Off The Record: ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెంచింది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఊహించినట్టుగానే అధ్యక్ష బాధ్యతల నుంచి సోము వీర్రాజును సాగనంపింది. పార్టీ బలోపేతానికి ప్రత్యర్థులను తలుపు చెక్కతో కొట్టమని పురమాయిస్తే వీర్రాజు తమలపాకులతో సరిపెట్టారనేది ఆయన ప్రత్యర్థులు చెప్పేమాట. అటు అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం పార్టీ వర్గాలకే ఆశ్చర్యం కలిగించిందట. ఆ దిశగా జరుగుతున్న చర్చల్లో బయటికి వస్తున్నదే విశాఖ ఎంపీ స్థానం. ఈ ఎంపీ సీటు మీద పార్టీ నాయకత్వం ఎప్పట్నుంచో గురిపెట్టిందని, కొత్త అధ్యక్షురాలి కార్యక్షేత్రం కూడా విశాఖే అవడం ఖాయమన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. గతంలో విశాఖ ఎంపీగా పనిచేసి ఉన్నారు పురంధేశ్వరి.
ఏపీలో కాషాయ పార్టీకి గౌరవ ప్రదమైన ఓట్లు, కేడర్ వున్నది కూడా విశాఖలోనే. నగరంలో వలసఓటర్లు, మరీ ముఖ్యంగా ఉత్తరాది నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేందుకు వచ్చి స్థిరపడ్డవారు ఎక్కువ. వీరు బీజేపీవైపు మొగ్గుతారన్నది అంచనా. పొత్తులు కుదిరితే… టీడీపీ,జనసేనల బలం కలిసి వస్తుంది. ఈ లెక్కలు వేసుకునే విశాఖ ఎంపీ సీటుపై కర్చీఫ్ వేసేందుకు బీజేపీ సీనియర్లు పోటీపడుతున్నారట. ఈ క్రమంలో ఈసారి అందరికంటే ముందు ఇక్కడ మకాం పెట్టింది మాత్రం రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు. వచ్చే ఏడాదితో ఆయన రాజ్యసభ గడువు ముగుస్తుంది. ఈ లోగా పూర్తిస్థాయి సన్నద్ధత సాధించగలిగితే సీటు పోటీలో ముందు వరుసలో ఉండొచ్చనేది ప్లాన్ అట. ఆ దిశగా వివాదాలు ఎదురైనా వెనక్కి తగ్గడం లేదు జీవీఎల్.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గంపై దృష్టి పెట్టి.. .ఆ ఓట్లను తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ… సొంత పార్టీలోనే విస్త్రతమైన చర్చ జరుగుతోంది. వంగవీటి రంగా పేరును ఓ జిల్లాకు ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించడం ద్వారా కాపుల వాయిస్ వినిపించేందుకు సిద్ధం అనే సంకేతాలు పంపగలిగారు జీవీఎల్. అదే సమయంలో విశాఖలో మత్స్య కారుల సమస్యలతో పాటు బీసీ వర్గాలకు చేరువయ్యే ప్రతీ అవకాశాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారాయన. అయితే… అధ్యక్ష పదవి విషయంలో హైకమాండ్ నిర్ణయంతో ఇరుకున పడ్డట్టు కనిపిస్తున్నారట. అందుకే… మరింత దూకుడు పెంచి… రేపు విశాఖలో ఎవరు పోటీ చేస్తారంటే…ముందుగా తనపేరే వచ్చేట్టు చేసుకోవాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే ఇన్నేళ్ళలో ఎన్నడూ లేనిది విశాఖలో తన పుట్టిన రోజు వేడుకలను గ్రాండ్‌గా జరుపుకున్నారు జీవీఎల్. పౌరసన్మానం పేరుతో విశాఖలో ముఖ్యులను సన్మానించారు. పార్టీ ముఖ్య నాయకులు చాలా మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. రాజ్యసభ సభ్యుడు సన్మానించిన వారిలో కూడా కాపు, బీసీ సంఘాల ప్రతినిధులే ఎక్కువగా ఉండటం ఆయన రాజకీయ వ్యూహాన్ని చెప్పకనే చెబుతోందంటున్నారు పరిశీలకులు.
వాస్తవానికి విశాఖ ఎంపీ సీటుపై బీజేపీలో చాలా పోటీ ఉంది. పొత్తులు కలిసి వచ్చిన ప్రతి సారీ ఇక్కడ కాషాయ జెండా ఎగిరింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు జీవీఎల్‌తో పాటు పురంధేశ్వరి పేరు గట్టిగానే వినపడుతోంది.వచ్చే ఎన్నికల్లో 2014 నాటి వాతావరణం కనిపిస్తుందని అంచనా వేస్తున్నాయి బీజేపీ వర్గాలు. అందుకే జీవీఎల్ ముందుగానే జాగ్రత్త పడుతూ ఆమెకు చెక్ పెట్టాలనుకుంటున్నారట. ఇద్దరి మధ్య ఇదివరకే గ్యాప్ ఉంది. ట్వీట్ ఫైట్ కూడా నడిచింది.రాష్ట్రంలో వైఎస్ఆర్, ఎన్ టి ఆర్ లే నాయకులా? మిగతా వాళ్ళు కాదా? అంటూ జీ వి ఎల్ చేసిన ట్వీట్ కు పురంధేశ్వరి అభ్యంతరం తెలపడం, వాళ్లిద్దరే సిసలైన నాయకులు అంటూ తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడం లాంటివి జరిగాయి. ఈ పరిస్థితుల్లో పురంధేశ్వరిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది బీజేపీ. గట్టి హామీ, దిశానిర్దేశంతోనే ఆమె ఏపీకి వస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అది విశాఖ ఎంపీ సీటా మరోటా అన్నది తేలాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో జీవీఎల్ పుట్టిన రోజు వేడుకలు ఆర్భాటంగా జరగడం హాట్ టాపిక్ అయింది. కోల్డ్ వార్‌లో చివరికి ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.