అయినప్పటికీ తమ్ముళ్ళు చల్లబడలేదు. సారధి తీరును తప్పు పడుతూ సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో ఉతికారేస్తున్నారు. పోస్టులు, వీడియోలు వైరల్ అవడంతో… రెండోసారి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ సారధి వివరణ ఇచ్చుకునే ప్రయత్నంచేశారు. టీడీపీ క్యాడర్‌ను నొప్పించినందుకు సారీ.. సో.. సారీ.. అంటూ పదే పదే వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు మంత్రి. కార్యక్రమం ప్రభుత్వం లేదా పార్టీ ఆధ్వర్యంలో జరగలేదని, స్థానికంగా ఉన్న గౌడ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిందని, తనను పిలిస్తే వెళ్ళాను తప్ప.. ఎవరెవరు అందులో పాల్గొంటున్నారన్నది తెలియదని కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సారధి. జోగి రమేష్‌ను కార్యక్రమంలో చూసి తాను కూడా షాకయ్యానని, అయినప్పటికీ టీడీపీ శ్రేణులకు సారీ చెబుతున్నానని అన్నారాయన. అయినా తెలుగుదేశం కేడర్‌ మాత్రం తగ్గడం లేదట. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఓ కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ఏమీ తెలుసుకోకుండానే మంత్రి గుడ్డిగా ఓ కార్యక్రమంలో పాల్గొంటారా అంటూ సోషల్‌ మీడియా వేదికగానే నిలదీస్తోంది కేడర్‌.

Read Also: Sanjay Singh: కొత్త చిక్కుల్లో ఆప్ ఎంపీ.. గోవా సీఎం భార్య పరువునష్టం కేసు

వైసీపీ హయాంలో ఐదేళ్ళపాటు పార్ధసారధి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎన్నికల ముందు టీడీపీలో చేరి పెనమలూరు నుంచి నూజివీడుకు మారి పోటీ చేసి గెలిచి మంత్రయ్యారు. కొత్తగా నెలల ముందు మాత్రమే పార్టీలో చేరినా… సారధికి మంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు సీఎం చంద్రబాబు. ఇలాంటి పరిస్థితుల్లో… గతంలో చంద్రబాబును నోటికొచ్చినట్టు తిట్టడమే కాకుండా, ఏకంగా ఆయన ఇంటిపై దాడికి వెళ్ళిన జోగి రమేష్‌తో కలిసి సారధి ఎలా ర్యాలీలో పాల్గొంటారు? ఒకే వేదికను ఎలా పంచుకుంటారన్నది టీడీపీ శ్రేణుల క్వశ్చన్‌ అట. అందుకే సారధిని సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తూ జోగి రమేష్, సారధి ఒకే తాను ముక్కలంటూ పోస్టులు కూడా పెట్టేస్తున్నారు. ఇక పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మంత్రి తీరుపై మండిపడ్డారు. మంత్రి ఆలోచనల్లో నిజాయితీ ఉంటే… జోగి రమేష్‌ను చూసిన వెంటనే వాహనం నుంచి దిగి వెళ్లిపోవాలి కదా? అలా కాకుండా ఆయనతో ఎందుకు అంటకాగారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్దా. ఈ పరిస్థితుల్లో మంత్రి సారధి ఎంతలా వివరణ ఇచ్చుకున్నా… పూర్తి స్థాయిలో జోగి రచ్చ నుంచి బయటపడలేక పోతున్నట్టు చెప్పుకుంటున్నారు. స్థానిక గౌడ సామాజికవర్గంలోని వైసీపీనేత ఆహ్వానంతోనే జోగి రమేష్‌ ఈ కార్యక్రమానికి వచ్చి ఉంటారని సారధి చెబుతున్నా… ఒకే వాహనంపై ఎలా ర్యాలీగా వెళ్తారనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారట మంత్రివర్యులు. అందుకే టీడీపీ శ్రేణులకు పదే పదే సారీ చెబుతూ సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. ఇదంతా చూస్తున్నవారు మాత్రం జోగి ఎపిసోడ్‌లో పార్ధసారధి అడ్డంగా బుక్కయ్యారు. ఎలా బయటపడతారో చూడాలంటున్నారు.

Show comments