*ఆర్టీసి బిల్లును సిద్ధం చేసిన సర్కార్.. ఆమోదం తెలుపని గవర్నర్..!
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపలేదు..! దీంతో ఈ బిల్లును అసెంబ్లీలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థిక బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్‌కు పంపింది. అయితే ఈ బిల్లుకు రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభించలేదు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత నెల 31న జరిగిన తెలంగాణ కేబినెట్ తీర్మానం చేసింది. ఈ మేరకు ఈ నెల 1న బిల్లు రూపొందించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే అది మనీ బిల్లు కావడంతో ప్రభుత్వం దానిని గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే రాజ్‌భవన్ నుంచి బిల్లుకు ఇంకా ఆమోదం లభించలేదు. ఈ బిల్లుకు రాజ్‌భవన్ ఆమోదం లభిస్తే ఈరోజు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే రాజ్‌భవన్ నుంచి అనుమతి రాకపోవడంతో ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. రేపు తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. అవసరమైతే అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు పొడిగించవచ్చు. రేపటిలోగా రాజ్‌భవన్ నుంచి ఆమోదం లభిస్తే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతంలో గవర్నర్ తిరస్కరించిన మూడు బిల్లులతో పాటు మరో నాలుగు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఈ విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఈ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్‌కు పంపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఆర్టీసీకి చెందిన 43 వేల మందికి పైగా ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ గత నెల 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లును అధికారులు ఈ నెల 1న రాజ్‌భవన్‌కు పంపించారు. అయితే ఈ బిల్లుపై రాజ్‌భవన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
*ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్
ఐటీ, ఉద్యోగ కల్పనలో తెలంగాణే నెంబర్ వన్ అని ఐటీ శాఖామంత్రి కేటీఆర్ అన్నారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీలో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐటీ ఎగుమతులపై .. కేటీఆర్ సమాధానం చెబుతూ.. తెలంగాణ లో కులగజ్జి, మత పిచ్చి లేదని అన్నారు. స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని తెలిపారు. బెంగుళూర్ ని వెనక్కి నెట్టి ఐటీ లో ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్ నిలిచిందని అన్నారు. ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సినదే అని పేర్కొన్నారు. 44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుండే అని తెలిపారు. రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైద్రాబాడ్ గురించి చెప్పారని అన్నారు. కానీ కొంత మంది ఇంకా కళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. 1987 లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడిందని గుర్తు చేశారు. మేమే తెచ్చాం అని చెప్పుకునే వారికి తెలుసుకోవాలని అన్నారు. ఈటెల కు కూడా తెలవాలని, హుజురాబాద్ లో కూడా ఐటీ కంపనీ వచ్చిందని, ఇప్పుడు లేదన్న ఈటెల.. మీరు బీజేపీ లోకి వెళ్ళాకా కంపనీ పోయినట్టు ఉందన్నారు. ఐటీని జిల్లాలకు వ్యాపించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. శాసనసభలో విపక్షాల తీరుపై 30 రోజుల పాటు సభ నిర్వహించాలని అంటున్నారు. అయితే 30 నిమిషాలు అసెంబ్లీలో కూర్చునే ఓపిక లేదని కేటీఆర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిన్న బీఏసీ సమావేశం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. 30 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నేత లేఖ రాశారు. 20 రోజుల పాటు మహాసభలు నిర్వహించాలని కోరారు. అయితే ప్రశ్నోత్తరాల సమయంలో మేమంతా ఉన్నాం.. కానీ కాంగ్రెస్, బీజేపీల నుంచి ఒక్కొక్కరు మాత్రమే సభకు హాజరయ్యారు. దీన్ని బట్టి వారికి ప్రజల చిత్తశుద్ధి తెలుస్తుంది. ప్రజల పట్ల వారి ప్రేమ మరియు అభిమానం స్పష్టంగా కనిపిస్తుంది. బయటి డైలాగులు.. 20 రోజులు కావాలి.. 30 రోజులు కావాలి. కానీ వారికి 30 నిమిషాలు కూర్చునే ఓపిక లేదు. ప్రజలు కూడా వాటిని గమనిస్తున్నారు. వారి పనులు ప్రజలే చూసుకుంటారని కేటీఆర్ అన్నారు.
*మద్యం దుకాణాల లైసెన్స్‌కు నోటిఫికేషన్.. ఈనెల 21న ఓపెన్ లాటరీ..
రాష్ట్రంలో వచ్చే రెండేళ్లకుగానూ రిజర్వ్‌వుడ్ వైన్‌ల కేటాయింపు ప్రక్రియ గురువారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,620 షాపుల్లో 1,834 దుకాణాలు ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. గౌడ్‌లు, ఎస్సీ, ఎస్టీలకు 786 దుకాణాలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇందులో గౌడ్‌లకు 393 (15 శాతం), ఎస్సీలకు 262 (10 శాతం), షెడ్యూల్డ్ ఏరియా ఎస్టీలకు 95, నాన్ షెడ్యూల్డ్ ఎస్టీలకు 36, మొత్తం 131 (5 శాతం) షాపులను కలెక్టర్లు రిజర్వ్ చేశారు. 2023-25 కాలానికి సంబంధించి మద్యం దుకాణాల లైసెన్స్‌కు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. శుక్రవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. ఈ నెల 21న ఓపెన్ లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, అయితే రిజర్వ్‌డ్ షాపులకు ఆయా వర్గాలకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ఫీజును డీడీ రూపంలో కానీ, చలాన్ రూపంలో కానీ చెల్లించవచ్చు. జిల్లాల వారీగా నిర్ధారిత కేంద్రాల్లో దరఖాస్తులు ఉదయం 11 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరిస్తారు. నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్సైజ్ శాఖ వచ్చే రెండేళ్ల (2023-25) మద్యం దుకాణాలకు లైసెన్స్ మంజూరు ప్రక్రియను నిన్న ప్రారంభించిన విషయం తెలిసిందే. మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్‌తో పూర్తవుతున్నది. దీంతో కొత్తగా లైసెన్సులను జారీ చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు ప్రారంభించింది. దుకాణాల సంఖ్య, రిజర్వేషన్లు యథాతధంగా కొనసాగనున్నాయి. దరఖాస్తు రుసుం గతంలో మాదిరిగానే రూ.రెండు లక్షలుగా (నాన్ రిఫండబుల్), స్పెషల్ రీటెయిల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఎస్‌ఆర్‌ఈటీ)ను రూ.5 లక్షలుగా నిర్ధారించారు.
*ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్..
విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వజ్రోత్సవ వేడుకలకు సింబల్‌గా 60 గులాబీల పుష్ప గుచ్చంతో సీఎం జగన్‌కు మంత్రి కాకాణి స్వాగతం పలికారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. కొత్త బ్రాండ్ సంకల్ప్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. 13 డీసీసీబీలకు డివిడెండ్ల పంపిణీతో పాటు బ్యాంకు విజన్ డాక్యుమెంట్‌ను సీఎం ఆవిష్కరించారు. 1963లో ప్రారంభమైన ఆప్కాబ్.. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తోంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది. 2019 నాటికి కేవలం రూ.13,322 కోట్ల టర్నోవర్‌కే పరిమితమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో 4 ఏళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. ఈ నాలుగేళ్లలో రెండు సార్లు జాతీయ అవార్డులను ఆప్కాబ్ సాధించింది. రాష్ట్ర సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ళ ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు అని ఒక నానుడి ఉండేదని.. బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గర అడుగులు వేయటంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సహకార బ్యాంకులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్‌లో కృష్ణా జిల్లా డీసీసీబీ నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఉత్తమ డీసీసీబీలకు అవార్డుల ప్రదానం జరిగింది. నెల్లూరు డీసీసీబీ, కర్నూలు డీసీసీబీలకు అవార్డులు లభించాయి.
*చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నా వద్ద ఉందంటున్న 1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజలకు సేవ అందిస్తున్న నైజం తనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే నైజం తనది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్టుప్తె రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెనుక ఉండి రాజకీయాలు చేయించడంలో దిట్ట అంటూ ఆరోపించారు. ట్రస్ట్‌లో ఫ్యాక్షన్ బాధితుల పిల్లలను చదివించి ఫ్యాక్షన్ చేయిస్తున్నారని ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌లో క్రిమినల్స్‌ను తయారు చేసే అడ్డా అంటూ ఆరోపణలు చేశారు. అక్కడ చదువుకున్న వారు కేసుల్లో ఉన్నారని ఆయన అన్నారు.
*ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్‌ని చంపిన భార్య
వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు బరితెగించేస్తున్నారు. పాడుపని చేయడమే కాకుండా.. కట్టుకున్న భర్తలనే అన్యాయంగా చంపేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్‌లోనూ ఇలాంటి దారుణ ఉదంతమే వెలుగు చూసింది. ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత.. కానిస్టేబుల్ అయిన తన భర్తను ప్రియుడితో కలిసి చంపేసింది. మరింత ఘోరం ఏమిటంటే.. తన భర్తని ప్రియుడు చంపుతుండగా, దాన్ని భార్య తన ఫోన్‌లో రికార్డ్ చేయడం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్ అనే వ్యక్తికి కొన్నాళ్ల క్రితం శివానితో పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. గత కొంతకాలం నుంచి శివారి రామారవు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసి ఖంగుతిన్న రమేష్.. భార్యని మందలించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. తన ప్రియుడు రామారావుతో కలిసి రాసలీలలు కొనసాగించింది. దీంతో లోలోపలే కుంగిపోయే రమేష్.. మద్యానికి బానిస అయ్యాడు. ఏం చేయాలో తెలియక లోలోపలే కుమిలిపోయాడు. అటు.. శివాని తన భర్తను చంపి, ప్రియుడితో కలిసుండాలని ప్లాన్ వేసింది. భర్తని చంపి.. వరకట్న సమయంలో రమేష్‌కి ఇచ్చిన అరకరం అమ్మేసి, ప్రియుడితో కలిసి సెటిల్ అవుదామని భావించింది. నీలా అనే వ్యక్తికి రూ.2 లక్షల సుపారీ ఇచ్చి.. రమేష్‌ను చంపేందుకు శివాని, రామారావు కలిసి ప్లాన్ వేశారు. ప్లాన్ ప్రకారం.. శివాని తన భర్తకు మత్తు ట్యాబ్లెట్స్ ఇచ్చింది. అవి వేసుకున్న తర్వాత రమేష్ గాఢ నిద్రలోకి జారిపోయాడు. అప్పుడు ప్రియుడు, నీలా కలిసి తలదిండు మొహానికి అడ్డుపెట్టి చంపేశారు. భర్తను చంపే సమయంలో శివాని తన ఫోన్‌లో వీడియో తీసింది. అనంతరం తనకేమీ తెలియదన్నట్టు డ్రామా ఆడింది. కాల్‌డేటా, వాట్సాప్ చాట్ ఆధారంగా లోతైన దర్యాప్తు చేయగా.. భార్యే హంతకురాలని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధం కోసమే భర్తని చంపినట్టు శివాని ఒప్పుకుంది. శివాని తల్లిదండ్రుల మీద కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
*ఇండిగో విమానంకు తప్పిన పెను ప్రమాదం..
దేశీయ విమానయాన సంస్థ ‘ఇండిగో’కు చెందిన ఓ విమానంకు పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన 3 నిమిషాలకే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఈ ఘటన శుక్రవారం ఉదయం పట్నా విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఇంజిన్ వైఫల్యం కారణంగానే.. విమానం టేకాఫ్ అయిన మూడు నిమిషాలకే అత్యవసరంగా దించేశారు. దాంతో ఇండిగో విమానంలో ఉన్న వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అధికారుల వివరాల ప్రకారం… పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈరోజు ఉదయం ఇండిగో 6ఈ 2433 నంబర్ విమానం ఢిల్లీకి బయల్దేరింది. టేకాఫ్ అయిన 3 నిమిషాలకే విమానంలోని ఒక ఇంజిన్ పని చేయలేదు. ఇది గమనించిన పైలట్.. వెంటనే ఏటీసీకి సమాచారం ఇచ్చాడు. అప్రమత్తమైన ఏటీసీ అధికారులు విమానాన్ని అత్యవసరంగా (ఎమర్జెన్సీ ల్యాండింగ్) దించేశారు. ఉదయం 9.11 గంటలకు విమానం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అయింది. దాంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలన్నీ సజావుగానే సాగుతున్నాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులను మరో విమానంలో ఢిల్లీ పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జులైలో కూడా ఓ ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన గంటకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. టైర్ పేలి ఉంటుందన్న అనుమానంతో ప్యారిస్ బయల్దేరిన విమానాన్ని వెనక్కి మళ్లించి.. ఢిల్లీలో అత్యవసరంగా దించేశారు.
*రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్.. మార్కెట్ లోకి వచ్చేది అప్పుడే?
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.. బుల్లెట్ బండి అంటే యువతకు ఒక పిచ్చి ఉంటుంది.. ఖర్చు ఎక్కువైన పర్లేదు తగ్గేదేలే అంటున్నారు..ఫాలో అయే వారు ఎక్కువగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. యూత్‌లో ఈ బైక్స్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకోవం అతిశయోక్తి కాదేమో. అందుకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ దుమ్మురేపుతూ ఉంటాయి.. ఇది ఇలా ఉండగా..రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్‌ను తయారు చేసే ఐషన్ మోటార్స్ ఓ కీలక ప్రకటన చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఎలక్ట్రిక్ బైక్స్ తీసుకు వచ్చే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకే కంపెనీ ఒక్క ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా తీసుకురాలేదు. అయితే తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను ఎప్పుడు తీసుకువచ్చేది వెల్లడించింది. ఇండియాలో వచ్చే రెండేళ్ల కాలంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను లాంచ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది.. ఈ విషయాన్ని కంపెనీ అధినేత స్వయంగా ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు.. కొత్తగా ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ కోసం ఒక తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తామని, 1,50,000 యూనిట్ల కెపాసిటీతో దీన్ని స్థాపిస్తామని వెల్లడించారు. తర్వాత క్రమంగా ఈ తయారీ కెపాసిటీ పెంచుకుంటూ వెళ్లామని తెలిపారు. గురుగావ్ లో ఈ కొత్త బైక్స్ ను తయారు చేసేందుకు రెడీ అవుతున్నారని తెలిపారు..మరో వైపు రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీ అమ్మకాలు జూలై నెలలో భారీగా పెరిగాయి. 66,062 యూనిట్లుగా నమోదు అయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాలు 46,529 యూనిట్లుగా ఉన్నాయి. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 42 శాతం పెరిగాయని చెప్పుకోవచ్చు. అయితే ఎగుమతులు మాత్రం తగ్గాయి. 7055 యూనిట్లుగా నమోదు అయ్యాయి.. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు తగ్గినట్లు చెబుతున్నారు.. అందుకే కొత్త బైక్స్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
*ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!
ఐపీఎల్ ప్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ అండీ ఫ్లవర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్‌సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్ కోచ్‌గా పని చేసిన సంజయ్ బంగర్ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ అండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు డైరక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్‌కు కూడా ఆర్‌సీబీ వీడ్కోలు పలికింది. ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్, టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్‌కు స్వాగతం. ఆండీ ఫ్లవర్‌ను ఆర్‌సీబీ మెన్స్ హెడ్ కోచ్‌గా నియమించాం. ప్రపంచవ్యాప్తంగా ఆండీ ఫ్లవర్‌కు ఉన్న అనుభవం ఆర్‌సీబీ జట్టును ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నాం. ఆండీ ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోంషం’ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అండీ ఫ్లవర్‌కు దశాబ్ధానికి పైగా కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. 2010లో ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌ను గెలిచినపుడు ఆ జట్టుకు అండీ కోచ్‌గా ఉన్నారు. ఐపీఎల్ 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా అండీ పని చేశారు. మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి పని చేశారు. లక్నో మొదటి రెండు సీజన్‌లలో ప్లేఆఫ్‌లకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే 2024 సీజన్‌కు ముందు అండీని లక్నో రిలీజ్ చేసి.. ఆస్ట్రేలియన్ గ్రేట్ జస్టిన్ లాంగర్‌ను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. ఇప్పుడు ఆర్‌సీబీ అండీని కోచ్‌గా ఎంచుకుంది. ఐపీఎల్ 2023 ఆరంభంలో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరలో చేతులేత్తేసింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంతో సరిపెట్టుకుంది. 2024కు అండీ ఫ్లవర్ కోచ్‌గా ఎంపికవడంపై ఆర్‌సీబీ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024లో కప్పు ఖాయం అని అంటున్నారు. ఎందుకంటే అండీ ఇప్పటివరకు పని చేసిన జట్లు ఛాంపియన్‌గా నిలిచాయి.