Off The Record: కాకినాడ జిల్లాలో మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మధ్య పగ… సెగలు రేపుతోంది. పేరుకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా… మాట్లాడుకోవడం సంగతి అటు ఉంచితే కనీసం ముఖ ముఖాలు చూసుకునేందుకు కూడా ఇష్టపడటం లేదట. అంతదాకా ఎందుకు…అసలు ఒకరు వెళ్లిన దారిలో మరొకరు వెళ్లనంత రేంజ్లో ప్రతీకార జ్వాలలు రగుతున్నట్టు తెలిసింది. దాడిశెట్టి రాజా, ద్వారంపూడి ఇద్దరూ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారే. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో రాజాకు కేబినెట్ బెర్త్ దక్కింది. ఆ హోదాలో ఇంతకు ముందు ఒకసారి కాకినాడ పోర్టులో ఓ పని కోసం రికమండ్ చేశారట దాడిశెట్టి. అయితే.. తన సొంత నియోజకవర్గంలో ఎవరూ వేలు పెట్టడానికి వీల్లేదని, అసలు ఆ పని కాదని అడ్డుపడ్డారట ఎమ్మెల్యే. అయితే.. తాను రాష్ట్ర మంత్రినని, ఎక్కడైనా పని చేయించుకునే స్థాయి ఉన్నవాడినని అప్పట్లో దాడిశెట్టి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ కనీసం పలకరించుకున్న సందర్భాలు కూడా లేవన్నది పార్టీ వర్గాల సమాచారం. అది జరిగి నెలలు గడుస్తున్నా… ఇద్దరి మధ్య వాతావరణం చల్లారకపోగా…. హీట్ అంతకంతకూ పెరుగుతోందని అంటున్నారు స్థానిక వైసీపీ నాయకులు. ఎక్కడైనా.. మంత్రి అయ్యుండొచ్చు కానీ తన నియోజకవర్గం కాకినాడలో మాత్రం కాదంటున్నారట ద్వారంపూడి. మేటర్ పెద్దల దాకా వెళ్ళినా…చివరికి ఎమ్మెల్యేదే పైచేయి అయిందన్నది పార్టీ వర్గాల సమాచారం. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో మంత్రి మౌనానికి అది కూడా కారణం అయి ఉండవచ్చన్న విశ్లేషణలున్నాయి.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర జరిగినప్పుడు ద్వారంపూడిని టార్గెట్ చేశారు పవన్. ఆ టైంలో….ఇతర సామాజిక వర్గాల వ్యవహారం ఎలా ఉన్నా…రాష్ట్ర వ్యాప్తంగా కాపు మంత్రులు మాత్రం పవన్‌కు గట్టిగానే కౌంటర్స్ వేశారు. కానీ… జిల్లాలో, అదే సామాజిక వర్గానికి చెందిన దాడిశెట్టి రాజా కనీసం మాట్లాడడానికి కూడా నిరాకరించారట. పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి లైన్ వచ్చినా టచ్ చేయడానికి ఇష్టపడలేదట మంత్రి. తర్వాత గత వారం పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి రివ్యూ మీటింగ్ పెట్టారు. దానికి కూడా డుమ్మా కొట్టేశారట మంత్రి.. తాను తునిలోనే ఉన్నా సమావేశం కాకినాడలో కావడంతో లైట్ తీసుకున్నారట. నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నానని, కాకినాడలో జరిగే సమావేశానికి మాత్రం తాను రానని తేల్చి చెప్పేశారట దాడిశెట్టి. ఒకవేళ ప్రభుత్వపరంగా జెడ్పీ సమావేశాలకు, ఇతర రివ్యూలకు కాకినాడ వచ్చినా ఎవరి టైమింగ్స్‌లో వారు వస్తున్నారని, అనుకోని పరిస్థితుల్లో కలిసినా ఎడమొఖం పెడ ముఖంగానే ఉంటున్నట్టు తెలిసింది. జిల్లాలో తునితోపాటు మిగతా నియోజకవర్గాల్లో కాంట్రాక్టుల విషయంలోనూ, ఇతర పనుల్లోను ద్వారంపూడి, అతని అనుచరుల జోక్యం ఉండకుండా చూడాలని మంత్రి మౌఖిక ఆదేశాలిచ్చినట్టు అధికారుల్లో చర్చ జరుగుతోంది. అది తెలిసిన ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా గట్టిగానే కౌంటర్స్ వేస్తున్నారట. దాడిశెట్టి రాజా తునికి మాత్రమే మంత్రిగా వ్యవహరిస్తున్నారని, అసలు ఆయన మంత్రి అయ్యాక జిల్లాలోని ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్నిసార్లు తిరిగారని రివర్స్ అటాక్ చేస్తున్నారట. ఇద్దరూ పార్టీకి విధేయులే కావడంతో ఏం చేయాలో పాలుపోక అధిష్టానం కూడా టైం కోసం ఎదురు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి దాడిశెట్టి, ద్వారంపూడి వ్యవహారం అధికార పార్టీలో హీట్ పుట్టిస్తోంది. ఇద్దరూ పై స్థాయిలో పరిచయాలు ఉన్నవారు కావడంతో జిల్లాలో ఇతర నేతలు ఎవరినీ టచ్ చేయలేకపోతున్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సఖ్యత లేకపోతే ఫ్యాన్ స్పీడ్ తగ్గుతుందన్నది కేడర్ లెక్క. పార్టీ పెద్దలు ఈ వ్యవహారాన్ని ఎలా సెట్ చేస్తారో చూడాలి.