*మందులు అందడం లేదన్న మాట రోగుల నుంచి రాకూడదు: సీఎం జగన్
వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైయస్ జగన్ కీలక సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్షపై అధికారులు సీఎంకు వివరాలందించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు 1,22,69,512 కుటుంబాలను ఆరోగ్య సిబ్బంది సర్వే చేశారు. ఇప్పటి వరకూ మొత్తంగా 3,17,65,600 మందిని ఆరోగ్య సిబ్బంది కవర్ చేశారు. జగనన్న సురక్ష కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టనే కాదు, వైద్య ఆరోగ్య శాఖ ప్రతిష్టను కూడా పెంచుతుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రోగులు పూర్తిస్థాయిలో సంతృప్తి చెందాలని అధికారులను సూచించారు. రోగులకు ఇస్తున్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. ప్రతి కలెక్టర్‌కూ దీనిపై ప్రత్యేక ఆదేశాలు ఇవ్వడంతో పాటు కలెక్టర్‌కు మరిన్ని నిధులు ఇవ్వాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం సూచించారు. హెల్త్ క్యాంపులను నిర్వహించడమే కాదు, చికిత్స అవసరమని గుర్తించిన వారి ఆరోగ్యం బాగు అయ్యేంత వరకూ చేయిపట్టుకుని నడిపించాలన్నారు. సీఎం జగన్ అధికారులతో మాట్లాడుతూ.. “అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పాత పేషెంట్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పాత పేషెంట్ల విషయంలో చేయిపట్టుకుని నడిపించాలి . చికిత్స అనంతరం వీరు వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైనా సరే వారికి అందించాల్సిన బాధ్యత ఉంది, ఇది రెండో అంశం. క్రమం తప్పకుండా వారికి చెకప్‌లు చేసే బాధ్యత తీసుకోవాలి. ఆరోగ్య శ్రీలో కవర్ కాకుండా గతంలో చికిత్సలు చేయించుకున్న పాత రోగుల విషయంలో కూడా వారికి చేయూతను అందించడం అన్నది మూడో బాధ్యత . వీరి బాధ్యతను కూడా తీసుకునేలా ఎస్ఓపీని రూపొందించండి :ఆరోగ్య పరంగా, చికిత్సల పరంగా, చెకప్‌ల పరంగా, మందులపరంగా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా వారికి అవి తీర్చే దిశగా ఈ చేయూత ఉండాలి. ప్రతి సచివాలయం వారీగా ఇలా ఎవరెవరు ఉన్నారనేది వివరాలు తీసుకోండి. దీనికి అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే సమకూరుస్తుంది. విలేజ్‌క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌లతో దీన్ని అనుసంధానం చేయాలి. అంతే కాకుండా క్రమం తప్పకుండా హెల్త్‌క్యాంపులను నిర్వహించాలి. ప్రతీ నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి . రోగుల సంతృప్తి, క్యాంపుల్లో సదుపాయాలు, రోగులకు చేయూత నందించడం, ఆరోగ్య సురక్ష కార్యక్రమంమీద అవగాహన, విస్తృత ప్రచారం ఈ 4 అంశాలమీద తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలి. ఆరోగ్య సురక్ష మీద ప్రతి వారం క్రమం తప్పకుండా నా దగ్గర సమీక్షలు చేయాలి. ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలని తెలియని వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు. ఆరోగ్య శ్రీ చికిత్సల కోసం వెళ్లే రోగులకు ప్రయాణ ఛార్జీలు కూడా ఇవ్వాలి.” అని సీఎం అధికారులను ఆదేశించారు.
*చంద్రబాబు పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 17వ(మంగళవారం) తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. “స్కిల్ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు.. ఆయనకు అనేక కేసులను అంటకడుతూ ఇబ్బంది పెడుతున్నారు.. ఫైబర్ నెట్లోనూ చంద్రబాబుకు 17A చట్టం వర్తిస్తుంది. ” అని చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్దబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం శుక్రవారం నాడు మధ్యాహ్నం చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను విచారణను చేపట్టింది. ఇదిలా ఉంటే ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును రోహత్గీ ప్రస్తావించారు.చట్టం అమల్లో ఉన్నప్పుడు జరిగే నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని రోహత్గీ వాదించారు.చట్టం రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పుడు నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని రోహత్గీ వాదించారు. కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగినందున సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని రోహత్గీ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు. ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఫైబర్ నెట్ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందన్నారు. ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావన లేదన్నారు. కొందరికి ముందస్తు బెయిల్, మరి కొంతమందికి రెగ్యులర్ బెయిల్ ఉన్నప్పుడు చంద్రబాబుకు బెయిల్ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
*ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్ర బస్సు యాత్ర
ఈనెల 26 నుంచి ఉత్తరాంధ్రలో మొదటి దశ బస్సు యాత్రకు వైఎస్సార్సీపీ శ్రీకారం చుట్టనుంది. ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 13రోజుల పాటు ఉత్తరాంధ్రలో సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనుందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఏ విధంగా అవసరమో ప్రజలకు వివరిస్తామన్నారు. జగన్ మళ్లీ ఎందుకు రావాలో ప్రజలకు వివరిస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాలు తిప్పికొడతామన్నారు. సామాజిక, రాజకీయంగా నాలుగున్నరేళ్లలో వివిధ వర్గాలకు లభించిన సముచిత స్థానం ప్రజలకు చెప్పబోతున్నామన్నారు. మా పార్టీ విధానం మూడు రాజధానులు సాంకేతిక కారణాలతో ఆలస్యం అయ్యిందన్నారు. సాధ్యమైనంత త్వరితగతిన రావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నామన్నారు. త్వరలో విశాఖ నుంచి సమీక్షలు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి బొత్స వెల్లడించారు. చంద్రబాబుకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని.. సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని న్యాయస్థానం ఆదేశిస్తే అమలు చేస్తామన్నారు.
*తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్‌ల ఎంపిక.. హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యా
తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సందీప్ శాండిల్య 1993 ఐపీస్ బ్యాచ్ కి చెందిన అధికారి. గుంటూరులో మెదటి పోస్టింగ్ కాగా… నల్గొండ, ఆదిలాబాద్, కృష్ణా, సౌత్ జోన్ డీసీపీగా ఈయన పనిచేశారు. 2016 నుండి 2018 వరకు సైబారాబాద్ పోలీస్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. సీఐడి, ఇంటిలిజెంట్ సెక్యూరిటీ వింగ్, అడిషనల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో సందీప్ శాండిల్య పనిచేశారు. అంతేకాకుండా.. జైళ్లశాఖ డీజీగా మూడు నెలల పాటు పనిచేశారు. ప్రస్తుతం సందీప్ శాండిల్య పోలీస్ అకాడమీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది. రంగారెడ్డి కలెర్టర్గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశిష్ సంగవాన్ ను నియమించింది. ఇక సీపీల విషయానికొస్తే.. వరంగల్ కమిషనర్‌గా అంబర్ కిషోర్ ఝా, నిజామాబాద్ కమిషనర్‌గా కల్మేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేశ్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్థన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ ఖారే, కామారెడ్డి ఎస్పీగా సింధూశర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్ రఘునాథ్, సూర్యాపేట ఎస్పీగా రాహూల్ హెగ్డే, మహబూబాబాద్ ఎస్పీగా పాటిల్ సంగ్రం సింగ్, జగిత్యాల ఎస్పీగా సన్‌ప్రీత్ సింగ్, నారాయణపేట ఎస్పీగా యోగేశ్ గౌతం, జోగులాంబ గద్వాల ఎస్పీగా రితీరాజ్ బదిలీ అయ్యారు.
*”సిగరేట్ షేర్ చేసుకోలేదని”.. స్నేహితుడి దారుణహత్య
మద్యం మత్తులో తామ ఎంతటి దారుణానికి పాల్పడుతున్నారో తెలియలేదు. స్నేహితుడిని పొడిచి చంపారు. సిగరేట్ షేర్ చేసుకోలేదనే చిన్న కారణంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన రాజస్ఠాన్ లోని ఉదయ్‌పూర్‌లో చోటు చేసుకుంది.ఈ కేసులో ప్రధాన నిందితుడు జై అలియాస్ జితేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు రోహిత్, అతని స్నేమిితులు జై, సుమిత్ సింగ్‌లతో కలిసి మద్యం సేవించాడు. రోహిత్ సిగరేట్ తాగే సమయంలో తమకు ఇవ్వాల్సిందిగా జై కోరాడు. రోహిత్ ఇవ్వకపోవడంతో జై, సుమిత్ ఇద్దరు కలిసి దాడి చేసి కత్తితో పొడిచి చంపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ మరణించాడు. దాడి తర్వాత ఇద్దరు నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలో లభించిన సీసీటీవీ ఫుటేజీలో నిందితుడు కత్తితో దాడి చేసిన తర్వాత హడావుడిగా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హత్యలో ఇద్దరు నిందితుల ప్రయేయాన్ని సీసీటీవీలో రికార్డైన విజువల్స్ సూచిస్తున్నాయని పోలీసులు తెలిపారు. కొంతదూరం పారిపోయి, పడిపోయిన తమ సెల్ ఫోన్లు తీసుకోవడానికి వచ్చిన సమయంలో ఇద్దరు నిందితులు కెమెరాకు చిక్కారని పోలీసులు వెల్లడించారు. పారిపోయిన రెండో నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
*భారీ ఆపరేషన్‌కి ఇజ్రాయిల్ సిద్ధం.. 24 గంటల్లో గాజా ఖాళీ చేయాలని వార్నింగ్..
ఇజ్రాయిల్ చరిత్రలోనే అత్యంత దారుణమై దాడిని ఎదుర్కొంది. హమాస్ ఉగ్రవాదులు శనివారం ఇజ్రాయిల్ పై రాకెట్లు ద్వారా దాడులకు పాల్పడ్డారు. గాజా నుంచి ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని దారుణంగా హతమర్చారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై నిప్పుల వర్షం కురిపిస్తోంది. వైమానికి దాడులతో గాజా నగరాన్ని ధ్వంసం చేస్తోంది. ఇప్పటికే గాజాను అన్ని వైపుల నుంచి ఇజ్రాయిల్ దిగ్భందించింది. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 1200 మంది ఇజ్రాయిలీలు ప్రాణాలు కోల్పోగా, 150 మంది హమాస్ మిలిటెంట్లకు బందీలుగా చిక్కారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని 1500 మంది వరకు చనిపోయారు. ఇదిలా ఉంటే హమాస్ ను పూర్తిగా భూస్థాపితం చేసేందుకు ఇజ్రాయిల్ సమాయత్తం అవుతోంది. దీంతో పాటు గాజాలో ఉన్న బందీలను విడిపించేందుకు భారీ ఆపరేషన్‌కి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తర గాజాను 24 గంటల్లో ఖాళీ చేయాలని పాలస్తీనా వాసులకు వార్నింగ్ ఇచ్చింది. అయితే పాలస్తీయన్లలో చాలా మంది ఇప్పుడు దక్షిణాన ఉన్న ఈజిప్టు సరిహద్దులకు వెళ్తున్నారు. అయితే 1.2 మిలియన్ల జనాభా ఉన్నఉత్తర గాజా నుంచి వలస వెళ్లడం అసాధ్యమని ఐక్యరాజ్యసమితి చెప్పింది, ఈ ఆదేశాన్ని రద్దు చేసుకోవాలని ఇజ్రాయిల్ కి పిలుపునిచ్చింది. యూఎన్ ప్రకారం 4,23,000 మంది ఇప్పటికే తమ ఇళ్లను విచిపెట్టారని నివేదించింది. మరోవైపు హమాస్ ఉగ్రవాదులు ఉత్తర గాజాను ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ దాడుల్ని తిప్పి కొట్టేందుకు శుక్రవారం గాజా నుంచి వందలాది రాకెట్లను ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో 258 మంది సైనికులను కోల్పోయినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడించింది. అయితే ప్రపంచంలోనే అత్యధిక జనసాంద్రత ఉండే గాజా స్ట్రిప్ లో నేలపై నుంచి ఆపరేషన్ చేయడం ఇజ్రాయిల్ బలగాలకు సులువు కాదు. హమాస్ దాడిలో ప్రతీకారేచ్ఛతో ఉన్న ఇజ్రాయిలో 3 లక్షల మంది రిజర్వ్ ఆర్మీని సమీకరించింది. ఏ క్షణాల యుద్ధం మరిన్ని ప్రాంతాలకు పాకుతుందో అని ప్రపంచం బయపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ పైకి సిరియా, లెబనాన్ నుంచి మిలిటెంట్లు దాడులు చేస్తున్నారు. ఈ దాడుల్ని తిప్పికొడుతూ.. నిన్న సిరియాలోని డమాస్కస్, అలెప్పో విమానాశ్రయాలపై ఇజ్రాయిల్ దాడులు చేసింది.
*తల్లి గర్భం చీల్చి శిశువును చంపారు.. వెలుగులోకి హమాస్ దారుణాలు..
ఇజ్రాయిల్ లో హమాస్ జరిపిన హత్యాకాండలో దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించిన హమాస్ ఉగ్రవాదులు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మిషిన్ గన్లలో కాల్చుతూ.. పిల్లల తలలను తెగ నరుకుతూ అత్యంత పాశవిక దాడులకు పాల్పడ్డారు. గాజా సరిహద్దులోని ఓ కిబ్బుట్జ్ లో ఏకంగా 40 మంది పిల్లలను అత్యంత దారుణంగా చంపడం యావత్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఇదిలా ఉంటే తాజాగా మరో వికృత చర్య వెలుగులోకి వచ్చింది. తల్లి గర్భంలో ఉన్న శిశువును కూడా వదలిపెట్టలేదు హమాస్ ఉగ్రవాదులు, గర్బాన్ని చీల్చి, శిశువును దారుణంగా పొడిచి చంపారు. ఇజ్రాయిల్ లోని అష్దోద్ ప్రాంతానికి చెందిన యోసి లాండౌ, జాకా అనే సంస్థలో వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. ప్రమాదాలు, ప్రకృతి వివత్తుల సమయంలో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుంటాడు. గత మూడు దశాబ్దాలుగా ఆయన మరణించిన వారి మృతదేహాలు సేకరిస్తున్నాడు. అయితే హమాస్ దాడిలో మరణించిన మృతదేహాలను సేకరించేటప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఇంతటి మారణకాండని ఎప్పుడూ చూస్తాననుకోలేదని హత్యల గురించి వివరించాడు. ఓ గర్భిణి హత్యను చూసినప్పుడు కన్నీరు ఆపుకోలేదని చెప్పాడు. శనివారం సైరన్లు, హెచ్చరికలతో నిద్ర లేచామని, అంతలోనే హమాస్ ఉగ్రవాదులు చొచ్చుకువచ్చారని ఆయన వెల్లడించారు. దాడి జరిగిన తర్వాత మృతదేహాలు సేకరించేందుకు గాజా వైపు బయలుదేరామని, రోడ్డుపై కార్లు బోల్తా పడి ఉండటంతో పాటు మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని చెప్పారు. సాధారణంగా రోడ్డు దాటాలంటే 15 నిమిషాలు పడుతుందని, కానీ ప్రతీ మృతదేహాన్ని బ్యాగుల్లో పెట్టేందుకు ఏకంగా 11 గంటల సమయం పట్టిందని, అంతలా హమాస్ దాడి ఉందని అంతర్జాతీయ మీడియాతో తన అనుభవాలు పంచుకున్నాడు. గాజా ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిబ్బుట్జ్ లోని బిరి ప్రాంతానికి చేరుకున్నామని.. ఓ ఇంట్లో గర్బిణి మృతదేహం చూసి నాతో పాటు నా టీం మొత్తం స్పృహకోల్పోయేంత పనైందని, గర్బిణి పొట్టను చీల్చారని, అందులో బొడ్డుతాడు కూడా తెగని బిడ్డను పొడిచి చంపారంటూ కన్నీటిమున్నీరయ్యారు. కొందరి చేతులు వెనక్కి కట్టి హింసించి చంపడంతో పాటు, యువతులపై లైంగిక దాడులు జరిగాయని లాండౌ తెలిపాడు. ఈ ప్రాంతానికి సమీపంలోని సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పై హమాస్ జరిపిన దాడిలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు.
*ఒలింపిక్స్‌లో క్రికెట్‌కి ఆమోదం..లాస్ఏజెంల్స్ గేమ్స్ నుంచి ప్రారంభం..
ఎన్నాళ్ల నుంచో చర్చలో ఉన్న ఒలింపిక్స్‌లో కిక్రెట్ చేరిక అంశం ఖరారైంది. 2028 లాస్ ఏంజిల్స్ లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్ నుంచి క్రికెట్ ను కూడా చేర్చడానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ శుక్రవారం ఆమోదం తెలిపింది. క్రికెట్‌ని లాస్ ఏంజెల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ గేమ్స్‌లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది, ముంబైలో జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలోని రెండో రోజు తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, స్వ్కాష్, లాక్రోస్తో పాటు కొత్తగా చేర్చిన మరో 5 క్రీడల్లో క్రికెట్ కూడా ఉందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. క్రికెట్‌ని కూడా చేర్చాలనే లాస్ ఏంజెల్స్ నిర్వాహకులు ప్రతిపాదనను ఐఓసీ ఆమోదించిందని అన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)తో కలిసి పనిచేస్తామని, ఏ దేశ వ్యక్తిగత క్రికెట్ అధికారులతో కలిసి పనిచేయమని, ఐసీసీ సహకారంతో క్రికెట్ మరింత ప్రాచుర్యం పొందేలా చూస్తామని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు.
*అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వెదర్ అప్డేట్ ఇదే..!
రేపు(శనివారం) అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ కప్ 2023లో ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్-పాకిస్థాన్ విజయం సాధించాయి. అయితే రేపటి మ్యాచ్‌లో వాతావరణం గురించి మాట్లాడితే మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపదు. మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశం లేదు. ఇకపోతే.. ప్రేక్షకుల మితిమీరిన హీట్ వల్ల బాధపడాల్సిన అవసరం లేదు. అక్టోబర్ 14న వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో ఆకాశం నిర్మలంగా ఉంటుందని భావిస్తున్నారు. అహ్మదాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అందువల్ల పగటిపూట వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. భారత్-పాక్ మధ్య ఇప్పటి వరకు 134 వన్డే మ్యాచ్‌లు జరగడం గమనార్హం. అందులో టీమిండియా 56 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. పాకిస్థాన్ 73 మ్యాచ్‌లు గెలిచింది. గణాంకాల ప్రకారం చూస్తే.. పాకిస్థాన్ దే పైచేయి ఉంది. అయితే అహ్మదాబాద్‌లో పాకిస్తాన్ విజయం నమోదు చేయడం అతనికి అంత సులువు కాదు. భారత బ్యాట్స్మెన్లతో పాటు బౌలర్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. టీమిండియా బౌలింగ్ ఎటాక్ పాకిస్థాన్‌కు సమస్యగా మారనుంది. ఆసియా కప్ 2023లో భాగంగా.. కొలంబో వేదికగా భారత్-పాక్ మధ్య చివరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా 228 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. అంతకుముందు 2018లో పాకిస్థాన్‌తో భారత్ రెండు మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఆ తర్వాత 2019లో ఒక మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించింది.