ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హస్తినకు చేరుకున్నారు. సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలతో సీఎం భేటీ కానున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో ప్రస్తుతం ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా, ఇటీవల వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌లను తొలగించారు. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో సీఎం సహా 12 మంది ఉండగా.. మరో ఆరు ఖాళీలు ఉన్నాయి. వాటి భర్తీపై కూడా చర్చిస్తారని తెలుస్తోంది.
శబరిమలలో పెరిగిన భక్తుల రద్దీ:
శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతుంది. అయ్యప్ప భక్తుల రద్దీతో శబరిగిరులు కిక్కిరిసి పోతున్నాయి. పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. దీంతో అధికారులు అయ్యప్ప భక్తుల్ని మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. భక్తుల్ని నియంత్రించే క్రమంలో పోలీసులు వారిపై ఇప్పటికే పలుసార్లు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కేళర ప్రభుత్వంపై, పోలీసులపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుంది.
హైదరాబాదే టాప్:
దేశవ్యాప్తంగా ఓయో హోటల్ బుకింగ్స్ లో హైదరాబాద్ టాప్ ప్లేస్ లో నిలిచింది. మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా.. రెండో స్థానంలో బెంగుళూరు ఉంది. ప్రముఖ హాస్పిటాలిటీ టెక్ ప్లాట్‌ఫామ్ ఓయో ట్రావెలోపీడియా 2023 పేరిట సోమవారం ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది అత్యధికంగా ఓయో ద్వారా హోటల్ రూమ్స్ బుకింగ్ అయిన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని పేర్కొంది. అదే విధంగా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక టూరిస్ట్ ప్రదేశాల్లో జైపూర్ అగ్రస్థానంలో నిలవగా.. గోవా, మైసూర్, పుదుచ్చేరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాత్మిక ప్రదేశాల జాబితాలో పూరీ మొదటి ప్లేస్ లో నిలవగా.. అమృత్‌సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఓటమి నిరాశతో పార్లమెంట్‌కు అంతరాయం కలిగిస్తున్నారు:
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షం తీవ్ర నిరాశకు గురైందని, అందుకే పార్లమెంట్ నిర్వహణకు అడ్డుపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశానికి ఉజ్వల భవిష్యత్తు అందించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంటే.. కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని ‘ఇండియా కూటమి’ లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మంగళవారం ఉదయం న్యూఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల వ్యవహారశైలిపై ఎంపీలతో చర్చించారు.
హాలీవుడ్ యాక్టర్ హఠాన్మరణం:
మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్‌లో మాక్స్ పేన్‌కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసి ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు జేమ్స్ మెక్‌కాఫ్రీ 65 ఏళ్ల వయసులో మరణించారు. ఇటీవలే “అలన్ వేక్ 2”లో అలెక్స్ కేసీకి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసిన జేమ్స్ క్యాన్సర్‌తో పోరాడి ఆదివారం మరణించినట్లు సమాచారం. జేమ్స్ మెక్‌కాఫ్రీకి మల్టిపుల్ మైలోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. వీడియో గేమ్ సిరీస్ కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేయడం కన్నా ముందు, జేమ్స్ మెక్‌కాఫ్రీ 30 సంవత్సరాలకు పైగా సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో కూడా నటించాడు. 80ల నుంచే నటిస్తున్న జేమ్స్… “న్యూయార్క్ అండర్ కవర్” ప్రాజెక్ట్ తో ఫేమ్ తెచ్చుకున్నాడు. 2004లో FX కి చెందిన “రెస్క్యూ మీ”లో జేమ్స్ కెరీర్ బెస్ట్ రోల్ ప్లే చేసాడు.
జై హనుమాన్ ట్రైలర్ అదుర్స్:
జాంబీరెడ్డి సినిమాతో ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా మంచి హిట్ కొట్టారు. ఇప్పుడు ఇదే కాంబినేషన్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘హనుమాన్’ సినిమా చేస్తోంది. చిన్న రీజనల్ సినిమాగా అనౌన్స్ అయిన ఈ మూవీ ఈరోజు పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా పేరు తెచ్చుకుంది. ప్రమోషనల్ కంటెంట్ తో విషయం ఉండడం, ప్రశాంత్ వర్మపై ఆడియన్స్ కి ఉన్న నమ్మకం హనుమాన్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతున్న హనుమాన్ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ క్వాలిటీ చూస్తే పర్ఫెక్ట్ పాన్ ఇండియా బొమ్మ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది.
స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. వేలం ఆరంభంకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ హెడ్ కోచ్ టామ్ మూడీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను ఎవరూ కొనుగోలు చేయరని మూడీ జోస్యం చెప్పాడు.