చంద్రబాబు ఇద్దరు పీకేలను విమర్శించి.. వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు:
ఒకప్పుడు ఇద్దరు పీకేలను విమర్శించి.. ఇప్పుడు వాళ్లనే పక్కన పెట్టుకున్నాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఎలాంటి అభివృధి, సంక్షేమం పాలన అందించ లేదన్నారు. చంద్రబాబుకు ఎస్సీలను చిన్నచూపు చూసే నైజం మొదటి నుంచి ఉందన్నారు. దళితులను నేటికీ గౌరవించని వ్యక్తి చంద్రబాబు అని నారాయణ స్వామి మండిపడ్డారు. నేడు నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం:
‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల ద్వారా అంతర్జాతీయ స్థాయికి మన క్రీడాకారులను పరిచయం చేయడమే లక్ష్యం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. గ్రామాల్లోని ఆణిముత్యాలను దేశానికి అందిస్తామని, ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే మైలురాయి అని పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే మన జీవితంలో క్రీడలు అవసరమని, క్రీడలతో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని సీఎం జగన్ చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్ ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులకు సీఎం కిట్‌లను పంపిణీ చేశారు.
ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ:
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజా సమస్యలను వినేందుకు ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఉదయం 10గంటల లోపు వచ్చినవారే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎలాగైనా 10గంటల లోపు క్యూలో నిలబడాలని అర్థరాత్రి బయలుదేరుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, భూసమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తేనే తమ సమస్య పరిష్కారమవుతుందని అందుకే వచ్చామని చెబుతున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. నగరవాసులే కాకుండా అనేక జిల్లాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి ప్రజావాణికి వస్తున్నారు. అక్కిడికి వచ్చిన వారిని సరైన దారిలో పంపించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రద్దీ లేని మార్గం నుంచి పంపిస్తున్నారు.
విజృంభిస్తున్న మహమ్మారి:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లో మళ్ళీ భయం మొదలైంది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ లో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ నీ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణె పంపుతున్నారు. త్వరలో గాంధీ ఆసుపత్రిలో రాష్ట్ర ఆరోగ్య శాఖ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రారంభించనుంది. ఇప్పటికే చలి తీవ్రత తో శ్వాస సమస్యల కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నా కూడా సీరియస్ గా ఎవ్వరూ లేకపోవడం.. అంతా స్టేబుల్ గా ఉన్నారు. అయితే ఇదే సీజన్ లో ఎక్కువగా ఆస్తమా, COPD, కేసులు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి ప్రజలు జలుబు, ఆస్తమాకు చాలా లైట్ తీసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులకు వెళ్లే వారికి ప్రతి ఒక్కరిని కోవిడ్ పరీక్షలకు నిర్వహిస్తున్నారు.
నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు:
ప్రజా భవన్ వద్ద జరిగిన రాష్ డ్రైవింగ్ కేస్ లో నిందుతులని గుర్తించామని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ అన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ గా గుర్తించామన్నారు. ప్రస్తుతం రాహెల్ పరారీలో ఉన్నాడని, మిగతా వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. రాహెల్ ఇంట్లో పనిచేసే డ్రైవర్ తానే డ్రైవ్ చేసినట్లుగా పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి లొంగిపోయాడని అన్నారు. ర్యాష్ డ్రైవింగ్ కేసులో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఈ కేసులో ఎవరున్నా ఉపేక్షించేది లేదని అన్నారు. న్యూ ఇయర్ కోసం ఏర్పాటు చేసినటువంటి బ్యారికేట్స్ ను అతివేగంగా వచ్చి బిఎమ్ డబ్ల్యూ కార్ ఢీ కొట్టిందని తెలిపారు. కారులో ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు యువతులు ఉన్నారని అన్నారు. ఈ విధంగా పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
స్కూల్‌ను బార్గా మార్చారు:
బీహార్‌లో మద్య నిషేధం ఉంది. ఇక్కడ మద్యం సేవించడం చట్టరీత్యా నేరం. దీని తర్వాత కూడా బీహార్‌లో మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ప్రతిరోజూ పెద్ద ఎత్తున మద్యం సరుకు సరఫరా అవుతుంది. బీహార్‌లోని బంకాలో ఒక పాఠశాలను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు పబ్‌గా మార్చారు. విద్యాలయ పవిత్ర దేవాలయంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మరో ముగ్గురితో కలిసి కూర్చుని మద్యం సేవిస్తున్నారు.. మంచింగ్ కోసం చికెన్ ఏర్పాటు కూడా చేశారు. ఈ విషయాన్ని ఎవరో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ బృందానికి సమాచారం అందింది. బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తయారు చేసిన వంటగదిలో కూర్చున్న వారంతా మద్యం సేవిస్తున్నారు. ఈ షాకింగ్ కేసు బంకా జిల్లాలోని రాజౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చిల్కావార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిధిలోకి వచ్చింది.
20లక్షల మంది అరెస్ట్:
శరణార్థుల ప్రవేశంపై అమెరికాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వెనిజులా, నికరాగ్వా, క్యూబా, హోండురాస్‌తో సహా అనేక దేశాల నుండి శరణార్థులు మెక్సికోకు చేరుకున్నారు. మెల్లగా ఈ వ్యక్తులు అమెరికా సరిహద్దు వైపు కదులుతున్నారు. వీరిలో ఎక్కువ మంది పిల్లలు, మహిళలున్నారు. ఈ జన సమూహం క్రిస్మస్ పండుగ సందర్భంగా టపాచులా (మెక్సికో) చేరుకున్నారు. 6000 మందికి పైగా శరణార్థులు అమెరికా సరిహద్దుల వైపు కదులుతున్నారు. ఇప్పటి వరకు ఇదే అతిపెద్ద గ్రూప్ అని చెబుతున్నారు. మార్చిలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున జనం అమెరికా వైపు వెళ్లారు. సరిహద్దుల్లోకి అక్రమంగా ప్రవేశించిన 20 లక్షల మందిని అమెరికా ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంఖ్య గత రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించినది.
ఎంత చెప్పినా ప్రశాంత్ నీల్ వినలేదు:
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేస్తూ ముందుకు వెళుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అనేకమంది నటీనటులు కనిపించారు కానీ విశాల్ వదిన, నటి శ్రియ రెడ్డి పాత్ర గురించి మాత్రం సినిమా చూసిన వారందరూ చర్చించుకుంటున్నారు. సినిమాలో రాజమన్నార్ అనే పాత్ర పోషించిన జగపతిబాబు కుమార్తె రాధా రమ అనే పాత్రలో శ్రియ రెడ్డి కనిపించింది. నిజానికి ఆమె ఈ సినిమాలో కనిపించడానికి అంటే ముందు సుమారు ఆరేడేళ్ల ముందు నుంచే సినిమాలు చేయడం ఆపేసింది. అయితే ఈ సినిమా అవకాశం వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏమిటి అని అడిగితే ఆమె ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ముందు నుంచి ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయమని కోరినప్పుడు తాను చేయలేనని చెప్పానని, ఎన్నోసార్లు అవాయిడ్ చేయడానికి కూడా ప్రయత్నించాక మీరు ఒప్పుకోకపోతే చెన్నై వచ్చయినా సరే మీకు కథ వినిపిస్తానని ప్రశాంత్ నీల్ చెప్పడంతో కథ వినడానికి ఒప్పుకున్నానని చెప్పుకొచ్చింది.
తొలి టెస్టు టాస్ ఆలస్యం:
సెంచూరియన్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సిన భారత్, దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఒంటిగంటకు పడాల్సిన టాస్ ఆలస్యం కానుంది. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో కొంత సమయం తర్వాత మ్యాచ్‌ను ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. మధ్యాహ్నం 1.30 తర్వాత మరోసారి పిచ్‌ను అంపైర్లు పరిశీలించనున్నారు.