దేశం పేరు మార్చాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియా పేరును భారత్‌గా మార్చాలని డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. తాజాగా మళ్లీ లోక్‌సభలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ ఈ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని మొదటి పేరాలో ‘ఇండియా’ అంటే ‘భారత్’ అన్న ప్రస్తావన ఉందని.. ఇండియా అనే పదానికి స్వస్తి పలికి దేశం పేరుని ‘భారత్’గా మార్చాలని ఆయన కోరారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మన భారత్ విజ్ఞాన శక్తికి కేంద్రంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎంతో గొప్పదైన మన దేశం పేరుని ‘భారత్’గా మార్చాలని కోరారు.
వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘జీ20 సదస్సు’ సమయంలో దేశం పేరు మార్పుపై ఎంత హంగామా జరిగింది. రాష్ట్రపతి డిన్నర్ ఆహ్వాన పత్రిక దగ్గర నుంచి ప్రధాని మోడీ టేబుల్ దాకా.. దాదాపు ప్రతిచోటా ఇండియాకి బదులు ‘భారత్’ పేరుని వాడటంతో ‘దేశం పేరు మార్పు’ అంశం బాగా హైలైట్ అయింది. అదే టైంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు కూడా నిర్వహించడంతో.. బహుశా దేశం పేరు మార్పుపై తీర్మానం చేయొచ్చన్న వాదనలూ వినిపించాయి. కానీ అప్పుడు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు దేశం పేరు మార్పుకి మద్దతిస్తే.. మరికొందరు వ్యతిరేకించారు. దీంతో ఈ అంశంపై సద్దుమణిగింది. తాజాగా మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.
ఇది కూడా చదవండి:CM Revanth Reddy: తెలంగాణ నుంచి పోటీ చేయండి.. సోనియా గాంధీని కోరిన రేవంత్‌రెడ్డి..