Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
- మన్యం జిల్లా కలెక్టర్‌ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా?..
- ఆఫీసర్ ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తారోనని కంగారు పడుతున్నారా?..
- గిరిజనుల విషయంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శ్రద్ధ..
- రాష్ట్ర స్థాయి ప్రశంసలందుకున్న బడి పిల్లల ముస్తాబు ప్రోగ్రామ్..
- కలెక్టర్ డామినేట్ చేస్తున్నారని ప్రజాప్రతినిధుల్లో ఆందోళన?..
- గిరిజనులకు ప్రయోజనాలన్నీ మా ద్వారానే అందాలన్న వైఖరి..
- రాజకీయంగా తాము నష్టపోతామన్న భయం..
- కలెక్టర్ సమన్వయం చేసుకోవడంలేదని సీఎంకు ఫిర్యాదు చేశారా?..
- ప్రపంచ రికార్డ్ లక్ష్యంగా కార్యక్రమానికి కలెక్టర్ ప్లాన్..
- ఎమ్మెల్యేల అడ్డంకులతోనే ప్రోగ్రామ్ ఆగిపోయిందా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: సాధారణంగా ఎక్కడైనా… రాజకీయ పార్టీల మధ్య క్రెడిట్ పాలిటిక్స్ నడుస్తుంటాయి. మంచి అయితే మాది, చెడు అయితే అవతలోళ్ళదంటూ నాయకులు నాలుకలు మడతేయడం కూడా కామన్. కానీ… ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాలో వాతావరణం దీనికి కాస్త భిన్నంగా, ఇంకా చెప్పాలంటే బాగా తేడాగా ఉందట. ఇక్కడ ఒక ఆఫీసర్‌కు, నాయకులకు మధ్య క్రెడిట్ గేమ్ నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే… క్రెడిట్ కోసం ఉన్నతాధికారి ఎక్కడా పాకులాడటం లేదంటున్నారు. తన అధికార పరిధిని ఉపయోగించి జనానికి ఎంత మంచి చేయగలరో అంతా చేస్తున్నారట మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. అదే సమయంలో ఆయన్ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. నాయకులు, అధికారులు జోడెద్దుల్లా కలిసి సాగితేనే పరిపాలనా చక్రాలు సవ్యంగా నడిచేది. కానీ… ఇక్కడ మాత్రం కలెక్టర్ దూకుడు చూసి… ఆయనకు ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందోనన్న కంగారులో ప్రజాప్రతినిధులు ఆయన ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పని తీరుపై ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
గిరిజన ప్రాంతాల్లో ప్రత్యక్ష పర్యటనలు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందన, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, ప్రజలకు నేరుగా చేరువ కావడం.. ఇలా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. గిరిజనుల జీవన ప్రమాణాల మెరుగు కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారాయన. సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు చేరవేయడం విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో వినూత్న చర్యల్లాంటి వాటితో కలెక్టర్‌కు ప్రజల్లో మంచి గుర్తింపు వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ముస్తాబు కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో పాటు సీఎం దృష్టిని కూడా ఆకర్షించింది. ఇదే ఇప్పుడు కొంతమంది ప్రజా ప్రతినిధులకు అసహనంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. జిల్లాలో జరిగే ప్రతి కార్యక్రమం తమ ఆధ్వర్యంలోనే సాగాలన్న భావనతో ఉన్న నేతలకు కలెక్టర్ నేరుగా ప్రజల్లోకి వెళ్లడం మింగుడుపడటం లేదట. ప్రజలకు అందే ప్రయోజనాలన్నీ తమ ద్వారానే జరగాలని ఆశించే నాయకత్వానికి అధికారులు స్వతంత్రంగా వ్యవహరించడం ఇబ్బందిగా మారిందని మాట్లాడుకుంటున్నారు. గత రెండేళ్లుగా అభివృద్ధి కార్యక్రమాల్లో కలెక్టర్‌కే ఎక్కువ క్రెడిట్ వెళ్తోందన్న భావన స్థానిక నేతల్లో పెరిగిందట. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో రాజకీయంగా తాము నష్టపోవాల్సి వస్తుందన్న ఆందోళన కూడా వారిలో కనిపిస్తోందని అంటున్నారు. దీంతో కలెక్టర్ వ్యవహార శైలిని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలన్న వ్యూహం రచించారట.
Also Read
ఇటీవల విశాఖ పర్యటనలో సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యేలు కలెక్టర్ తమతో సమన్వయం చేసుకోవడం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదే ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు పరస్పరం కలిసిరాని నేతలంతా ఒక్కసారిగా ఒకే వేదికపైకి రావడానికి ఇదే కారణమా అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇక అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచ రికార్డు లక్ష్యంగా విద్యార్థులతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కలెక్టర్ ప్రతిపాదనను కూడా రాజకీయ కారణాలతో వాయిదా వేయించారన్న ప్రచారం జిల్లాలో జోరుగా నడుస్తోంది. ఆ ప్రోగ్రామ్ విజయవంతమైతే కలెక్టర్‌కు మరింత పేరు వస్తుందన్న ఆలోచనతోనే అడ్డంకులు సృష్టించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మన్యం జిల్లాలో అభివృద్ధి కంటే క్రెడిట్ చుట్టూనే గేమ్ నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ప్రజల్లో మంచి పేరు సంపాదిస్తున్న అధికారిని కాదంటే… వ్యతిరేకత వచ్చే అవకాశం ఒకవైపు, ప్రజాప్రతినిధులను పక్కన పెడితే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయోనన్న ఆందోళన మరోవైపు… ఇలా కరవమంటే కప్పకి కోపం విడవమంటే పాముకి కోపం అన్నట్లుగా మారిందన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు అందరి చూపు పార్టీ అధిష్టానం వైపే ఉంది. అధికారుల ప్రజాప్రతినిధుల మధ్య పెరుగుతున్న ఈ దూరాన్ని ఎలా తగ్గిస్తారు మన్యం రాజకీయాల్లో మొదలైన ఈ క్రెడిట్ వార్‌కు ఎలా ఫుల్ స్టాప్ పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!
-
Finn Allen Century: ఒక్క సెంచరీ, ఎన్నో అరుదైన రికార్డులు.. ఫెంటాస్టిక్ ఫిన్ అలెన్!
-
Kiran Abbavaram: ఫ్లాప్ ఇచ్చినా తగ్గేదేలే.. రిస్క్ అని తెలిసినా డైరెక్షన్ వైపు అబ్బవరం..
-
Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు