*8 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం.
ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు ఎంతో ఆసక్తికరంగా మారాయి.చంద్రబాబు అరెస్టు జరిగిన నేపథ్యం లో టీడీపీ నిరసన కొనసాగిస్తుంది. అలాగే ఏపీ అసెంబ్లీలో కూడా టీడిపి ఎమ్మెల్యే లు తీవ్రస్థాయి లో నిరసన తెలుపుతున్నారు . టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.టీడీపీ ఎమ్మెల్యే ల తీరు సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే ఏపి శాసన మండలిలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ పోస్టులకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖాళీగా ఉన్న ఎనిమిది వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము కట్టుబడి ఉన్నామనీ అలాగే మెరుగైన విద్యాను రాష్ట్రం లో అందిస్తున్నామని ఆయన చెప్పారు. చంద్రబాబు అరెస్టు పై టీడీపీ సభ్యులు ప్రవర్తన పై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు అంతరాయం కలిగించడం సబబు కాదని చంద్రబాబు అరెస్టుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.చంద్రబాడు అరెస్టు తో పాటు ఏ అంశమైన చర్చకు సిద్ధమనీ, దాని కోసం ఎంత సమయమైన తాము ఇస్తామని తెలిపారు. కావాలనే టీడీపీ సభ్యులు మమ్మల్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ పై దౌర్జ్యన్యానికి దిగడం సరికాదని ఆయన అన్నారు.ఇదిలా ఉంటే మంత్రి బొత్స టీచర్ పోస్టుల ప్రకటనపై ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి గారు ఆంధ్రప్రదేశ్ లో 40 వేలకు పైగా టీచర్ ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయని చెప్పారని అన్నారు. అయితే, మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచర్ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తామని చెబుతున్నారనీ, ఇది సరికాదని ఆయన విమర్శించారు. త్వరగా ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
*గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు గరుడోత్సవం నేత్ర పర్వంగా మొదలైంది. వైభవంగా శ్రీవారికి గరుడవాహన సేవ మొదలుకాగా.. గరుడ వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. గోవిందనామాలతో తిరుమలగిరులు మార్మోగుతున్నాయి. నిత్యం మూలమూర్తి ఆభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో స్వామివారికి అలంకరించారు. ఏడాది మొత్తంలో గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్న విషయం విదితమే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు సమాచారం. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డులో భక్త సంద్రం వేచి ఉన్నట్లు తెలుస్తోంది. జగన్నాటక సూత్రదారియై తిరువీధుల్లో ఊరేగే మలయప్ప స్వామి భక్తులందరికీ దివ్యమంగళ రూపం దర్శనమిచ్చారు. జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తకోటి నమ్మకం. అందుకే గరుడ వాహనంపై విహరించే స్వామి వారిని దర్శించుకునేందుకు.. లక్షలాది మంది ఏడుకొండలు ఎక్కి శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు. ఇవాళ్టి గరుడ సేవకు కొన్ని లక్షల మంది విచ్చేసినట్లుగా తెలుస్తోంది.
*చంద్రబాబును ప్రశ్నించేందుకు రేపు రాజమండ్రికి సీఐడీ బృందం
స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వాలంటూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రెండు రోజుల పాటు చంద్రబాబును విచారించనున్నారు. రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించనున్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన కస్టడీ మేరకు సీఐడీ విచారణ జరగనుంది. సీఐడీ కస్టడీ నేపథ్యంలో ఏసీబీ కోర్టు నిబంధనలు జారీ చేసింది. విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు విచారణకు అనుమతించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ జరుపుతున్న వీడియో, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబుతో టీడీపీ లీగల్ సెల్ న్యాయవాది లక్ష్మీనారాయణ ములాఖత్ అయ్యారు. పలు పిటిషన్లపై చంద్రబాబు సంతకాలను స్వీకరించారు. కోర్టు తీర్పులను చంద్రబాబుకు ఆయన వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై చంద్రబాబుతో చర్చించి సలహాలు తీసుకున్నారు. గత వారంలో కూడా చంద్రబాబుతో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి లక్ష్మీనారాయణ చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసుల విషయమై చంద్రబాబుతో చర్చించారు. లక్ష్మీనారాయణ భేటీ అయిన రోజుల తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా కూడ బాబుతో సమావేశమైన విషయం తెలిసిందే.
*చంద్రబాబు లాయర్ మరో ఆసక్తికర ట్వీట్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు. ఏపీ హైకోర్టు, విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చిన నేపథ్యంలో ఆయన తరఫు వాదించిన న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్ (X).. ఆసక్తికరంగా మారింది. “ప్రతి రాత్రి తర్వాత తెల్లవారుతుంది. ప్రతి ఉదయం మన జీవితాల్లో వెలుగునిస్తుంది” అని సిద్ధార్థ లూథ్రా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతంలో ఆయన.. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది” అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఈరోజు ఇదే మా నినాదం’ అని ఆనాడు ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు కూడా రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.ఏసీబీ కోర్టులోనూ చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగిలింది. చంద్రబాబును 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం చంద్రబాబును 2 రోజుల పాటు విచారించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ చెప్పింది. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటలలోపు విచారణ పూర్తి చేయాలని న్యాయమూర్తి సీఐడీని ఆదేశించారు. ప్రతి గంటకు మధ్య ఐదు నిమిషాల విరామం ఇవ్వాలన్నారు. భోజన విరామం గంటసేపు ఉండాలని ఆదేశించారు. విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామని జడ్జి పేర్కొన్నారు. విచారణ జరిపే సీఐడీ అధికారుల పేర్లను ఇవ్వాలని న్యాయమూర్తి ఏపీ సీఐడీని ఆదేశించారు. చంద్రబాబు విచారణ వీడియోలు బయటకు రాకుండా చూడాలని న్యాయమూర్తి కోరారు. విచారణ సందర్భంలో చంద్రబాబు తరఫు న్యాయవాదిని అనుమతించాలన్నారు. చంద్రబాబు కనిపించే విధంగా న్యాయవాది పది మీటర్ల దూరంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది. సోమవారం వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది.
*తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఫిక్స్..!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు ( శుక్రవారం ) జరిగిన తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసింది. అభ్యర్ధుల ఎంపికపై నిన్న , ఇవాళ సుదీర్ఘంగా ఈ కమిటీ చర్చించింది. అభ్యర్ధుల జాబితాపై కసరత్తు పూర్తైనట్లు టాక్. అయితే టికెట్ కేటాయింపులపై వార్ రూంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్ల తెలుస్తుంది. 60 శాతానికి పైగా ఏకాభిప్రాయంతో అభ్యర్ధులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరోసారి ఈ కమిటీ సమావేశం కానుంది. పూర్తి జాబితాను కాంగ్రెస్ పార్టీకి , కేంద్ర ఎన్నికల కమిటీకి స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. నిన్న ( గురువారం ) సాయంత్రం మురళీధరన్ అధ్యక్షతన సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకున్న వివాదరహిత నేతల జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. పోటీ తీవ్రంగా ఉన్న చోట్ల అసంతృప్తులు, రెబల్స్ తయారు కాకుండా కాంగ్రెస్ అధిష్టానం నజర్ పెట్టింది. వీలైనంత త్వరగా అభ్యర్ధుల జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ స్పీ్డ్ గా అడుగులు వేస్తోంది. అయితే, వచ్చే వారం మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని 63 నియోజక వర్గాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ ఐదు గంటల పాటు స్క్రీనింగ్ కమిటీ సమాలోచనలు చేశారు.
*ల్యాండర్, రోవర్ నుండి అందని సిగ్నల్.. ఇస్రో తాజా అప్‌డేట్
చంద్రయాన్ 3పై ఇస్రో ఓ అప్ డేట్ ఇచ్చింది. మిషన్‌లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను స్లీప్ మోడ్ నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ల్యాండర్, రోవర్ నుండి సిగ్నల్ అందలేదని తెలిపింది. ప్రస్తుతం నిద్రాణ స్థితిలో వున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను మేల్కోలిపే ప్రణాళికలను ఇస్రో రేపటికి వాయిదా వేసింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కమ్యూనికేషన్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తద్వారా మేల్కొనే స్థితిని నిర్ధారించవచ్చని ఇస్రో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతానికి వాటి నుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదని పేర్కొంది. శుక్రవారం సాయంత్రంలోగా ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌లను మళ్లీ యాక్టివేట్ చేయాలనేది తమ ప్లాన్, కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ దేశాయ్ తెలిపారు. దీంతో మళ్లీ రేపు ప్రయత్నిస్తామని చెప్పారు. ల్యాండర్ మరియు రోవర్ 16 రోజుల పాటు స్లీప్ మోడ్‌లో ఉన్నాయని.. శుక్రవారం రెండూ యాక్టివేట్ అవుతాయని ఇస్రో అంతకుముందు తెలిపిన విషయం తెలిసిందే. చంద్రుడిపై సూర్యాస్తమయం అయిన తర్వాత ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయి. దక్షిణ ధృవం వద్ద మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను రోవర్, ల్యాండర్ తట్టుకుంటాయా.. మళ్లీ తిరిగి పనిచేస్తాయా అని ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ఈ రెండింటిని అనుకున్న ప్రకారం నిద్రలేపితే మాత్రం భారత్ మరో చరిత్ర సృష్టించినట్లే. కాగా.. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడిపై దిగింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
*ఎన్డీయేలో చేరిన జేడీఎస్.. స్వాగతిస్తున్నామన్న జేపీ నడ్డా
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరింది. శుక్రవారం జేడీఎస్ నేత కుమారస్వామి హోంమంత్రి అమిత్ షాను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కర్ణాటకలో సీట్ల పంపకంపై ముగ్గురు నేతల మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సమావేశం అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో జేడీఎస్ చేరిందని తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. “హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు హెచ్‌డి కుమారస్వామిని కలిశారు. ఎన్డీయేలో చేరాలని జేడీఎస్ నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్డీయేలోకి కుమారస్వామిని మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా అనే ప్రధాని మోడీ విజన్ ను ఈ చేరిక మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. మరోవైపు ఎన్డీఏతో పొత్తు కుదిరిందని.. సీట్ల పంపకంపై చర్చిస్తామని హెచ్‌డి కుమారస్వామి చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 సీట్లు గెలుచుకుంది. దీంతో బీజేపీ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీ 66 సీట్లు, జేడీఎస్ 19 సీట్లు గెలుచుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ పొత్తు కీలకంగా పరిగణించబడుతుంది. రాష్ట్రంలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలు ఉండగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 25 సీట్లు గెలుచుకోగా.. దానికి మద్దతు ఇచ్చిన స్వతంత్ర పార్టీ నుంచి ఒక సీటు గెలుచుకున్నారు. కాగా.. కాంగ్రెస్, జేడీఎస్ ఒక్కో సీటు గెలుచుకుంది.
*ప్రపంచ కప్ ప్రైజ్మనీ ప్రకటన.. విన్నర్, రన్నర్కు ఎంతో తెలుసా..!
వన్డే వరల్డ్ కప్ వచ్చే నెలలో స్వదేశంలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే అందుకోసం ఐసీసీ ప్రపంచకప్ ప్రైజ్ మనీని ప్రకటించింది. ప్రపంచకప్ గెలిచిన జట్టుకు 4 మిలియన్ US డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. రన్నరప్ జట్టుకు 2 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వనుంది. ఇండియా కరెన్సీలో ప్రపంచ కప్ ఛాంపియన్ జట్టుకు సుమారు రూ. 33 కోట్ల 17 లక్షలు రానున్నాయి. రన్నర్ కు దాదాపు రూ.16 కోట్ల 58 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది. అంతేకాకుండా.. ప్రపంచ కప్‌లో గ్రూప్ మ్యాచ్ గెలిస్తే కూడా 40 వేల డాలర్లు ఇవ్వనుంది ఐసీసీ. గ్రూప్ దశ తర్వాత ఎలిమినేట్ అయిన జట్టుకు 1 లక్ష డాలర్లు అందనుంది. ప్రపంచ కప్ 2023లో సెమీ ఫైనల్‌కు చేరిన జట్టుకు 8 లక్షల డాలర్లు ఇవ్వనుంది. ఇలా దాదాపు అన్ని జట్లపైనా కాసుల వర్షం కురువనుంది. 2023 ప్రపంచకప్‌లో భారత్‌తో సహా మొత్తం 10 జట్లు ఆడనున్నాయి. ఈ టోర్నీ తొలి మ్యాచ్ అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 8న చెన్నైలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత అక్టోబర్ 11న టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అక్టోబర్ 14న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
*అండర్-19 ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకటన
ICC అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్ ప్రచారాన్ని ప్రారంభించనుంది. జనవరి 14న కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీని కొలంబో మినహా 5 వేదికల్లో నిర్వహించనున్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 4న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. అండర్-19 ప్రపంచకప్ ఇది 15వ ఎడిషన్. ఈ టోర్నీలో మొత్తం 41 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో జింబాబ్వే.. ఆతిథ్య శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్ జనవరి 13న జరగనుంది. ఇంతకుముందు 2006లో శ్రీలంకలో అండర్-19 ప్రపంచకప్ నిర్వహించారు. అయితే దాదాపు 17 ఏళ్ల తర్వాత మరోసారి శ్రీలంక గడ్డపై అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు.