Off The Record: నిన్న మొన్నటి వరకు వాళ్లిద్దరు గురు శిష్యులు! ఒకరి విజయానికి మరొకరు సహకరించుకున్నారు! ఇప్పుడు సీన్ రివర్స్ అయింది! కూతురి రాజకీయ భవిష్యత్తు కోసం గురువు- శిశ్యుడికి శత్రువయ్యాడు. గెవలడానికి సహకరించలేదని శిశ్యుడు కత్తిగట్టి మరీ బరిలో నిలబడ్డాడు! ఈ కొట్లాటలో గురువు గెలుస్తాడా? శిశ్యుడు విక్టరీ కొడతాడా?
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కడియం శ్రీహరి- ఆరూరి రమేష్ మంచి గురుశిష్యులని చెప్పుకుంటారు! చాలాకాలం పాటు ఒకే పార్టీలో పనిచేశారు. ఒకరి విజయానికి మరొకరు సహరించుకున్నారు. టీడీపీలో ఉన్నన్ని రోజులు స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం శ్రీహరి గెలుపునకు అరూరి రమేష్ సహకరిస్తే.. వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ విజయం కోసం కడియం శ్రీహరి రిస్క్ తీసుకున్నారు. ఇలా పరస్పరం ఒకరికొకరు రాజకీయంగా ఎదిగేందుకు సహరించకుని ఆదర్శ గురు శిష్యులుగా నిలిచారు. ఇలా 20 ఏళ్ల పాటు వీరిమధ్య బంధం- అనుబంధం – ఒక్కసారిగా వైరంగా మారింది. గురు శిష్యులు కాస్త ప్రత్యర్థులయ్యారు.
కడియం శ్రీహరి సహకారంతో ఆరూరి రమేష్ ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందితే, ఆరూరి సహకారంతో కడియం శ్రీహరి ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పొలిటికల్ సర్కిల్‌లో చెప్పుకుంటారు. ఇలా సుమారు 20 ఏళ్ల పాటు వీరిద్దరూ గురు శిష్యులుగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా 2023 ఎన్నికలు వీరిని విడదీశాయి. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందితే, వర్ధన్నపేట నుంచి పోటీ చేసిన ఆరూరి రమేష్ ఓటమిపాలయ్యారు. అయితే కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం కడియం శ్రీహరి చాలా రోజులుగా ఆరూరి రమేష్‌కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనేది ఆరూరి వర్గం చేస్తున్న ఆరోపణ. ఆ కారణంగానే వీరి మధ్య గ్యాప్ మరింత పెద్దగా అయిందని టాక్. కూతురిని వర్ధన్నపేట నుంచి బరిలో దించేందుకు కడియం శ్రీహరి చేసిన ప్రయత్నాలు- గురుశిష్యుల మధ్య విభేదానికి కారణమయ్యాయని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
2023 ఎన్నికల్లో ఆరూరి రమేశ్‌ను గెలిపించడంలో కడియం శ్రీహరి సహకరించలేదనే విమర్శలు వినిపించాయి. అదీకాకుండా, ఎంపీగా బరిలో నిలవాలని భావించిన ఆరూరి రమేశ్‌కు చెక్ పెట్టే ప్రయత్నం కూడా కడియం చేశారని రమేష్ వర్గం అంటోంది. అందుకే ఆరూరి బీఆర్‌ఎస్‌ని వీడి బీజేపీలో చేరారని చెబుతున్నారు. ఇదే సమయంలో కడియం శ్రీహరి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి, కూతురు రాజకీయ జీవితం కోసం కాంగ్రెస్‌లో చేరారు. కావ్యకి టికెట్ ఇప్పించుకున్నారు. ఆరూరి రమేశ్ కూడా బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. కట్ చేస్తే.. ఒకేపార్టీలో ఉన్న గురు-శిశ్యులు వేర్వేరు పార్టీల్లోకి వెళ్లి ప్రత్యర్ధులుగా మారారు. గురువు కూతురుతో- శిశ్యుడు పోటీ పడుతున్నారు. దీంతో తెలంగాణలో జరుగుతున్న రవసత్తర పోరులో వరంగల్ ఒకటిగా నిలిచింది. పోరుగడ్డమీద జరుగుగున్న పోరాటంలో శిష్యుడు గెలుస్తాడా? గురువుగారి కూతురు నిలుస్తుందా? రసవత్తర పోరులో జనం ఎవరి వైపు నిలబడతారు?