Off The Record: ప్రధాని మోడీ విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనని ఇటీవల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైందట. అభివృద్ధి, టెక్నాలజీ లాంటి అంశాల్లో మోడీతో కలిసి పని చేసేందుకు అభ్యంతరం లేదని చెప్పినా.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చే విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్న బాబు కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయట. అంటే.. బీజేపీతో టీడీపీ పొత్తు ఖాయమైపోయిందా..? అనే రీతిలో చర్చ జరుగుతోందట. పొత్తుకు ముందు చేసుకుంటున్న ఏర్పాట్లలో భాగంగానే ఈ తంతు నడుస్తోందని, క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుందని అనుకుంటున్నారట.
బీజేపీ విషయంలో అధినేత ఆలోచన ఓ విధంగా ఉంటే.. నాయకుల ఆలోచన మరో విధంగా ఉందా..? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవలే అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణ చేసిన కామెంట్స్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వీరిలో అచ్చెన్నాయుడు టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా ఉంటే.. పితాని పొలిట్ బ్యూరో సభ్యుడు. పొజిషన్స్ పరంగా ఇద్దరి వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. పితాని డైరెక్ట్‌గా బీజేపీని తప్పు పడితే.. అచ్చెన్న అదే స్థాయిలో కామెంట్లు చేసినా.. పరోక్షంగా మాట్లాడారు. బీజేపీతో సఖ్యతగా ఉండాలని చంద్రబాబు భావిస్తోంటే.. వీరిద్దరు ఎందుకు అలా మాట్లాడరన్నది పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అట. అంటే.. గతంలో ఒకే మాట.. ఒకే బాటగా ఉన్న పార్టీ.. ఇప్పుడు గాడి తప్పుతోందా..? లేక దీని వెనక మరే ఇతర కారణాలు ఉన్నాయా..? అనేది మెయిన్ పాయింట్‌గా మారిందట.
బీజేపీతో పొత్తు విషయంలో అధినేత అభిప్రాయం ఎలా ఉన్నా… కొందరు నేతలు మాత్రం ఆ పార్టీని వదిలేసి జనసేనతో కలిసి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారట. బీజేపీతో వెళ్తే ముస్లిం ఓటర్లు దూరమవుతారనే ఆందోళన సదురు నేతల్లో కన్పిస్తోందట. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని నాయకులు బీజేపీతో పొత్తు లేకుండా ఉంటేనే బాగుండునని కోరుకుంటున్నారట. కమలం పార్టీ అధినాయకత్వం కానీ.. రాష్ట్ర నాయకత్వం కానీ టీడీపీకి దూరంగా ఉండడానికి, వైసీపీకి అనుకూలంగా ఉండటానికే ప్రాధాన్యత ఇస్తున్నందున వాళ్ళ కోసం వెంపర్లాడటం ఎందుకన్నది మరికొందరి ప్రశ్న అట. ఇలా.. చంద్రబాబు ఓ రకంగా.. సీనియర్ లీడర్లు మరో రకంగా బీజేపీ విషయంలో స్పందిస్తుండడంతో కేడర్ కూడా గందరగోళానికి గురవుతోందట. ఇప్పటికే జనసేనతో పొత్తు విషయం క్లారిటీ రాక కిందా మీదా పడుతోంటే.. తమను మరింత గందరగోళంలోకి నెట్టేయడానికి ఇప్పుడు కొత్తగా బీజేపీ టాపిక్ కూడా యాడ్ అయిందనేది టీడీపీ కార్యకర్తల మనోగతంగా ఉందట. చూడాలి… ముందు ముందు పొత్తులు, పొలిటికల్ ఎత్తులు ఎలా ఉంటాయో.