కావాలంటే రాష్ట్రాన్నే రాసిస్తా… అన్నది ఓ హిట్ మూవీలో మినిస్టర్ కేరక్టర్ పాపులర్ డైలాగ్. ఆ సినిమాని ఎక్కువ సార్లు చూశారో… లేక డైలాగ్‌ని బాగా… ఒంటబట్టించుకున్నారోగానీ… ఆ శాసనసభ్యురాలు నిజంగానే నియోజకవర్గాన్ని సోదరులకు రాసిచ్చేశారట. తాను మాత్రం రిబ్బన్లు కత్తింరించుకుంటూ… బ్రదర్స్ ఇద్దర్నీ నియోజకవర్గం మీదికి వదిలేశారట. జనరల్‌గా దోచుకో, పంచుకో అంటుంటారు. వాళ్ళు మాత్రం పంచుకో దోచుకో అన్న ఫార్ములాని ఫాలో అవుతున్నార. ఇంతకీ ఎవరా నామమాత్రపు ఎమ్మెల్యే? ఏంటా బ్రదర్స్ దోపిడీ కహానీ? తమిళనాడు బోర్డర్‌లో ఉంటుంది నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం. ఈ పరిధిలోని తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట మండలాల్లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి, కొత్తగా వస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు కూడా జోరుగా జరుగుతుంటాయి ఇక్కడ. పేరుకు సరిహద్దు సెగ్మెంట్ అయినా…. ఈ కారణాలన్నిటితో దీనికి ప్రాముఖ్యత ఎక్కువ. అందుకే ఈ టిక్కెట్ కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. అందుకు తగ్గట్టే… 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సూళ్ళూరుపేట అసెంబ్లీ టిక్కెట్ కోసం చాలామంది టీడీపీ నాయకులు ప్రయత్నించారు. అయినాసరే… వాళ్ళందర్నీ కాదని మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రమణ్యం కుమార్తె విజయశ్రీ వైపు మొగ్గింది పార్టీ అధిష్టానం. తిరుపతిలో వైద్యురాలిగా ఉన్న విజయశ్రీకి రాజకీయాలు కొత్త కావడంతో… ఆమె విజయంలో తండ్రి, సోదరులు కీలక పాత్ర పోషించారు. అంతా తామై నడిపించారు ముగ్గురూ. ఇక విజయశ్రీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక కొద్ది రోజులపాటు పాలనా వ్యవహారాలను పర్యవేక్షించి గైడ్ చేశారట తండ్రి, మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం. ఫర్లేదు, అంతవరకు బాగానే ఉంది… రాజకీయాలకు కొత్త అయిన కూతురిని ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న తండ్రి గైడ్ చేయడంలో ఇబ్బందేం లేదనుకున్నారు అంతా. కానీ… అతర్వాతే తేడా కొట్టిందట. కొన్నాళ్ళ తర్వాత సుబ్రహ్మణ్యం ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో… ఆయన కుమారులు రాజేష్, రంజిత్ ఇద్దరూ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో రచ్చ రంబోలా అవడం మొదలైందట. ఎమ్మెల్యే సోదరి పేరు చెప్పి వీళ్ళిద్దరూ దందాలకు తెరలేపారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇసుక దందా గురించి అయితే చెప్పే పనే లేదంటున్నారు స్థానికంగా. సూళ్ళూరుపేట నియోజకవర్గం చెన్నైకి దగ్గరగా ఉంటుంది. అక్కడి నిర్మాణరంగం నెలవల బ్రదర్స్‌కి ఆదాయమార్గం అయిపోయిందట. భవన నిర్మాణాలకు అవసరమయ్యే నాణ్యమైన ఇసుక చెన్నై దరిదాపుల్లో అందుబాటులో లేకపోవడంతో… ఇక్కడి నుంచి రోజూ వందల లారీల్లో ఇసుకను ఇక్కడికి తరలిస్తున్నారట. నాయుడుపేట మండలంలోని స్వర్ణముఖి, సూళ్లూరుపేట ప్రాంతంలోని కాళంగి నదుల్లో నాణ్యమైన ఇసుక పుష్కలంగా ఉంది. దీంతో… నిత్యం వందల లారీల్లో చెన్నైకి తరలిస్తూ… కోట్లలో వ్యాపారం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే విజయశ్రీ ఒక సోదరుడు పూర్తిగా అదే పనిలో ఉన్నారన్నది లోకల్ టాక్. ఇక మరో సోదరుడు నియోజకవర్గంలో షాడో శాసనసభ్యుడిగా మారారట. పాలనా వ్యవహారాలన్నిటిలో ఆయన జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల బదిలీలు, గనులు, గ్రావెల్ వ్యవహారాలు, పరిశ్రమల నుంచి వసూళ్ళలాంటి వ్యవహారాలన్నిటినీ షాడో బ్రదరే చూసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది.
నియోజకవర్గంలో ఉన్న వివిధ పరిశ్రమలకు అవసరమైన మెటీరియల్ సరఫరా కాంట్రాక్ట్‌లన్నీ ఎమ్మెల్యే మనుషులకు ఇవ్వాల్సిందేనట. ఎమ్మెల్యే సోదరుడు సిఫారసు చేసిన వాళ్ళనే వెండర్స్‌గా పెట్టుకోవాలన్న అప్రకటిత రూల్ సూళ్ళూరు పేట నియోజకవర్గంలోని కొన్ని పెద్ద పరిశ్రమల్లో అమలవుతోందని చెప్పుకుంటున్నారు స్థానికంగా. ఎంతైనా… అది డబ్బు వ్యవహారం కదా… అందుకే ఇటీవల సోదరుల మధ్య కొన్ని విషయాల్లో వివాదాలు వచ్చాయట. దాంతో ఇద్దరూ ఓ అండర్‌స్టాండింగ్‌కి వచ్చి మొత్తం ఆరు మండలాల్లో చెరో మూడింటిని పంచుకున్నట్టు టీడీపీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఆయా మండలాల్లో తమ అనుమతులు లేకుండా ఎలాంటి ముఖ్యమైన పనులు చేయవద్దని తహశీల్దార్లు, ఎంపీడీవోలకు హుకుం జారీ చేసినట్టు సమాచారం. ఏ పని కావాలన్నా ముందు ఎమ్మెల్యేని కాకుండా ఆమె సోదరుల్ని కలవాల్సిందేనట. ఆ తర్వాతే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళాలని, అప్పుడు మాత్రమే పనులు అవుతాయని గుసగుసలాడుకుంటున్నారు స్థానికంగా. అలా… అలా సోదరుల హవా పెరిగిపోవడంతో… ఇప్పుడు పార్టీ శ్రేణులు కూడా ఆ… ఎమ్మెల్యేదేముందిలే. ఆమె ఓ పక్కన ఉంటారన్న స్థాయికి వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మండలాల్ని పంచేసుకున్నాక ఎవరి ఇసుక వారిది, ఎవరి గ్రావెల్ వారిది అన్నట్టుగా యమ జోరుగా అక్రమ రవాణా చేసి కోట్లు గడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు నియోజకవర్గంలో. ఇంతా జరుగుతుంటే… ఎమ్మెల్యే ఏం చేస్తున్నారయ్యా… అంటే… ప్రభుత్వ కార్యక్రమాల్లో రిబ్బన్లు కట్ చేసుకుంటున్నారన్నది కేడర్ వాయిస్. నెలవల విజయశ్రీ కేవలం అలాంటి అధికార కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాగా…. నియోజకవర్గం మొత్తాన్ని బ్రదర్స్ గ్రిప్‌లోకి తీసుకున్నారట. పాలన వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు జోక్యం ఉండకూడదని ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు… మొత్తుకుంటుంటే… ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే సోదరులే సర్వస్వం అన్నట్టుగా మారిపోయిందట వ్యవహారం. విజయశ్రీ జస్ట్… ఎమ్మెల్యేగా మిగిలిపోతారా? లేక పాలన మీద గ్రిప్ పెంచుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.