*మరో ప్రతిష్టాత్మక సదస్సుకు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. వచ్చే సెప్టెంబర్ 14న జర్మనీలోని బెర్లిన్ నగరంలో నిర్వహించే గ్లోబల్ ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్ పాలసీ అలయెన్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనాలని ఆయనను కోరారు. ఇందులో భాగంగానే శాస్త్ర సాంకేతిక రంగ విధానం కోసం పనిచేస్తున్న ప్రపంచ నిపుణులతో కూడిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలు, సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో డిజిటల్ టెక్నాలజీ విస్తరణపై ప్రజెంటేషన్ ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌కు ఐటీఐఎఫ్ ఉపాధ్యక్షుడు స్టీఫెన్ ఎజెల్ కోరారు. జీటీఐపీఏ వాణిజ్యం, ప్రపంచీకరణ, ఆవిష్కరణల ద్వారా పౌరులకు ప్రయోజనాలు అందించేందుకు స్వతంత్ర నిపుణులతో కూడిన సంస్థ కృషి చేస్తుంది. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న ఆర్థిక, వాణిజ్య, ఆవిష్కరణ సవాళ్లకు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడమే ఈ సదస్సు యొక్క ముఖ్య లక్ష్యం. ప్రాంతీయ ఆవిష్కరణల్లో పోటీతత్వం, జీవశాస్ర్తాల ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన విధానాలు.. డీకార్బనైజేషన్ను సులభతరం చేసే డిజిటల్ సాంకేతికతలు, ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో సుస్థిరత సాధించడం వంటి అంశాలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన నిపుణులు చర్చల్లో పాల్గొంటారు. ప్రపంచీకరణ, వాణిజ్యం, ఆవిష్కరణ విధాన సమస్యలపై చర్చించేందుకు ప్రపంచంలోని ప్రముఖులు, నిపుణులు, వ్యాపార, ప్రభుత్వ, విద్య, విధాన రూపకల్పనకు సంబంధించి ఈ సదస్సుకు ఆహ్వానించారు.
*తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఈరోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. నిన్న ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీద ఉన్న ఆవర్తనం ఇవాళ బలహీనపడిందని పేర్కొంది. శనివారం వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా- గ్యాంగ్‌టక్ పశ్చిమ బెంగాల్ తీరాల్లో సగటు సముద్రమట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు ఒక ఆవర్తనం ఏర్పడి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశవైపుగా వంగి ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం రాగల 2..3 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ఉన్న ఉత్తర ఒడిశా, దాని పరిసరాల్లోని గ్యాంగ్‌టక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ మీదగా వెళ్లే అవకాశం ఉందన్నారు. మరొక ఆవర్తనం వాయువ్య బంగాళాఖాతంలో సుమారుగా ఈనెల 18న ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించారు. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ దిశ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం ఉంది.
*టీఎస్ ఆర్టీసీలో త్వరలో క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానం
తెలంగాణ ఆర్టీసీలో ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్ లతో ముందుకు వెళ్తున్న యాజమాన్యం ప్రయాణికుల ఇబ్బందులను తొలిగించేందుకు శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు ఎదుర్కొనే క్యాష్ కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తిగా చేశారు. గత సంవత్సరం చివరిలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్దతిని ప్రవేశపెట్టాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు భావించారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది ఆగిపోయింది. ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించిన డబ్బులు ఎవరి బ్యాంక్ ఖాతాలో జమ చేయబడతాయి..? ఏదైనా కారణం చేతనైన డబ్బులు జమ కాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి?.. అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ఓ కొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని తెలంగాణ ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీనిని ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేయాలనే ఆలోచనతో ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక, నగదు రహిత టికెట్స్ వస్తే సగం చిల్లర బాధ తప్పినట్లే అని ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో పాటు డిజిటల్ చెల్లింపుల్లో కూడా ఆర్టీసీ అడుగులు వేస్తుందని తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోరకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ విధానం సక్సెస్ అయితే.. మరి కొన్ని రోజుల్లోనే తెలంగాణ ఆర్టీసీలో నగదు రహిత టికెట్ అందుబాటులోకి వస్తుంది.
*చికెన్ ఆర్డరిచ్చి.. అకౌంట్లో డబ్బులు కాజేసిన సైబర్ నేరగాళ్లు
సైబర్ నేరస్తులు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు.. డబ్బులు కొట్టేసేందుకు ఏ మార్గాన్ని వదలట్లేదు.. ఇప్పటివరకు అనేక రకాలుగా మోసాలకు దిగిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్న సామెతలా.. రూపాయి ఉంటే రూపాయి కూడా వదలకుండా లాగేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి.. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లోని ఓ చికెన్ దుకాణానికి ఓ వ్యక్తి ఫోన్ చేసి ఆర్డర్ ఇచ్చి.. ఆ షాప్ యజమాని అకౌంట్లోని డబ్బులన్నీ కొట్టేశాడు. అయితే, ఓ వ్యక్తి తనకు 15 కిలోల చికెన్ కావాలని ఫోన్ చేసినట్లు షాప్ యాజమని చెప్పాడు. చికెన్ కొట్టి రెడీ చేసిన తర్వాత ఫోన్ చేయాలని చెప్పినట్లు అతడు పేర్కొన్నాడు. దీంతో.. ఆ దుకాణా యజమాని భలే మంచి బేరం దొరికిందని సంతోషంతో.. ఆర్డర్ రెడీ చేసి.. వచ్చి తీసుకెళ్లాలని ఆర్డర్ ఇచ్చిన నెంబర్‌కు కాల్ చేశాడు. అయితే.. ఆ నెంబర్‌కు సదరు సైబర్ నేరగాడు రూ.5 సెండ్ చేశాడు.. బై మిస్టేక్‌లో నీ ఫోన్ కు ఐదు రూపాయలు వచ్చాయి.. వాటిని తిరిగి పంపించాలని చెప్పాడు.. అతని మాటలు నమ్మిన చికెన్ షాప్ యాజమాని ఆ ఐదు రూపాయలు రిఫండ్ చేశాడు. దీంతో.. తనకు డబ్బులు పంపించిన తర్వాత ఫోన్‌కు ఓ కోడ్ వస్తుందని సైబర్ నెరగాడు చెప్పాడు.. ఆ కోడ్ తనకు చెప్పాలని సూచించగా.. ఆ అమాయకపు యజమాని సైబర్ నేరగాడు చెప్పినట్లుగానే కోడ్ చెప్పాడు. అంతే.. క్షణాల్లోనే చికెన్ షాప్ యాజమాని అకౌంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయినట్టు మెసేజ్ వచ్చింది. ఇక, వెంటనే ఆ షాప్ యజమాని అకౌంట్లో రూ.9,489 ఉండగా.. మొత్తం కాజేశాడు ఆ సైబర్ నేరగాడు. అప్పుడు.. మోసపోయినట్లు గమనించిన చికెన్ షాప్ యజమాని 1930 నెంబర్‌కు ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వగా.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
*ఎన్డీఏలో చేరనున్న ఎస్బీఎస్పీ
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) చేరనుంది. ఎన్డిఎలో చేరుతున్నట్లు ఎస్బీఎస్పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఎస్బీఎస్పీ.. ఫలితాలు వెలువడిన కొన్ని నెలలకే ఆ పొత్తు నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా రాజ్‌భార్ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన ఒక రోజు తర్వాత.. తమ పార్టీ ఎన్టీఏలో చేరుతున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ పరిణామం రాజకీయంగా కీలకమైన తూర్పు యూపీ ప్రాంతంలో ఓబీసీలలో బీజేపీ తన బలమైన స్థావరాన్ని పటిష్టం చేయడంలో సహాయపడుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎన్డీయేలో ఎస్బీఎస్పీ చేరికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఓం ప్రకాష్ రాజ్‌భార్‌తో భేటీ కావడం జరిగిందని.. ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారని.. ఆయనను ఎన్డీయే కుటుంబానికి స్వాగతిస్తున్నానని ట్వీట్లో అమిత్ షా పేర్కొన్నారు. రాజ్‌భార్ రాకతో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీఏ బలపడుతుందని.. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నాయకత్వంలో ఎన్డీయే చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుందని ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్, ఘోసిలోని కనీసం రెండు లోక్‌సభ స్థానాల నుండి తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని రాజ్‌భార్ కోరినట్లు సమాచారం. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఆయనకు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ జిల్లాల్లో గణనీయమైన జనాభాను కలిగి ఉన్న రాజ్‌భార్ కమ్యూనిటీ.. ఎన్నికల్లో అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే లెక్కలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీఎస్పీ కనీసం నాలుగు సీట్లు గెలుచుకున్నప్పుడు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగంగా ఉంది. యోగి కేబినెట్లో రాజ్‌భార్‌ను తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు రావడంతో వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి ఎస్బీఎస్పీ పొత్తు ఏర్పరుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది నెలలకే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు నుంచి ప్రకాష్ రాజ్‌భార్ వైదొలిగారు.
*చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతం
చంద్రుడిపై రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 తొలి అడుగు విజయవంతమైంది. విజయవంతంగా రోదసి చేరిన చంద్రయాన్–3 ప్రయోగం 41 రోజుల ముఖ్యమైన ప్రయాణంలో కీలక దిశగా సాగుతోంది. దానికి జత చేసిన థ్రస్టర్లను మండించే ప్రక్రియను ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం నుంచే మొదలు ప్రారంభించారు. తద్వారా ఉపగ్రహాన్ని భూమి నుంచి కక్ష్య దూరం పెంచే ప్రక్రియ మొదలైంది. అంతిమంగా చంద్రయాన్–3ని ఆగస్టు 23న చంద్రుని దక్షిణ ధ్రువంపై వీలైనంత సున్నితంగా దించాలన్నది లక్ష్యంగా శాస్ర్తవేత్తలు ప్రయత్నిస్తున్నారు. చంద్రయాన్–3ని శుక్రవారం మధ్యాహ్నం ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) వేదికగా విజయవంతంగా ప్రయోగించడం తెలిసిందే. రోదసిలో దాని ప్రయాణం అద్భుతంగా సాగుతోందని తిరువనంతపురంలోని విక్రం సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ఎస్.ఉన్నికృష్ణన్ నాయర్ శనివారం మీడియాకు తెలిపారు. తొలి దశ ప్రయోగం నూటికి నూరు శాతం విజయవంతమైందన్నారు. చారిత్రాత్మక చంద్రయాన్-3 ప్రయోగంలో తొలి అడుగు విజయవంతమైందని ఉన్నికృష్ణన్ నాయర్ తెలిపారు. లాంచ్ వెహికల్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షనౌకకు అవసరమైన ప్రారంభ పరిస్థితులను చాలా ఖచ్చితంగా అందించినట్టు తెలిపారు. తొలి అడుగు వందశాతం విజయవంతం కావడంతో తుది అడుగు కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 41 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ కాలుమోపుతుంది. ఆ తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురుకానుంది. చంద్రయాన్-3లో అన్ని దేశీయంగా తయారైన పరికరాలే. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్ విక్రమ్ బరువు 1,723.89, రోవర్ ప్రజ్ఞాన్ బరువు 26 కేజీలు. చంద్రయాన్ గమ్యాన్ని ఎలా చేరుకుంటుందంటే.. చంద్రుడి సమీపంలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్-రోవర్.. పేలోడ్ ప్రొపల్షన్ నుంచి విడిపోయి ల్యాండ్ అవుతుంది. ఆపై రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది. లేజర్ కిరణాలను ఉపయోగించి చంద్రయాన్-3 మూన్కేక్స్, చంద్రుడి నేల కూర్పు, వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్ చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ప్రొపల్షన్ మాడ్యూల్ రిసీవర్‌కు పంపుతుంది. అక్కడి నుంచి అది శాస్త్రవేత్తలకు చేరుతుంది. చంద్రుడి కంపనాలపై అధ్యయనం చేసే ప్రజ్ఞాన్ ఫొటోగ్రాఫ్‌లను కూడా పంపుతుంది. ఉపరితలంపై ఓ ముక్కను కరిగించేందుకు, ఈ ప్రక్రియలో విడుదలయ్యే వాయువులను పరిశీలించేందుకు ప్రజ్ఞాన్ లేజర్ కిరణాలను ఉపయోగిస్తుంది.
*మాంత్రికుడిని చంపిన స్నేహితుడు
వారిద్దరు మంచి స్నేహితులు. చాలా కాలంగా ఒకే రూమ్‌లో కలిసి ఉంటున్నారు. కానీ వారి మధ్య అనుమానం అనే పెనుభూతం ఎంటరయింది. దీంతో ఒక స్నేహితునిపై మరొకతను ద్వేషం పెంచుకున్నాడు. తనను క్షుద్ర పూజలతో చంపేస్తాడనే అనుమానంతో స్నేహితుడినే చంపేశాడు. తనను చంపడమే కాకుండా.. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో మాంత్రికుడుని సొంత స్నేహితుడు చంపేశాడు. ఈ ఘటన చెన్నైలో జరిగింది. చెన్నైలోని వన్నారపేటకు చెందిన సయ్యద్ సికిందర్, విక్కి మంచి స్నేహితులు. ఇద్దరు కలిసి తిరుమంగళం పడికుప్పం గాంధీనగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్నేళ్ళుగా ఒకే రూమ్‌లో ఉండేవారు. వారిలో సికిందర్ క్షుద్రపూజలు చేస్తూ మాంత్రికుడిగా జీవనం సాగిస్తున్నాడు. మాంత్రికుడిగా కొనసాగుతున్న సికిందర్ తన తల్లితో చనువుగా ఉండటాన్ని విక్కి గమనించాడు. తల్లిపై క్షుద్రపూజలు చేసి ఆమెను లోంగతీసుకోవడమే కాకుండా .. తనను చంపడానికి సికిందర్ పూజలు చేస్తున్నడనే అనుమానించాడు విక్కి. ఈ అనుమానంతో సికిందర్‌ను చంపాలని విక్కి ప్లాన్ వేశాడు. ప్లాన్‌లో భాగంగా ఇంట్లో పూజలు చేయాలని సికిందర్‌ను తిరుమంగళంలోని ఇంటికి పిలిచాడు విక్కి. విషయం తెలియని సికిందర్ ఇంట్లో పూజలు చేస్తుండగా.. సికిందర్‌ను విక్కి కత్తితో పొడిచి చంపేశాడు.
*సలార్ విషయంలో బాంబ్ పేల్చిన విలన్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, KGF తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా ‘సలార్’. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న సలార్ నుంచి ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’ సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో తెరకెక్కిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ సలార్ టీజర్ బయటకి వచ్చింది. ప్రభాస్ ని డైనోసర్ తో పోల్చడంతో రెబల్ స్టార్ ఫాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అయ్యారు. ఆగస్టు నెలలో సలార్ నుంచి బ్యాక్ ట్ బ్యాక్ సర్ప్రైజ్ లు బయటకి రానున్నాయి. ఆగస్టుకి ఇంకా టైం ఉంది కానీ ఈలోపే సలార్ గురించి షాకింగ్ విషయం బయట పెట్టాడు జగ్గు భాయ్. సలార్ సినిమాలో రాజమన్నార్ పాత్రలో నటిస్తున్న జగ్గు భాయ్, ఫస్ట్ లుక్ కి టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో “సలార్ సినిమా కోసం నేను అయిదు రోజులు మాత్రమే షూట్ చేశాను” అని చెప్పి జగపతి బాబు షాక్ ఇచ్చాడు. లేటెస్ట్ గా సలార్ సినిమాలో నాకు ప్రభాస్ కి మధ్య కాంబినేషన్ సీన్స్ లేవంటూ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. సాలిడ్ యాక్షన్ ఫిల్మ్ లో హీరో-విలన్ కి మధ్య ఒక్క సీన్ కూడా లేకపోవడం ఏంటి అనే అయోమయం అందరిలో ఉంది. సలార్ ఫస్ట్ పార్ట్ లో జగ్గు భాయ్ vs సలార్ వార్ లేకపోయినా సెకండ్ పార్ట్ లో ఫుల్ లెంగ్త్ ఫేస్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పార్ట్ ‘సీజ్ ఫైర్’లో మాత్రం ప్రభాస్ vs పృథ్వీరాజ్ వార్ జరిగేలా ఉంది. మరి ఈ వార్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషనల్ నంబర్స్ ని రాబడుతుందో చూడాలి.