Off The Record: జన జాగృతి. పురిట్లోనే పుటుక్కుమన్న రాజకీయపార్టీ. 2018లో పుట్టి ఏడాది తిరక్క ముందే కాషాయంలో కలిసిపోయింది. కుల రాజకీయాలను సవాలు చేసే లక్ష్యంతో ఏర్పడ్డ జనజాగృతి కంటే ఆ పార్టీ అధ్యక్షురాలి పేరే ఎక్కువగా జనం నోళ్ళలో నానింది. కారణం…. ఆమె చుట్టూ వివాదాలు వైఫైలా తిరుగుతుండటమే. అరకు వ్యాలీ మాజీ ఎంపీ కొత్తపల్లి గీతే ఆ నాయకురాలు. రెవెన్యూ ఉద్యోగం నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన గీత వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం అయిన అరకు నుంచి సుమారు 90వేల ఓట్ల మెజారిటీతో గెలిచారామె. నాడు పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయినా ఈ లోక్‌సభ సీటు పరిధిలోని రిజర్వ్‌డ్ సెగ్మెంట్స్‌ని మాత్రం క్లీన్ స్వీప్ చేసేసింది వైసీపీ. తర్వాత వివాదాస్పద బాక్సైట్ తవ్వకాల విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వ ఆలోచనలను ఎండగట్టడంలో ముందున్నారు అప్పటి ఎమ్మెల్యేలు గిడ్డిఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలకు, ఎంపీ కొత్తపల్లి గీతకు మధ్య రాజకీయ వైరం మొదలైంది. స్ధానికేతరురాలైన గీత పెత్తనాన్ని శాసనసభ్యుల వ్యతిరేకించడంతో వ్యవహారం తీవ్ర స్ధాయికి చేరింది.
గీత, ఈశ్వరి గ్రూపులుగా విడిపోగా ఒకరి నీడను ఒకరు భరించలేని స్ధితికి వెళ్ళింది. ఒక దశలో పాడేరు నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు సంశయించారు కొత్తపల్లి గీత. ఈ వివాదాలు ఒక ఎత్తైతే….గీత అసలు ఎస్టీనే కాదన్న వివాదం కీలకంగా మారింది. తప్పుడు ధ్ర్రవీకరణ పత్రంతో ఎస్టీ రిజర్వ్‌డ్ కోటాలో ఉద్యోగం సంపాదించారని, ఎంపీగా పోటీ చేసి గెలిచారనే ఫిర్యాదులు కోర్ట్ దాకా వెళ్ళాయి. అదే సమయంలో గీత ఫ్యామిలీ వ్యాపార ఆర్ధిక లావాదేవీలు కూడా బెడిసికొట్టాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కేసులో సీబీఐ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ వ్యవహారాలతో విసిగిపోయిన వైసీపీ హైకమాండ్ ఆమెను దూరంగా పెట్టింది. దీంతో ఐదేళ్ళపాటు ఎంపీగా పనిచేసిన కొత్తపల్లిగీత. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు ఈశ్వరి,సర్వేశ్వరరావులు టీడీపీలో చేరిపోయారు. కుల ఆధిపత్యాలను ఎదుర్కోవడమే లక్ష్యం అని ఘనంగా ప్రకటించుకుని జనజాగృతి పేరుతో సొంత దుకాణం పెట్టుకున్నారు మాజీ ఎంపీ.
ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. రాజకీయ పొత్తు పొడుపులు అనివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ తరపున పాడేరు, అరకు సీట్లలో పోటీకి శ్రవణ్, ఈశ్వరి సన్నాహాలు చేసుకుంటున్నారు. అరకు ఎంపీగా మాజీ ఐఏఏస్ అధికారి లేదా స్ధానికంగా ఇక్కడి పరిస్ధితులపై అవగాహన వున్న మరో నాయకుణ్ణి ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్ళు ఎక్కడున్నారో తెలియని గీత ఇప్పుడు సడన్‌గా ఎంట్రీ ఇచ్చి తాను ఎంపీగా వున్నప్పుడు పట్టించుకోని అంశాలను సైతం ప్రస్తావిస్తూ… రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ఎంపీ చేస్తున్న ఈ విన్యాసాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అరకు వ్యాలీలో రహదారులు దెబ్బతిన్నాయని ఆందోళనకు దిగారు గీత. రోడ్లపై వున్న గుంతల్లో వరినాట్లు వేసి ఏదో సాధించేసినట్టు బిల్డప్ ఇచ్చారు. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడొచ్చి ఈ హంగామా ఏంటబ్బా అని ఆరా తీసిన వారికి సినిమా ఐ మ్యాక్స్ బిగ్ స్క్రీన్ మీద కనపడిందట. బీజేపీ తరపున పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయడానికే ఆమె తిరిగి అరకు దారి పట్టారట. నాడు కేసులకు భయపడి బీజేపీలో చేరిన గీత అవకాశం వస్తే… పొత్తులు కుదిరితే…టీడీపీ బలంతో మరోసారి అరకు ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఈ యాక్షన్ సీన్స్ మొత్తం అందులో భాగమేనంటున్నారు విషయం తెలిసిన వారు. మరోవైపు అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బలహీనపడ్డా… పార్టీ బలం చెక్కు చెదరలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమెను ఎక్కడ తీసుకొచ్చి మా నెత్తిన రుద్దుతారోనని అటు టీడీపీ, ఇటు వైసీపీ స్థానిక నేతలు హడిలిపోతున్నారట. గీత కితకితలు ఎవరికి ఉంటాయో చూడాలి.