ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో పెట్టుబడులు తీసుకువస్తున్నామని చెప్పారని, అదానీ గ్రూపుతో 12వేల కోట్ల ఒప్పందాలు కుదిరాయని ప్రకటించారన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు అదానీ, అంబానీకీ మోడీ దేశ సంపదను దోచి పెడుతున్నారని విమర్శించారని, పని గట్టుకొని ప్రధానిపై విమర్శలు చేశారని ఆయన అన్నారు. కేటీఆర్ తెలంగాణ ప్రతినిధిగా ఐదు సార్లు దావోస్ పర్యటనకు వెళ్లారని, గత ప్రభుత్వం 21 వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని గొప్పగా చెప్పిందన్నారు. తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ పెట్టారో అర్థం కావటం లేదని, వరల్డ్ ఏకనామిక్ ఫోరంకు పోయింది పెట్టుబడులు తేవడానికా.. పెట్టడానికా? అని ఆయన ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ పదే పదే మోదీని విమర్శించారని, విదేశి పర్యటనలకు వెళ్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకులు పెట్టుబడులు పెట్టడానికీ కాదని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని రాజకీయం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కుహనా లౌకిక వాదులుగా వ్యవహరిస్తూ విమర్శించడం తగదని ఆయన హితవు పలికారు. ఈ మూడు పార్టీలు భారత జాతికి క్షమాపణ చెప్పాలని, ఈ నెల 22న కేంద్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కూడా ఈ నెల 22న అధికారికంగా సెలవు ప్రకటించాలని ఆయన వ్యాఖ్యానించారు.