China: మాల్దీవులు, భారత్‌ని కాదని డ్రాగన్ దేశం చైనాతో సంబంధాలను పెంచుకుంటోంది. కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ భారత్ వ్యతిరేక, చైనా అనుకూల ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికులను వెళ్లిపోవాల్సిందిగా ఆదేశిస్తున్నారు. తాజాగా మాల్దీవులు, చైనాతో రక్షణ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం జరిగిన తర్వాతి రోజే ముయిజ్జూ భాతర వ్యతిరేక స్వరం పెంచుతూ.. భారత్ సైనికులే కాకుండా, పౌర దుస్తుల్లో ఉన్న ప్రతీ ఒక్కరు వెళ్లిపోవాల్సిందే అని ఆదేశించాడు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి తిరుగులేని ఆమోదం.. 75 శాతం “అప్రూవల్ రేటింగ్” ఉన్నట్లు తాజా సర్వే..
ఇదిలా ఉంటే మాల్దీవులతో సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు కలిసి పనిచేస్తామని చైనా మంగళవారం చెప్పింది. రెండు దేశాల సాధారణ సహకారం మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవడం కాదని, పరోక్షంగా భారత్‌ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేసింది. మూడో పక్షం ప్రయోజనాలకు అంతరాయం కలగదని చెప్పింది. మాల్దీవులతో చైనా సైనిక ఒప్పందం గురించి చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మరింత విస్తృతంగా, సమగ్ర వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని నిర్మించడానికి మాల్దీవులతో కలిసి పనిచేయడానికి చైనా కట్టుబడి ఉంది అని ఆమె చెప్పారు.
మాల్దీవుల రక్షణ మంత్రి మొహమ్మద్ ఘసన్ మౌమూన్, చైనా సైనిక అధికారి మేజర్ జనరల్ జాంగ్ బావోకున్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. అయితే రక్షణ సహకార ఒప్పందానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇటీవల చైనా గూఢచార నౌకలు డాక్ చేయడానికి మాల్దీవులు అనుమతి ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ సైనిక ఒప్పందం వెలుగులోకి వచ్చింది.