Off The Record: అప్పుడెప్పుడో కాలేజీలో కలిసి చదువుకుని వృత్తిరీత్యా విడిపోయిన పాత ఫ్రెండ్స్ అంతా మళ్ళీ ఒకే చోట కలుసుకుంటున్నట్టుగా ఉందట ఇప్పుడక్కడ రాజకీయం. తెలుగుదేశంలో పుట్టి బీఆర్ఎస్లో బలపడి ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరిపోతున్నారట. పాత పరిచయాలను కొత్తగా నెమరేసుకుంటున్నారట. ఎక్కడ జరుగుతోందా రాజకీయం? ఎవరా జంపింగ్ జపాంగ్‌లు?
తెలంగాణ కాంగ్రెస్‌లో చేరికల కోలాహలం పెరిగింది. ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలోకి జంప్ చేసేందుకు ప్రతిరోజు ఎవరో ఒకరు ఇటు గాంధీ భవన్కుగాని,అటు సీఎం రేవంత్ ఇంటికిగాని వస్తున్నారు. ఇంకొందరైతే సీఎంని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన అపాయింట్మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. అలాగే పాత పరిచయాల పేరుతో పార్టీలో చేరడానికి, సీఎంకు దగ్గరవడానికి తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారట మరికొంతమంది. అలాంటివారిలో పాత టీడీపీ నేతలు ఎక్కువ మంది ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. పూర్వాశ్రమంలో టీడీపీలో ఉన్నారు రేవంత్‌రెడ్డి. అప్పుడు సైకిల్ పార్టీలో ఆయనతో కలిసి పని చేసిన కొంత మంది నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారట. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ కండువా కప్పుకోగా ఇంకొంత మంది కర్చీఫ్ వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులను అనుభవించి రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు ఎక్కువ మంది నేతలు. మరి కొంతమంది కమలం పార్టీలో చేరారు. పదేళ్ల పాటు గులాబీ పార్టీలో పదవులు అనుభవించడంతో పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసిన నేతలు ఇప్పుడు ఆ పార్టీ తమను పట్టించుకోవడం లేదనో, సేవల్ని సరిగా వాడుకోవడం లేదనో సాకులు చెప్పి బయటపడుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీడీపీ బలంగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా పని చేసిన వారు ప్రస్తుతం ఇతర రాజకీయ పార్టీల్లో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేశారు పట్నం మహేందర్ రెడ్డి. ఆయన భార్య సునీత వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్‌గా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇద్దరూ హస్తం గూటికి చేరిపోయారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పరిస్థితి కూడా అంతే. టీడీపీ హయాంలో హైదరాబాద్ మేయర్ గా పని చేశారాయన. తర్వాత బీఆర్ఎస్లో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన కోడలికి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌గా అవకాశం ఇప్పించుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు తీగల. పాత టీడీపీ నేత, రాజేందర్‌నగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ కూడా త్వరలో కాంగ్రెస్ జెండా కప్పుకుంటారన్న ప్రచారం ఉంది. జీహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి దంపతులు, పలువురు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్‌కు క్యూ కట్టారు. అలాగే రంగారెడ్డి జిల్లాకు చెందిన మరికొంత మంది నేతలు కూడా కాంగ్రెస్ పిలిస్తే పరుగెడదామన్నట్టు షూ లేస్‌లు కట్టుకుని రెడీగా ఉన్నట్టు తెలిసింది.
వరంగల్ మున్సిపల్ మేయర్ గుండు సుధారాణి కూడా హస్తం పార్టీలోకి ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు టీడీపీలో పనిచేసి బిఆర్ఎస్ లో చేరి.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు పరుగులు పెడుతున్నారు చాలామంది. ఇది చూస్తున్నవాళ్ళంతా ఇన్నాళ్ళు ఎక్కడెక్కడో ఉన్న పాత మిత్రులంతా మళ్ళీ కాంగ్రెస్‌లో కలుసుకుంటున్నారన్న మాట అని కామెంట్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే వాళ్ళంతా హస్తం గూటికి చేరుతున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. స్నేహాలు, సంబంధాల సంగతి తర్వాత… రాబోయే ఐదేళ్ళ పాటు అధికారంలో ఉండి పనులు చక్కబెట్టుకునేందుకే వలసలు పెరుగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఆతర్వాత జరుగనున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని కొన్ని కోయిలలు ముందే కూస్తున్నట్టు చెప్పుకుంటున్నాయి రాజకీయవర్గాలు. మరి ముందు ముందు జంపింగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి.