Off The Record: ఏపీ బీజేపీలో నోటీసుల కలకలం రేగుతోంది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై ఇప్పుడు పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోందట. పొత్తులు, మోడీతో చర్చల సారాంశం వంటి అంశాలకు సంబంధించి విష్ణు సంబంధంలేని కామెంట్స్ చేశారని, అందుకుగాను.. పార్టీ సభ్యత్వం నుంచి ఎందుకు తొలగించకూడదంటూ షోకాజ్ నోటీసు ఇచ్చింది నాయకత్వం. గతంలో కొందరికి నోటీసులు ఇచ్చినా.. మరికొంత మందిని క్రమశిక్షణ చర్యల కింద సస్పెండ్ చేసినా జరగని చర్చ.. ఇప్పుడు విష్ణుకుమార్ రాజు విషయంలోనే జరుగుతోంది. ఎందుకంటే… ఆయన పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కాదు. సుదీర్ఘ కాలంగా కాషాయ దళంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ బీ-ఫామ్ మీదే గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అలాంటి నాయకుడికి నోటీస్ ఇవ్వడంపై కేడర్‌లో విస్తృత చర్చ జరుగుతోంది.
గతంలో పొత్తులపై ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన కొందరి నేతల విషయంలో చూసీ చూడనట్టు వదిలేసిన పార్టీ హైకమాండ్ ఇప్పుడు విష్ణుకుమార్ రాజు కామెంట్లను మాత్రం సీరియస్‌గా తీసుకుంది. మాజీ ఎమ్మెల్సీ మాధవ్.. జనసేన విషయంలో ఇదే తరహా కామెంట్లు చేశారు. అలాగే వైసీపీ-బీజేపీ ఒకే తాను ముక్కల్లా ఉన్నాయన్న బలమైన భావన ప్రజల్లో ఉందన్నారు. అప్పట్లో మాధవ్ అన్న ఈ మాటలు చర్చనీయాంశం అయ్యాయి. పైగా బీజేపీ-జనసేన పొత్తు కటీఫేనా అన్న ప్రచారం కూడా జరిగింది. అలాంటి సందర్భంలో కూడా మాధవ్‌ను పల్లెత్తు మాట అనలేదు నాయకత్వం. ఇదే సమయంలో ఇంకో ప్రశ్న కూడా వస్తోంది. పొత్తుల విషయంలో విష్ణు కుమార్ రాజు తరహాలోనే కామెంట్ చేసిన ఆదినారాయణ రెడ్డిని ఎందుకు వదిలేశారన్నదే ఆ ప్రశ్న. అయితే విష్ణును టార్గెట్ చేసుకునే విధంగా నోటీస్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరిన కొంత మంది టీడీపీ నేతలు తెలుగుదేశంతో కలిసి వెళ్తే బాగుంటుందనిన సలహాలు ఇస్తున్నారట. వారికి బీజేపీలోని కొందరు నేతలు తెలుగు కమలాలు అంటూ ఓ ముద్దు పేరు కూడా పెట్టుకున్నారట. ఇప్పుడు విష్ణుకుమార్ అన్న మాటలు ఆ తెలుగు కమలాల వాదనకు బలం చేకూర్చేవిగా ఉంటున్నాయంటూ బీజేపీలోని చంద్రబాబు వ్యతిరేకులు గుర్రుగా ఉన్నారు. వాళ్ళంతా సరైన టైమ్ కోసం వేచి చూశారని.. రీజన్ దొరగ్గానే షోకాజ్ నోటీసు ఇచ్చేశారనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. వాస్తవాలు మాట్లాడే వారిని వేధింపులకు గురి చేస్తే.. ఉన్న అతి కొద్ది మంది నేతలు కూడా జంప్ అయ్యే ప్రమాదం ఉందన్నది ఏపీ బీజేపీలోని ఇంకొందరి అభిప్రాయం. అసలు మాజీ ఎమ్మెల్యేని బయటకు పంపడానికే ఈ షోకాజ్ నోటీసులు ఇచ్చారనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.
కానీ ఈ వాదనలేవీ సరికాదంటోంది బీజేపీలోని మరో వర్గం. కొంత కాలంగా విష్ణు కుమార్ రాజు వ్యవహార శైలిపై పార్టీ అధినాయకత్వం చాలా ఓపిగ్గా ఉందని.. అయినా ఆయన పదే పదే అదుపు తప్పుతుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నది వారి వాదన. చాలా సందర్భాల్లో విష్ణుకుమార్ రాజు పార్టీని ఇరకాటంలోకి నెట్టేలా మాట్లాడారని, పెద్దలతో తగాదా పెట్టుకుని వెళ్లిపోయిన కన్నా లక్ష్మీనారాయణ లాంటి నేతలతో సన్నిహితంగా మెలిగారని.. పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కూడా కన్నా ఇంటికి వెళ్లడం.. అక్కడ మీడియాతో మాట్లాడ్డం కచ్చితంగా క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందని అంటున్నారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకే రాష్ట్ర నాయకత్వం ఈ నోటీసులు ఇచ్చిందని అంటున్నాయి ఆ వర్గాలు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. విష్ణుకుమార్ రాజుకు ఇచ్చిన
షోకాజ్ నోటీస్ మాత్రం లోటస్ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ క్రమంలో ఆయన మీద చర్యలు ఉంటాయా..? హెచ్చరించి వదిలేస్తారా..? లేక విష్ణుకుమార్ రాజే రివర్స్ అవుతారా..? అనేది ఆసక్తిగా మారింది.