*తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది.. కారణం కాళేశ్వరం.
ఆనాడు గోదావరి జలాల కోసం పోరాటాలు చేసిన గడ్డ తుంగతుర్తి అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తుంగతుర్తి సస్యశ్యామలంగా మారింది… కారణం కాళేశ్వరమని సీఎం వెల్లడించారు. దేవాదుల ప్రాజెక్టు నీటిని కూడా త్వరలోనే అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. బునాదిగాని కాలువ వెడల్పు చేసి త్వరలో పూర్తి చేవి సాగు నీరు అందిస్తామని చెప్పారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సమర శంఖారావం సభలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకొని.. అధికారంలోకి వచ్చి మోసం చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ తెలంగాణ ఊరికే ఇవ్వలేదని.. అనేక మంది బలిదానాలు చేస్తే తెలంగాణ ఇచ్చారని కేసీఆర్ అన్నారు. యూపీలో అన్నానికి గతి లేదు.. అక్కడి నుంచి తెలంగాణకు బతకడానికి వస్తున్నారు.. కానీ ఆ ముఖ్యమంత్రి మనలను విమర్శిస్తున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్. మనం 24గంటల విద్యుత్ ఇస్తుంటే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తమ రాష్ట్రంలో 5 గంటలు ఇస్తున్నాం అని గొప్పలు చెప్తుండని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమని జేఏసీ అంటే.. కాంగ్రెస్, బీజేపీ, మరికొన్ని పార్టీలు కనీసం ముందుకు రాలేదన్నారు. దళితుల అభివృద్ధి కోసమే దళిత బంధు తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..” తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వలసలు, ఆత్మహత్యలు, హత్యలు నిత్యకృత్యంగా ఉండేవి. కులవృత్తులకు జీవం పోసాము. తుంగతుర్తి నుండి కిశోర్‌ను లక్ష మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గం మొత్తం దళితబంధు అమలు చేస్తాం. అధికారం లేక కాంగ్రెస్ పార్టీ వేచి చూస్తుంది. ధరణి రైతులకు శ్రీరామ రక్ష. ధరణి లేకపోతే దోపిడీ రాజ్యం వస్తుంది. రైతు బంధు వద్దన్న కాంగ్రెస్‌ను ఓడించాలి. 3 గంటల విద్యుత్ చాలు అంటున్న పీసీసీ అధ్యక్షుడికి బుద్ధి చెప్పాలి. ఉద్యమకారులను కేసుల పాలు చేసిన ఘనత కాంగ్రెస్‌దే.” అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
*డీకే శివకుమార్‌కు మంత్రి హరీశ్ థ్యాంక్స్.. డీకే నిజాలే చెప్పారు!
నర్సాపూర్ గెలుపు బాధ్యత సీఎం కేసీఆర్ నాపైనే వేశారని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ అవకాశం నర్సాపూర్‌కి రావడం అదృష్టమన్నారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. నర్సాపూర్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం.. చావు నోట్లో తల పెట్టి సీఎం కేసీఆర్ తెలంగాణ తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ వస్తేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సునీతా లక్ష్మారెడ్డిని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యే మదన్ రెడ్డిదేనని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. మదన్ రెడ్డిని ఎంపీ చేసే బాధ్యత తనదని మంత్రి చెప్పారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కర్ణాటకలో మూడు గంటల కరెంట్ ఇస్తున్నామని మేము చెప్పామని… కర్ణాటకలో 5 గంటలే కరెంట్ ఇస్తున్నామని నిన్న డీకే శివకుమార్ నిజాలు చెప్పారన్నారు మంత్రి హరీశ్. కానీ 5 గంటలు ఇవ్వట్లేదు 3 గంటలే ఇస్తుందని మంత్రి చెప్పారు. డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీ సమాధి కట్టుకున్నట్లు అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీకే శివకుమార్‌కు థ్యాంక్స్ చెబుతున్నామన్నారు. నువ్వే 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెప్పావ్.. ఇంకా బస్సెందుకు కర్ణాటక రావడానికి అంటూ మంత్రి హరీశ్ ఎద్దేవా చేశారు. డీకేనే నిజాలు చెప్పారు కదా.. కర్ణాటక మోడల్ ఫెయిల్యూర్ మోడల్ అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. “రైతు బంధు డబ్బులు ఇవ్వొద్దని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు లేదు. రేవంత్ మూడు గంటల కరెంట్ చాలు అంటాడు. డీకే శివకుమార్ ఐదు గంటల కరెంట్ ఇస్తున్నామని అంటాడు. రైతులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. తస్మాత్ జాగ్రత్త.. మోసపోతే గోస పడుతాం. మెడమీద తలకాయ ఉన్నోడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన కళ్ళల్లో మనం పొడుచుకున్నట్టే. కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెబుతుంది. కాంగ్రెస్ వాళ్లు బట్టేబాజ్ గాళ్ళు వాళ్ళవి తిట్లు…మనవి కిట్లు. కాంగ్రెస్ బూతులు కావాలా…తెలంగాణ భవిష్యత్తు కావాలా.” అని మంత్రి హరీశ్ రావు ప్రజలకు సూచించారు.
*సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్
సంగారెడ్డిలో కాంగ్రెస్ ప్రచారం నిర్వహిస్తోంది. అందులో భాగంగా అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. పదేళ్లు గడిచినా కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్ దారులకు డబ్బులు ఎప్పుడు పడుతాయో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని తెలిపారు. పదేళ్లు గడిచినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదని కిరాయి మనుషులతో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. స్థానికులు పట్టుకుని నిలదీయడంతో అసలు విషయం బయటపడిందన్నారు. సీఎం కేసీఆర్ కు తాను సూటిగా సవాల్ విసురుతున్నానని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు మీరు సిద్ధమా? అని ప్రశ్నించారు. బస్సు సిద్ధంగా ఉంది.. గజ్వేల్ ఫామ్ హౌస్ కు రావాలా.. ప్రగతి భవన్ కు రావాలో చెప్పండి అని నిలదీశారు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు ఎందుకు కుంగాయో తెలుసుకుని అటునుంచి కర్ణాటక వెళదామని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఈ సవాలుకు మీరు సిద్ధమా? అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని.. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని 50వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు.
*ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు.
ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ లేఖల్లో పేర్కొంది. ఎన్జీటీ నిబంధనలకు విరుద్దంగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ ఎంపీలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ పెద్దల బినామీలకు దక్కేలా టెండర్లు రూపొందించారని టీడీపీ ఆరోపించింది. గతంతో పోల్చుకుంటే సెక్యూర్టీ డిపాజిట్ మొత్తాన్ని చాలా వరకు తగ్గించారని వారు లేఖలో పేర్కొన్నారు. నాన్ రిఫండబుల్ టెండర్ డాక్యుమెంట్ ధరను ఏకంగా రూ. 29.50 లక్షల మేర వసూలు చేయడం ద్వారా కాంపిటీషన్ ను తగ్గించే ప్రయత్నం చేశారని లేఖలో వెల్లడించారు. ప్రీ-బిడ్ మీటింగ్ ఏపీలో కాకుండా రహస్యంగా కోల్ కత్తాలో నిర్వహించారని సీబీఐ, సీవీసీలకు ఎంపీలు వివరించారు. ఏమైనా ఆరోపణలు వస్తే ఎంఎస్ఎస్టీ మీదకు నెట్టేసేలా పక్కా వ్యూహంతో ఇసుక దోపిడీకి తెర లేపారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఏపీలోని ఇసుక దోపిడీ కోసం జరుగుతున్న టెండర్ల ప్రక్రియపై సమగ్ర విచారణ జరపాలని సీబీఐ, సీవీసీలను టీడీపీ కోరింది.
*ఎన్నికల ముందు కాంగ్రెస్కు బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార జోరును పెంచుతూ ఉంటే.. కొందరు కీలక నేతలు తమకు పార్టీలో స్థానం దక్కడం లేదని రాజీనామాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ దక్కలేదన్న తీవ్ర అసంతృప్తితో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఇదిలా ఉంటే.. ఆయనకు టికెట్ లభించకపోవడంతో అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చింది.. అయినప్పటికీ పార్టీలో కొనసాగేందుకు మొగ్గు చూపలేదు. దీంతో హస్తం పార్టీకి నాగం రాజీనామా చేశారు. ఇటీవలే పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేయడంతో పార్టీ తీరుపై నాగం కోపంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈయన కాంగ్రెస్ పార్టీని వీడారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్‌కర్నూల్‌లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉంటే సాయంత్రం నాగం జనార్ధన్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.
*బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా?
బీసీలను కేటీఆర్ అవమానించారని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. బీసీలను ముఖ్యమంత్రి చేస్తామనగానే గుణం గుర్తుకొచ్చిందా అంటూ ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో ఎంతమంది గుణవంతులకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలి అంటూ ఆయన పేర్కొన్నారు. తక్షణమే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీఆర్ఎస్ ఓట్లడగాలన్నారు. ఒవైసీ… ఈ కొత్త వరుసలేంది అంటూ ప్రశ్నించారు. డబ్బు సంచులందగానే వావివరుసలు మారిపోయినయా అంటూ తీవ్రంగా విమర్శించారు. కరీంనగర్‌లో పోటీ చేస్తానని చేసిన ప్రగల్భాలేమైనయ్ అంటూ మండిపడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ..” డిపాజిట్లే రాని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎట్లా అవుతుంది?. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుమ్కక్కై బీజేపీ గ్రాఫ్‌ను తగ్గించే కుట్ర. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరేయబోతున్నం. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. పేదల పార్టీ బీజేపీకి, దోపిడీ పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య జరుగుతున్న పోరాటమిది.” అని బండి సంజయ్ అన్నారు.
*కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారు
హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్‌ఎస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను కలిసినప్పుడు 2014ల ఎట్లా ఉండే…ఇప్పుడు ఎట్లా ఉంది అని అడగాలన్నారు. హైదరాబాద్ మహా నగరం ను విశ్వ నగరంగా మార్చే క్రమం లో అడుగులు ముందుకు వేస్తున్నామని, గతంను మరిచి పోయి గందరగోళం పడిపోతాం… ఇది మానవ నైజమన్నారు. 2014 కు ముందు 10 గంటలు కరెంట్ పోయిన అడిగేవాడు వాడు…చెప్పే వాడు లేడని, ఇప్పుడు 10 నిముషాలు కరెంట్ పోతే ఇదేనా బంగారు తెలంగాణ అని సోషల్ మీడియాలో పెడుతున్నారన్నారు. కర్ణాటకలో ప్రజలు కరెంట్ లేక రోడ్లు ఎక్కుతున్నారని, కర్ణాటక ఉప ముఖ్య మంత్రి ఉన్న ముచ్చట్ట చెప్పిపోయారన్నారు. అయిదు గంటలు కరెంట్ కష్టపడి ఇస్తున్నాం అని డికె శివ కుమార్ చెప్పారని, తెలంగాణ లో 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తూ ఉంటే…కాంగ్రెస్ కు పొరపాటు న ఓటు వేస్తారా ఎవరైనా ? అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే అంటే అంధకారం…కరెంట్ కోతలు అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే దుష్ట పాలన వస్తుందని ఓటర్లకు చెప్పాలన్నారు మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కికి ఎల్బీనగర్ గురించి ఏం తెలుసన్నారు. కాంగ్రెస్ వాళ్లు సీట్లు పంచుకునే సరికి మనం స్వీట్లు పంచుకుంటున్నామని చెప్పారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుంటే రాజీనామా చేస్తానన్న నాయకుడు సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్‌లో బీజేపీ కార్పొరేటర్లను గెలిపిస్తే పైసా పని చేయలేదని విమర్శించారు. బూత్‌స్థాయి కార్యకర్తలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి చెప్పాలని సూచించారు. ఎల్బీనగర్ ఎంత అభివృద్ధి చెందిందో గుర్తుచేయాలన్నారు. సీఎం కేసీఆర్ పథకాలను ప్రతి ఇంటికి వివరించాలన్నారు. అన్నపూర్ణ పథకం ద్వారా రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తామని, కేసీఆర్ బీమాతో ప్రతి ఇంటికి ధీమా అన్నారు. రూ.400లకే వంటగ్యాస్ సిలిండర్ వంటి పథకాలను గురించి వివరించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
*”కాంగ్రెస్, సీపీఎం బుజ్జగింపు రాజకీయాల ఫలితం”.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
కేరళలో ఆదివారం జరిగిన వరస పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లలో ఇప్పటికే ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కలమస్సేరిలో జరిగే ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ పేలుళ్లు సంభవించాయి. ఇటీవల కేరళలో పాలస్తీనా, హమాస్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల అనంతం పేలుళ్లు సంభవించడం ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే కేరళ పేలుళ్లు ఇప్పడు రాజకీయ వేడిని రాజేస్తున్నాయి. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్, అధికార సీపీఎం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు. పేలుళ్లను ఖండించిన రాజీవ్ చంద్రశేఖర్.. ‘‘సీపీఎం, కాంగ్రెస్ పార్టీల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడటం వల్ల అన్ని వర్గాలకు చెందిన అమయాకపు ప్రజలు మూల్యాన్ని భరిస్తున్నాడరు.. అదే మన చరిత్ర నేర్పింది’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక రోజు క్రితం కేరళలో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో హమాస్ నాయకుడు వర్చువల్ గా పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘బుజ్జగింపు రాజకీయాలు- కాంగ్రెస్/సీపీఎం/యూపీఏ/ఇండియా కూటమి ప్రమాణాలు సిగ్గు చేటని తీవ్రవాద హమాస్ ను ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ఆహ్వానించాయి. కేరళలో జిహాద్ కి పిలుపునిచ్చాయి. ఇది బాధ్యతరహిత పిచ్చి రాజకీయాల ఔన్నత్యం చాలు’’ అంటూ వ్యాఖ్యానించారు. మీరు మీ పెరట్లో పాములు పెంచుకోలేదరు, అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించకూడదు, అవి మీకు కూడా ప్రమాదకరమే అని హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్ ను ఉద్దేశించి చెప్పిన వ్యాఖ్యల్ని మరోసారి రాజీవ్ చంద్రశేఖర్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేరళ పేలుళ్లపై ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. కేరళ పోలీసులు కూడా ప్రత్యేక టీముల్ని ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. పేలుళ్లతో ముఖ్యంగా ఢిల్లీ, ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు.
*కేరళ వరస పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్..
కేరళలో వరస పేలుళ్ల తర్వాత దేశవ్యాప్తంగా హై అలర్ట్ నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబైలో హై అలర్ట్‌లో ఉన్నాయి. పేలుళ్ల నేపథ్యంలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. పండగ సీజన్, రాబోయే క్రికెట్ మ్యాచుల నిర్వహణ నేపథ్యంలో ముంబై పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో ముంబైలో యూదులు ఎక్కువగా ఉండే చాబాద్ హౌజ్ వద్ద ఇప్పటికే భద్రతను పెంచారు. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నిఘా సంస్థలతో నిరంతరం టచ్ లో ఉందని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో యెహోవా విట్‌నెస్ ప్రార్థనా సమావేశం జరుగుతున్న సమయంలో వరసగా మూడు సార్లు పేలుళ్లు సంభవించాయి. టిఫిన్ బాక్సుల్లో ఐఈడీ పేలుడు పదార్థాలు పెట్టి పేల్చినట్లు నిఘా వర్గాలు తేల్చాయి. ఈ పేలుళ్లలో ఒకరు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. కొచ్చికి 10 కిలోమీటర్ల దూరంలో కలమస్సేరిలో జరిగిన ఈ సమావేశానికి దాదాపు 2,000 మంది హాజరయ్యారు. అక్టోబర్ 27న ప్రారంభమైన మూడు రోజుల ప్రార్థన సమావేశానికి ఈరోజు చివరి రోజు. ప్రస్తుతం ఈ పేలుళ్లపై విస్తృత దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుళ్లకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది. దీంతో పాటు కేంద్రం నుంచి ఎన్ఎస్జీ బలగాలు కూడా కేరళకు చేరుకున్నాయి. దీనికి తోడు కేరళ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పరిస్థితి గురించి సీఎం పినరయి విజయన్ కి హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.