Visakha Steel Plant: విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్‌ఐఎన్‌ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఈవోఐ జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖ ఉక్కు విక్రయానికి ఈవోఐ జారీ చేయలేదని తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ చేపట్టే సమయం, అందుకు నిర్దేశించిన ధర, విక్రయానికి సంబంధించిన నియమ నిబంధనలు, నాన్-కోర్ అసెట్స్, మైన్స్, అనుబంధ పరిశ్రమలు, యూనిట్లు, జాయింట్ వెంచర్లలో ఆర్‌ఐఎన్‌ఎల్ వాటా వంటి అంశాలు పరిగణలోనికి తీసుకున్న తర్వాత మాత్రమే విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు మంత్రి చెప్పారు. సేలం స్టీల్, దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్, భద్రావతి స్టీల్ ప్లాంట్‌లలో పెట్టుబడుల ఉపసంహరణపై బిడ్డర్లు ఆసక్తి చూపనందునే ఆయా స్టీల్ ప్లాంట్‌ల విక్రయ ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు మంత్రి వెల్లడించారు.
Read Also: MP Vijayasai Reddy: ఏపీ ప్రజలు కాంగ్రెస్‌ను ఎన్నటికీ క్షమించరు..
ఏపీలో 32754 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఐదేళ్లలో 32754 టన్నుల ముడి ఇనుమును ఉత్పత్తి చేసినట్లు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా బదులిస్తూ ఏపీలో 2018-19లో 6933 టన్నులు, 2019-20లో 6539 టన్నులు, 2020-21లో 5898 టన్నులు, 2021-22లో 7096 టన్నులు, 2022-23లో 6288 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఐదేళ్లలో మొత్తం 5,71,093 టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి జరిగినట్లు మంత్రి తెలిపారు. ముడి ఇనుము ఉత్పత్తిలో 2014లో నాల్గవ స్థానంలో ఉన్న ఇండియా 2018లో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండవ స్థానానికి చేరిందని మంత్రి పేర్కొన్నారు. ఇండియా 2018లో 109.3 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో రెండవ స్థానానికి చేరుకోగా, జపాన్ 104.3 మెట్రిక్ టన్నులు ఉత్పత్తిచేసి 3వ స్థానానికి పడిపోయిందని తెలిపారు. ఇండియా ఐదేళ్లలో ఇనుము ఉత్తత్తిలో 55.7% వృద్ధి సాధించిందని, 2013-14 లో 81.69 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేయగా 2022-23 లో 127.20 మెట్రిక్ టన్నులు స్టీల్ ఉత్పత్తి చేసిందని తెలిపారు. గత 10 ఏళ్లుగా స్టీల్ ఉత్పత్తిలో ఇండియా 5% సీఐజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించిందని మంత్రి వెల్లడించారు. స్టీల్ క్రమబద్దీకరించిన రంగం కావడంతో ఈ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తుందని, జాతీయ స్టీల్ పాలసీ 2017 కింద ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి పలు చర్యలు చేపడుతుందని మంత్రి తెలిపారు.
Read Also: Lok Sabha: లోక్‌సభ ముందుకు ‘దేశం పేరు మార్పు’ అంశం
తాడేపల్లిగూడెంలో 71.24 కోట్లతో అమృత్ పనులు
ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద 71.24కోట్లతో చేపట్టిన ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావచ్చని కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కౌశల్ కిశోర్ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ పట్టణంలో పార్కులు అభివృద్ధికి నాలుగు ప్రాజెక్టులు, నీటి సరఫరాకు 3 ప్రాజెక్టులు, సీవేజ్, సెప్టేజ్ నిర్వహణకు 2 ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్క్‌ల అభివృద్ధికి కేటాయించిన నాలుగు ప్రాజెక్టుల్లో మూడు ప్రాజెక్టులు పూర్తికాగా మరో ప్రాజెక్టుకు సంబంధించి కాంట్రాక్ట్ ఖరారైనట్లు తెలిపారు అలాగే నీటి సరఫరాకు సంబంధించిన మూడు ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టు పూర్తికాగా మిగిలిన రెండు ప్రాజెక్టులకు కాంట్రాక్ట్ ఖరారు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు భూసేకరణలో జాప్యం, కోవిడ్ మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరిగిందని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి అభివృద్ధి పనులు పూర్తి కావచ్చని మంత్రి తెలిపారు