Off The Record: అది ఆంధ్రప్రదేశ్ అయినా…. ఉత్తరప్రదేశ్ అయినా… బీజేపీకి ఉన్న ముద్ర మాత్రం అగ్రవర్ణాల పార్టీ అని. అందులోనూ భేషజాలు లేకుండా చెప్పుకోవాలంటే… బ్రాహ్మణుల పార్టీ, ఉత్తరాది పార్టీ అని కూడా అంటారు. ఇప్పుడు ఏపీ బీజేపీ ఈ ముద్రనే చెరిపేసుకునే దిశగా అడుగులేస్తోందట. అగ్రవర్ణ ముద్రను పోగొట్టి… బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్య పార్టీగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే సరికొత్త కుల రాజకీయ సమీకరణలకు తెర లేస్తున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుని కూటమిలో సీట్ల బేరాన్ని గట్టిగా చేసే ప్లాన్ ఉందట కమలం పార్టీకి. అది జరగాలంటే… ముందు ఓట్ బ్యాంక్‌ని పెంచుకోవాలన్న దిశగా అడుగులేస్తోందట నాయకత్వం. ఇప్పటి వరకు తమకు దూరంగా ఉన్న వర్గాలను దరి చేర్చుకుని బలపడాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్ బ్యాంక్‌ని టార్గెట్ చేస్తున్నట్టు సమాచారం.
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్… జయంతి వేడుకల్ని పార్టీ తరపున నిర్వహించాలని నిర్ణయించడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కుల ప్రాతిపదికన ఓట్ బ్యాంక్ పెంచుకుంటేనే పార్టీ నిలబడుతుందన్న క్లారిటీకి వచ్చిన రాష్ట్ర ముఖ్యులు ఆ దిశగా ఇప్పటివరకు ఇచ్చిన పదవుల గురించి ప్రచారం చేస్తూ ఆయా వర్గాలను ప్రభావితం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రధాని మోడీ బీసీయేనని, అలాగే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖమంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే కూడా బీసీలేనని, వెనుకబడిన వర్గాలకు తమ పార్టీ ఆ స్థాయి గుర్తింపు ఇస్తుందని ప్రచారం మొదలుపెట్టాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే…. అరకు, పాడేరు లాంటి చోట్ల పార్టీకి 26 మంది ఎంపీటీసీలు ఉన్నసంగతిని గుర్తు చేస్తున్నారు ఏపీ కమలనాథులు.
పొత్తు ధర్మంలో భాగంగా తమ పార్టీకి వచ్చిన అవకాశాల్లో సింహభాగం ఎస్సీ, ఎస్టీలకు ఛాన్స్ ఇచ్చినట్టు చెబుతున్నారు పార్టీ లీడర్స్. ఇలా…. ఓట్ బ్యాంక్ పెరగాలంటే… కులాల వారీగా క్షేత్ర స్థాయిలో బలం పెంచుకోవడం ఒక్కటే మార్గం అని భావిస్తోందట ఏపీ బీజేపీ నాయకత్వం. సనాతన ధర్మం, హిందూ భావజాలం పేరుతో ఇతర కులాలు తమకు దూరం కాకుండా జాగ్రత్త పడాలన్నదే మెయిన్ టార్గెట్ అని, అందులో భాగంగా ప్రధానంగా ఎస్సీలకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. బీజేపీ జపిస్తున్న కొత్త కుల మంత్రం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.