Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంతోనో, మాటలతోనో వార్తల్లో ఉండే నాయకుడు జగ్గారెడ్డి. ఎందుకో.. గత కొన్ని నెలలుగా మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారాయన. మాటలే కాదు.. ఆయన ఎవరికీ కనిపించడం కూడా లేదట. ఎందుకన్నది ఎవరికీ తెలియడం లేదట. అందుకే ఆ మౌనానికి అర్ధాలు, నానార్ధాలు, విపరీతార్ధాలు వెదికే పనిలో ఉన్నారట గాంధీభవన్‌లో కొందరు. చాలా రోజుల నుంచి మౌనముద్రలో ఉన్నారు టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అడపా దడపా నోరు తెరిచినా… నైరాశ్యపు మాటలు తప్ప మునుపటిలా ఉరుములు, మెరుపులు ఉండటం లేదు. రాహుల్ గాంధీ పాదయాత్రకు ముందు కూడా చాలా రోజులు ఇలాగే గాయబ్ అయ్యారు జగ్గారెడ్డి. దీంతో ఆయన ఏం చేస్తారు? ఏం చేయబోతున్నారన్న చర్చ జరిగింది.
రాహుల్ పాదయాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన జగ్గారెడ్డి ఆ తర్వాత కూడా కామ్‌గానే ఉన్నారు. అలా ఎందుకంటే… చేసే వాళ్ళని చేయనివ్వండి.. నేను మాట్లాడితే నష్టమంటున్నారట.. పైగా కోవర్టులంటున్నారని అసహనంగా ఉన్నట్టు తెలిసింది. పార్టీ కోసం ఎవ్వరూ మాట్లాడని రోజుల్లో కూడా… కేసీఆర్‌కి వ్యతిరేకంగా తాను కార్యక్రమాలు నిర్వహించానని, ఆ సేవల్ని గుర్తించకుండా సింపుల్‌గా కోవర్ట్ ముద్ర వేస్తుంటే ఏం చేయాలని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట జగ్గారెడ్డి. జరుగుతున్న తప్పుల్ని సరిదిద్దుకోవడం మానేసి.. పార్టీ మంచి కోసం మాట్లాడే వాళ్ళ మీద ముద్రలు వేసుకుంటూ పోతే నష్టం ఎవరికని అడుగుతున్న జగ్గారెడ్డికి…. ఇప్పుడు కొత్తగా అధిష్టానం కూడా తనను లైట్ తీసుకుంటోందా అన్న అనుమానం కలుగుతోందట.
తాను.. ఎందుకు యాక్టివ్‌గా లేనో తెలుసుకోవాలన్న విషయాన్ని మర్చిపోయారంటూ అసహనంతో రగిలిపోతున్నారట జగ్గారెడ్డి. పీఏసీ మీటింగ్‌లు, పార్టీ సభలు, సమావేశాల్లో హడావిడి చేసే లీడర్ ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారన్న పట్టింపే నాయకత్వానికి లేదా అన్న ప్రశ్నలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయట. ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే.. అందర్నీ కలుపుకోవాల్సింది పోయి.. జగ్గారెడ్డిని ఇలా వదిలేస్తారా అన్న చర్చ సైతం జరుగుతోందట. అంతకు ముందు ఒకటి రెండుసార్లు ఇన్చార్జ్ థాక్రేని కలిసి పార్టీని ఎన్నికలకు సిద్ధం చేసే అంశాలపై చర్చించారట జగ్గారెడ్డి . గ్రేటర్ హైదరాబాద్‌లో బలహీనంగా ఉన్నామని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్‌లను కూడా నియమించకపోవడం లాంటి అంశాలను చర్చించారట. కానీ.. ఆ తర్వాత తన సూచనలపై చర్చ జరగడం గానీ, వాటికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడంగానీ..లేకపోవడంతో తీవ్రంగా రగిలిపోతున్నారట జగ్గారెడ్డి. అది నియోజకవర్గ సమస్య అయినా.. పార్టీ సమస్య అయినా.. ఘాటుగా స్పందించే అలవాటున్న పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మౌనం దేనికి సంకేతమన్న చర్చ టి కాంగ్రెస్‌లో జరుగుతోంది. అందర్నీ కలిపి పని చేయించాలన్న కర్ణాటక ఫార్ములానే తెంలగాణలో కూడా అమలు చేయాలనుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి.